– ప్రాణ ప్రతిష్ట రోజు జొమాటోకు బీజేపీ పాలిత రాష్ట్రాల హుకుం
న్యూఢిల్లీ : అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన సోమవారం నాడు వినియోగదారులకు మాంసాహారం సరఫరా చేయవద్దంటూ బీజేపీ ఏలుబడిలోని ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలు జొమాటోకు హుకుం జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అధికారులు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని జొమాటో తెలిపింది. ఈ నిర్ణయంపై సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల ఆహార అలవాట్లను నిర్దేశించడమేమిటని నెటిజన్లు మండిపడ్డారు. తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రజలకు ఉన్న హక్కుపై ఆంక్షలు విధించారని, మెజారిటీ ప్రజల సెంటిమెంటును గౌరవించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు. కాగా బీజేపీ పాలనలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ప్రాణ ప్రతిష్ట రోజు మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. మాంసం దుకాణాలను మూసేయాలని ఆదేశించారు. ఇదిలావుండగా స్విగ్గీ కూడా తన అనుబంధ రెస్టారెంట్లకు ఓ సందేశాన్ని పంపింది. మాంసం, చేపలు, మద్యం అమ్మకాలపై సోమవారం రాష్ట్ర వ్యాప్త నిషేధం విధించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసిందని పేర్కొంది. ‘ఈ ఆదేశాలకు అనుగుణంగా మీ మెనూ నుండి అన్ని రకాల మాంసాహార పదార్థాలను తొలగిస్తోంది. ఈ మెనూ తిరిగి మంగళవారం నుండి వినియోగంలోకి వస్తుంది’ అని వివరించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా వినియోగదారులకు మాంసాహార పదార్థాలు అందించలేదు.