– ఢిల్లీ హైకోర్ట్ కీలక తీర్పు
– గతంలో భిన్నమైన తీర్పులు ఇచ్చిన కర్నాటక, కేరళ న్యాయస్థానాలు
న్యూఢిల్లీ : డిజిటల్ ఆధారానికి సంబంధించిన పాస్‌వర్డ్‌ను వెల్లడించాల్సిందిగా నిందితుడిని బలవంతం చేయకూడదని ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. సంకేత్ భద్రేష్ మోడీ, సీబీఐ మధ్య నడుస్తున్న ఓ కేసులో న్యాయస్థానం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, మానవ హక్కులను ముఖ్యంగా గోప్యతకు సంబంధించిన హక్కును ఈ తీర్పు పరిరక్షించిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. మరో కేసులో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది భిన్నంగా ఉండడం గమనార్హం.
గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కూడా ఢిల్లీ కోర్టు తీర్పు భిన్నంగానే ఉంది. నిందితుడి మొబైల్ ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని తీసుకునే హక్కు ప్రాసిక్యూషన్‌కు ఉన్నదంటూ కేరళ హైకోర్టు ఓ కేసులో రూలింగ్ ఇచ్చింది. అలా తీసుకోవడం ఆర్టికల్ 20 (3) ప్రకారం రాజ్యాంగపరమైన హక్కును ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకునే సమయంలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు ఇప్పటికే పెండింగులో ఉన్నాయి.
ఏమిటీ కేసు ?
ఈ-సంపర్క్ సాఫ్‌టెక్ కంపెనీ, దాని డైరెక్టర్లు భారత్‌లోని మోసపూరిత కాల్ సెంటర్ల నుండి అమెరికా పౌరులకు 20 మిలియన్ డాలర్ల విలువ కలిగిన ఫోన్ కాల్స్ చేసి, కుంభకోణానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న సంకేత్ భద్రేష్ మోడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని సీబీఐ వ్యతిరేకించింది. కుంభకోణానికి నిందితుడే సూత్రధారి అని, ఆయన తన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈ-మెయిల్ ఖాతాలు, క్రిప్టో వాలెట్ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను అందజేయలేదని తెలిపింది. అయితే లాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల చుట్టూనే ఈ కేసు నడుస్తోందని, వాటిని ఇప్పటికే దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్నదని న్యాయమూర్తి బెనర్జీ గుర్తు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. పౌరులకు ఆర్టికల్ 20 (3) కింద రాజ్యాంగపరంగా లభించిన రక్షణకు దర్యాప్తు సంస్థలు ఆటంకం కలిగించరాదని చురక వేశారు.