వృత్తి నైపుణ్యాలతో మహిళల అభివృద్ధి

– లక్ష్యం స్వచ్ఛంద సంస్థ సేవలు ఆదర్శనీయం
– పెద్దవంగరలో మిల్లెట్ తయారీ కేంద్రం ప్రారంభం 
– నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్ 
నవతెలంగాణ –  పెద్దవంగర
వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, తొర్రూరు ప్రాజెక్ట్ సీడీపీఓ హైమవతి, కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల కోఆర్డినేటర్ మాలతీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మిల్లెట్ తయారీ కేంద్రాన్ని లక్ష్యం స్వచ్ఛంద సంస్థ సీఈవో తల్లూరి లత తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడడానికి నాబార్డ్ అన్ని విధాల చేయూతను అందిస్తుందన్నారు. మహిళల అభివృద్ధికి  నాబార్డ్ అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మిల్లెట్ తయారీ, మార్కెటింగ్ చేయడంలో లక్ష్యం స్వచ్ఛంద సంస్థ పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. సీఈఓ తల్లూరి లత మాట్లాడుతూ.. మిల్లెట్ ఆహార ఉత్పత్తుల తయారీకి నాబార్డ్ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారం ప్రాముఖ్యత, వినియోగంపై అవగాహన కల్పిస్తూ, లక్ష్యం సంస్థ ఆధ్వర్యంలో మిల్లెట్ తయారీ పై మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకొని, పౌష్టికాహార ఉత్పత్తులు మిల్లెట్ తయారు చేస్తుందన్నారు. చిన్నవంగర, పెద్దవంగర, ఉప్పెరగూడెం గ్రామాలకు చెందిన 90 మంది మహిళలను ఈ శిక్షణ శిబిరానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో లక్ష్యం స్వచ్ఛంద సంస్థ చైర్మన్ తల్లూరి శంకర్, రిసోర్స్ పర్సన్ స్వరూప, ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత రెడ్డి, సీసీ పద్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love