ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం పొందాలన్నా, దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌కార్డు తప్పనిసరి. కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు, కొత్తగా పొందడానికి, ఉన్నవారు ఫోన్ నెంబరును లింకు, పైగా తాజా ఫొటో చేర్చాలనే నిబంధనతో ఇంటిల్లిపాది ‘మీసేవ’, ఆధార్ అఫ్‌డేట్ కేంద్రాల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వకాలం నుంచి కొత్త రేషన్‌కార్డులు అందించకపోగా మార్పులకు కూడా నోచని దుస్థితి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీకి హామీనిచ్చినా.. ప్రకటనలే తప్ప సరైన స్పష్టత లేదనే విమర్శలనేకం.ఈ నేపథ్యంలో ఆధార్ ఆఫ్‌డేట్ సమస్యలు, రేషన్‌కార్డుకోసం దరఖాస్తుదారుల తిప్పలు, వెరసి యువత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది.
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా యాభై శాతం వరకు బ్యాంకుల ద్వారా రుణాలిప్పించి యూనిట్‌ను బట్టి రూ.40వేల నుంచి 80 వేల వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ పథకానికి మార్గదర్శకాలు రాకపోయినా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ ఐదు గడువు. గతంలో ఆయా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి డేటాను వెబ్‌సైట్ నుంచి తొలగించకపోవడంతో కొత్తగా దరఖాస్తులు ఎంట్రీ కావడం లేదు.దీంతో నిరుద్యోగ యువత ఇబ్బందుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు. ఈ పథకానికి కూడా రేషన్ కార్డుతో ముడి పెట్టడంతో కార్డులు లేని వాళ్లు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి. దీంతో నిరుద్యోగుల కష్టాలు వర్ణణాతీతం.
కొత్తగా పెండ్లయినవారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్‌కార్డు నుంచి పేర్లు రద్దు చేసుకుని కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి కొత్తవి రాకపోగా, ఉన్న పాత రేషన్‌కార్డులో పేరు డిలీట్ కావడంతో తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం సైతం పొందలేకపోతున్నామని యువత ఆవే దన చెందుతున్నది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా.. కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేం దుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో దరఖాస్తు దారుల పరిస్థితి ‘కొండ నాలుకకు మందేస్తే..ఉన్న నాలుక ఊడిందన్న’ చందంగా మారింది.
మరోవైపు కోటి ఆశలతో రాజీవ్ యువ వికాసం పథకానికి యువత చేసుకుంటున్న దరఖాస్తులు తిరస్కరణకు గురవుతూ నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు కుమ్మరిస్తున్నాయి. కుటుంబంలో ఒక్కరికే అవకాశం కల్పించడమేగాక, రేషన్‌కార్డు ఉంటేనే పథకానికి అర్హులని సర్కారు షరతులు విధించింది. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుని.. లబ్ధి పొందని వారికి ఈ సమస్య మెడకు గుదిబండలా మారింది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి అవ కాశాలు పొందని వారు రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తులో ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే ‘ఆల్రెడీ అప్లయిడ్’ అని చూపుతోంది. వీరే కాకుండా.. వికలాంగులు ఆ శాఖ ద్వారా స్వయం ఉపాధి కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నవారి పరిస్థితీ అంతే. అసలు వీరిలో లబ్ధిదారుల ఎంపికే జరగలేదు. కానీ, యువ వికాసం కింద దరఖాస్తు కోసం ప్రయత్నిస్తే అప్లరు చేసినట్టే సైట్‌లో కనిపిస్తోంది. ఈ పరిణామాలతో స్వయం ఉపాధి పొందాలనుకున్న నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో పడింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు చాలా కాలం నుంచి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అందించే ప్రక్రియను నిలిపేశాయి. దీంతో ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పథకం ఒక ఆశాజ్యోతిగా ఉంది. దీనికితోడు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పథకానికి రూ.ఆరు వేల కోట్లు కేటాయించడంతో దాదాపు ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించే అవకాశాలున్నాయి. అదే కనుక సక్రమంగా అమలు జరిగితే యువత నెత్తిన సర్కార్ పాలు పోసినట్టే. ఒకవైపు దరఖాస్తుకు గడువు చూస్తే ముంచుకొస్తుంది. మరోవైపు ఈ ఇబ్బందులు యువతను కలవర పెడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సత్వరమే రేషన్ కార్డులను జారీ చేసి, దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించాలి. కనీసం గతంలో చేసిన దరఖాస్తులనైనా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా గతంలో దరఖాస్తుదారులు నమోదు చేసిన వివరాలను అధికారులు తొలగించకపోవడం వల్లే తలెత్తుతున్న సమస్యలను సైతం పరిష్కరించాల్సిన అవసరం ఏంతైనా ఉంది. దీనిపై ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. లేదంటే అంతిమంగా నష్టపోయేది పేదపిల్లలే..ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే అభాగ్యులే.