ఇంట్లోనే చేసుకునేలా…

To make at home..వంటలకు అదనపు టేస్ట్‌ ఇవ్వాలంటే… వాటిలో పనీర్‌ చేర్చాలి. అయితే బయటి దుకాణాల్లో లభించే పనీర్‌ తాజాది కాకపోవచ్చు. అది వంటలకు అంత టేస్ట్‌ ఇవ్వకపోవచ్చు. అదే ఇంట్లోనే దాన్ని తయారు చేసుకుంటే ఎంతో తాజాగా ఉంటుంది. వంటలు మరింత టేస్టీగా ఉంటాయి. పైగా బయట లభించే పనీర్‌లో నిల్వ ఉండేందుకు రంగులు, ఇతర మిశ్రమాల్ని కలిపే ప్రమాదం ఉంటుంది. అందుకే పనీర్‌ను ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
– ఆరు కప్పుల పాలు తీసుకుని ఓ గిన్నెలో పోసి మీడియం మంట మీద పెట్టి కాగబెట్టాలి. పాలు కాగుతూ ఉన్నప్పుడు రెండు చెంచాల వెనిగర్‌ లేదా నిమ్మ రసం అందులో వేయాలి. ఇప్పుడు పాలను నిమిషం పాటు అటూ ఇటూ కదుపుతూ ఉండాలి. వాటిలో పాలు నీరు వేరవుతాయి. ఒక వేళ అలా అవ్వకపోతే అయ్యే వరకూ కదుపుతూ కాగబెడుతూండాలి. కచ్చితంగా పాలు, నీరూ వేరయిపోతాయి.
– స్టవ్‌ ఆఫ్‌ చేసి, పెద్ద పల్చటి గుడ్డలో పోసి వడగట్టాలి. నీరు కిందికి పోయి గుడ్డలో పాల ముద్ద మిగులుతుంది. వెంటనే చల్లటి నీటిని ఆ పాల ముద్దపై పోయాలి. ఇలా చేయడం వల్ల వెనిగర్‌ వాసన లేదా నిమ్మరసం వాసన తొలగిపోతుంది. ఇలా పాల ముద్ద మొత్తాన్నీ నీటితో కడిగేయాలి.
– అధికంగా ఉన్న నీరు మొత్తం తీసేయాలి. అంటే గుడ్డలో పాల ముద్దను బిగించి కట్టి గాలి తగిలే చోట అర గంట పాటు వేలాడదీయాలి. ఇలా చేస్తే అందులో ఉన్న నీరు మొత్తం పోతుంది. అరగంట తర్వాత కూడా ఆ పాల ముద్దలో ఎంతోకొంత నీటి ఆవిరి ఉంటుంది. అది పోవడానికి ఆ ముద్దపై ఏదైనా భారీ బరువైన పాత్రను మూడు నాలుగు గంటల పాటూ ఉంచాలి. అంతే తాజా పనీర్‌ తయారైనట్టే.
– ఈ పనీరును చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి ఫ్లవర్‌ ఫ్యాట్‌ మిల్క్‌ అయితే మేలు. సాధారణ పాలతో ఎక్కువ పనీర్‌ తయారవ్వదు. పాలు చాలా చిక్కగా ఉండాలి. ఈ పనీరును ఆవు పాలు, గేదె పాలు, మేక పాలతోనూ తయారు చేయవచ్చు. కానీ పాలలో కొవ్వు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

Spread the love