– జెడ్పీ సీఈవో నాగలక్ష్మి
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిణి నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఆసుపాక గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్) యూనిట్‌ను తనిఖీ చేసి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం గుమ్మడవల్లిలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటారు. అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సమాఖ్య భవన పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఊట్లపల్లిలో నిర్మించనున్న గ్రామ సమాఖ్య భవనానికి నాగలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాల్మీకి కిశోర్, పంచాయతీరాజ్ ఏఈ అక్షిత, ఏపీఓ కిలాపర్తి రామచంద్రరావు, సంబంధిత అధికారులు, స్థానిక సర్పంచులు పాల్గొన్నారు.



