Monday, May 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతు నెత్తిపై డీజిల్‌ గుదిబండ

రైతు నెత్తిపై డీజిల్‌ గుదిబండ

- Advertisement -

ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు అదనపు ఖర్చు
దున్నకం నుంచి రవాణా వరకు 
ప్రత్యక్ష‍ ప్రభావం
ఎరువుల ధరలు 
కూడా పెరిగే అవకాశం!

తెలంగాణ రైతాంగంపై దాదాపు రూ. 5 వేల కోట్ల భారం

‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మోడీ సర్కారు పది రోజుల వ్యవధిలో మూడు సార్లు డీజిల్‌ ‌ధరల రేట్లను పెంచడం రైతాంగం నెత్తిపై గుదిబండగా మారింది. ఇప్పటికే ‌లీటర్‌ డీజిల్‌‌పై రూ.5 వరకు పెంచిన ఆయిల్‌ ‌కంపెనీలు మరో రూ.25 వరకు పెంచుకునే అవకాశం కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. అదే జరిగితే వ్యవసాయం సంక్ష‍ోభంలోకి కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తుంది. తెలంగాణ రైతాంగంపై ఈ వానాకాలం సీజన్‌‌లో డీజిల్‌ ‌ధరల పెంపు వల్ల రూ.3 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశముందని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. రోహిణి కార్తె ప్రారంభమైంది. ఇప్పటికే అన్నదాతలు వానాకాలం పంటల సాగు కోసం సన్నద్దమవుతున్నారు. రాష్ట్రంలో సుమారు కోటీ 36 లక్ష‍ల ఎకరాల మేరకు భూమి సాగవుతున్నది. అందులో కోటికిపైగా ఎకరాల్లో ట్రాక్టర్ల ఆధారితంగానే రైతులు వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఎద్దులతో దున్నకం చాలా పరిమితమైంది.

దున్నకం నుంచి పండించిన పంటలను మార్కెట్‌‌కు తరలించేదాకా గ్రామీణ వ్యవసాయంలో ట్రాక్టర్లదే కీలక భూమిక. మే నెల ద్వితీయ పక్ష‍ంలో పెద్దనాగళ్లతో భూములను లోతుగా దున్నించడం ఆనవాయితీ. అది భూమి ఆరోగ్యానికి కూడా మేలు చేసే ప్రక్రియ. ఇటువంటి పరిస్థితుల్లో పుండు మీద కారం చల్లినట్టు పది రోజుల వ్యవధిలోనే డీజిల్‌ ‌ధరలు మూడు సార్లు పెరిగాయి. డీజిల్‌ ‌ధరల పెంపు ప్రభావం భూముల దున్నకాలపై నేరుగా పడబోతున్నది. తెలంగాణలో ఎర్రరేగడి, నల్లరేగడి, దుబ్బలు, ఎర్రచెల్కలు, సౌడునేలలు వంటి భూములు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని పెద్దనాగళ్లతో ఎకరా దున్నేందుకు గత సీజన్‌‌లో రైతుల నుంచి రూ.1500 నుంచి రూ.2,500 వరకు ట్రాక్టర్ల వాళ్లు వసూలు చేశారు. ఇప్పుడు డీజిల్‌ ‌ధరలు పెరిగాక దాన్ని రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెంచారు. సీజన్‌ ‌డిమాండ్‌‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువే అడుగుతున్నారు. ఇలా ఒక్క వేసవి దున్నకాల ద్వారానే రైతులపై రూ.700 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల వరకు తెలంగాణ రైతాంగంపై భారం పడుతుంది.

