– ఆరూరి పార్టీలో చేరుతారో లేదో తెలియదు
– ప్రజల వద్దకు అభివృద్ధి ఎజెండాతో ప్రధాని మోడీ
– 15, 16, 18 తేదీల్లో రాష్ట్రానికి ప్రధాని రాక : ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజాసింగ్‌పై ఎవ్వరికీ అనుమానం అక్కర్లేదనీ, బీజేపీ పట్ల నిబద్ధత గల ఆయన సేవలను పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించుకుంటామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తమ పార్టీలో చేరుతారా? లేదా? అనేది తనకు తెలియదన్నారు. ప్రజల వద్దకు ప్రధాని మోడీ అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తున్నారనీ, రాష్ట్రంలో శుక్ర, శని, ఆదివారాల్లో ఆయన పర్యటిస్తారని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ 15 రోజులుగా దేశంలో లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని తెలిపారు. విపక్షాలు అభివృద్ధి ఎజెండాను పక్కదోవ పట్టించేందుకు కుటుంబ, వంశపారంపర్య రాజకీయాలను తెరపైకి తెస్తున్నాయని విమర్శించారు. సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల పౌరసత్వాలను రద్దు చేస్తామని ఎవ్వరూ చెప్పలేదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తామంటే కుదరదనీ, తర్వాత చేస్తామంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి తమ సర్కార్‌ను కూలగొట్టాలని చూస్తున్నాయని రేవంత్‌రెడ్డి పదేపదే ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. అభద్రతాభావంతో ఆయన ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సర్కారును కాపాడుకోకుంటే ఆయన ఖర్మ అన్నారు. ఎన్నికల ద్వారానే తెలంగాణలో అధికారంలోకి వస్తామని నొక్కిచెప్పారు. కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురలో జీరో సీటు నుంచి ఏకంగా అధికారంలోకి వచ్చామనీ, అలాంటిది ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.
పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించే నేతలను చేర్చుకుంటున్నదనీ, దాడి చేసిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని మానేతలు ప్రశ్నిస్తే వారికి జవాబు చెప్పి నచ్చజెప్పుతామన్నారు.
కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకట్లేదు
– పక్కపార్టీల్లో టికెట్ రాని నేతల కోసం పాకులాట : కొండా
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదనీ, అందుకే పక్కపార్టీల్లో టికెట్లు దక్కని నేతల కోసం పాకులాడుతున్నారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు సీఎం రేవంత్‌రెడ్డిని కూడా బయట నుంచి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జితేందర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడనీ, ఆయనకు టికెట్ రాకపోవడం బాధాకరమని అన్నారు. ఆయన పార్టీ మారుతాడని తాను భావించడంలేదని తెలిపారు. బీజేపీలోకి రంజిత్‌రెడ్డి వస్తానన్నా తనకేం అభ్యంతరం లేదనీ, తానెవ్వరినీ పార్టీలోకి రాకుండా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో 12 నుంచి 13 సీట్లు, తమిళనాడులో ఐదారు సీట్లను బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఓ సిద్ధాంతం ఉందన్నారు. కొన్ని పార్టీలు అవసరాలకు అనుగుణంగా సిద్ధాంతాలను మార్చుకుంటాయని విమర్శించారు. విమోచన దినోత్సవంపై మొదటి నుంచీ బీజేపీ ఒకే అభిప్రాయంతో ఉందన్నారు. సీఏఏ ఎవ్వరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. ముస్లింలు పౌరసత్వం కోల్పోతారని కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల ఎవ్వరికీ నష్టం ఉండదని నొక్కి చెప్పారు. చేవెళ్లలో సర్వే చేయించామనీ, బీజేపీ గెలువబోతున్నదని రిపోర్టు వచ్చిందని చెప్పారు. ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించకముందే తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఒక రౌండ్ ప్రచారం పూర్తయిందన్నారు. లిక్కర్ కేసులో రాష్ట్రానికి చెందిన డబ్బులున్నాయనీ, రాష్ట్ర ప్రభుత్వం మారినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.