అవినీతి ఇన్చార్జి కమిషనర్ ను తొలగించాలని ధర్నా

నవతెలంగాణ – తిరుమలగిరి

తిరుమలగిరి మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ గా విధులు  నిర్వర్తిస్తున్న దండు శ్రీనివాసును తొలగించి పర్మినెంట్ కమిషనర్ ను నియమించాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజిని రాజశేఖర్  కార్యాలయం ఎదుట బైఠాయించి దాదాపు నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ గా దండు శ్రీనివాస్ అవినీతికి పాల్పడుతున్నారని, కమిషన్ల పేరుతో  కోర్టులో ఉన్న వివాదపు భూములకు  అనుమతులు ఇస్తున్నారని, మున్సిపల్ కార్యాలయంలో జరిగే పనులకు, సమావేశాలకు  సంబంధించి చైర్మన్ ను సంప్రదించకుండా ఎలాంటి సమాచారం అందించకుండా చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై ప్రశ్నిస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదని నా ఇష్టప్రకారమే చేసుకుంటానంటూ దురుసుగా, అమర్యాదగా మాట్లాడుతున్నారని, మున్సిపల్ సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్లో ఉద్యోగస్తుల రెన్యువల్ కోసం ఎజెండలో మాట తీసుకొచ్చి పాలకపక్షం మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటే తమకు పాలకపక్షం మీటింగ్ ఏర్పాటు చేసే హక్కు లేదంటూ తమను అగౌరపరిచారన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక చైర్మన్ గా  పాలక పక్ష మీటింగ్ పెట్టే హక్కు లేదా అని వాదించారు. మున్సిపల్ లో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అన్ని తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ లో పర్మినెంట్ ఉద్యోగాలను నియమించాల్సి ఉండగా కమిషన్లకు అలవాటు పడి అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చి తాత్కాలిక సిబ్బందితో పనులు చేయిస్తూ సరిగా విధులకు హాజరు కాకపోయినా నెల నెల  జీతాలు ఇస్తూ  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇటువంటి అవినీతికి పాల్పడిన ఇంచార్జి కమిషనర్ దండు శ్రీనివాసుని తొలగించి రెగ్యులర్ కమీషనర్ నియమించాలని కోరారు.
Spread the love