ఏడు నాగళ్ల ద్వారా ఎకరా దున్నకానికి రూ.1300 నుంచి రూ.1800 వరకు, కల్టివేటర్‌‌కు రూ.800, పొడి దుక్కిలో గుంట్క కొడితే ఎకరాకు రూ.800 నుంచి రూ.1200, పత్తిచేన్లలో గుంట్క కొడితే రూ.1,000 నుంచి రూ.1500 వరకు, పంట చేన్లలో రసాయన మందుల పిచికారీకి ఎకరాకు రూ.250 నుంచి రూ.500 వరకు తీసుకుంటున్నారు. డీజిల్‌ ‌ధరల పెరుగుదలతో వీటికి రేట్లు రూ.300 నుంచి రూ.700 వరకు పెరిగనున్నాయి. డీజిల్‌, పెట్రోల్‌ ‌ధరలు కూడా వరుసగా పెరుగుతుండటంతో ఆ ప్రభావం ఎరువుల ధరల పెరుగుదలపైనా ప్రత్యక్ష‍ంగా పడుతోంది. పంటలు పండిన తర్వాత మార్కెట్లకు తరలించడానికి, ఇండ్లకు తరలించడానికి, కూలీలను చేన్ల వద్దకు తరలించడానికి ఆటోలు, ట్రాక్టర్ల రవాణా చార్జీలు కూడా పెరిగే అవకాశముంది. ఇలా భూమిని చదును చేసే దగ్గర నుంచి పంటలను అమ్ముకునేదాకా డీజిల్‌ ‌ధరల ఎఫెక్ట్‌ ‌రైతులపై నేరుగా పడబోతున్నది.

పెరుగుదలకు కేంద్రమే కారణం…
పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరలను తగ్గించే అవకాశాలున్నప్పటికీ విదేశాంగ విధానంలో మోడీ సర్కారు అనురిస్తున్న విధానాల ప్రభావం ప్రతిబంధకంగా మారింది. రష్యా, ఇరాన్‌ ‌వంటి దేశాల నుంచి తక్కువ ధరకు ముడి చమురు వచ్చే అవకాశమున్నప్పటికీ అమెరికా ఒత్తిళ్లకు లొంగి ఆ రెండు దేశాలకు మన దేశం క్రమంగా దూరమవుతున్నది. మరోవైపు ఆధిపత్యం కోసం ఇరాన్‌‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ ‌యుద్ధం ప్రభావం వల్ల చమురు ధరలపై నేరుగా పడుతున్నది. ఈ యుద్ధం విషయంలోనూ అలీన విధానాన్ని పక్కనబెట్టి మోడీ సర్కారు ఇజ్రాయిల్‌, అమెరికా దేశాలకు వంత పాడుతున్నది. అదే సమయంలో కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టే చర్యల్లో భాగంగా దొడ్డిదారిన రైతాంగంపై భారాలు మోపే చర్యలకు ఉపక్రమించింది. ఒకవేళ రైతులపై నిజంగానే కేంద్ర పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కష్టకాలంలో ప్రజలపై ఆయిల్‌ ‌కంపెనీలు భారాలు మోపుతున్న సమయంలో తాము వేస్తున్న పన్నుల శాతాన్ని తగ్గించే అవకాశమున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించడం లేదు.

పాలకులకు చిత్తశుద్ధి లేదు
మద్దతు ధరలు పెంచామని కేంద్ర పాలకులు, బీజేపీ నాయకులు గొప్పలు చెప్పకుంటున్నారు. కానీ రైతులకు పావలా పెంచి పది రూపాయలు లాక్కుంటున్న సంగతిని ప్రజలు గమనించాలి. మద్దతు ధరల నిర్ణయం సందర్భంలో ఆయిల్‌ ‌ధరల పెంపు అంశాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌‌పై వేస్తున్న పన్నుల భారాన్ని తగ్గించుకునే ఆలోచన చేయాలి. రైతులకు పెట్టుబడి భారం పెరుగుతున్నది. ఆ మేరకు మద్దతు ధరలు పెంచడం లేదు. కొనుగోళ్లను పూర్తి స్థాయిలో కొనడం లేదు. దీనివల్ల రైతులపై అదనపు ఆర్థిక భారం పడి, సాగులో నష్టం మిగులుతుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన అనుబంధ రంగాల ధరల పెంపు నుంచి పన్ను రాయితీలు ఇవ్వాలి.
టి.సాగర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -