పింపుల్స్, మచ్చలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా మారడానికి రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటుంటారు. ఫేషియల్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఫేషియల్ చేయించుకున్న తర్వాత తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మం తిరిగి కాంతిహీనంగా మారుతుంది. అందుకే ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేషియల్స్ ముఖంపై చర్మాన్ని రిలాక్స్‌గా, రిఫ్రెష్‌గా, మెరిసేలా చేస్తాయి. చర్మానికి రక్త ప్రసరణను, శోషరస ప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్త ప్రవాహాన్ని ప్రసరింపజేయడం ద్వారా చర్మ కణాలను పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి. మెరుగైన రక్త ప్రసరణ వల్ల చర్మం నుండి టాక్సిన్స్ తొలగిపోతాయి. అలాగే పోషకాలు, ప్రోటీన్లు, ఆక్సిజన్ అందిస్తాయి. చర్మంలోకి పోషకాలు చొప్పించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– చర్మంపై పేరుకుపోయిన దుమ్ము ధూళిని, మతకణాలను తొలగించడానికి సున్నితమైన క్లెన్సర్ వాడాలి. ఏదైనా క్లెన్సర్ వాడే ముందు పరీక్షించుకోవాలి.
– ఫేషియల్ తర్వాత చర్మం పొడిబారినట్లుగా, సున్నితంగా మారవచ్చు. తేమను తిరిగి పొందడానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
– శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. అందుకోసం పుష్కలంగా నీరు తాగాలి. దీని వల్ల చర్మం తేమగా ఉంటుంది. మృదువుగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. నాణ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవాలి. ఫేషియల్ చేయించుకున్న తర్వాత ముఖం ఎర్రగా మారినా, దురద, మొటిమలు వంటి అలెర్జీలు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– సన్‌స్క్రీన్ రాసుకోవడం మర్చిపోకూడదు. సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల సూర్యుడి నుండి వెలువడే హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ లభిస్తుంది. కనీసం SPF-30 ఉన్న సన్‌స్క్రీన్ ఎంచుకోవడం మర్చిపోవద్దు.
చేయకూడని పనులు
– ఫేషియల్ చేయడం ద్వారా చర్మం లోతుగా ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. అందుకే వెంటనే మేకప్ వేయడం, కాస్మోటిక్స్ వాడటం వల్ల అవి చర్మ రంధ్రాల్లోకి వెళ్తాయి. దీని వల్ల చికాకు కలుగుతుంది. మొటిమలు రావడానికి కారణమవుతుంది.
– ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించడానికి వాక్సింగ్ చేయాలనుకుంటే ఫేషియల్ చేయించుకోవడానికి రెండు, మూడు రోజుల ముందు వాక్సింగ్ చేయించుకోవడం మంచిది. ఫేషియల్ ద్వారా చర్మం లోతుగా ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇలాంటప్పుడు వాక్సింగ్ చేస్తే చర్మ రంధ్రాల్లోకి బ్యాక్టీరియా చేరుతుంది.
– అధిక వేడి లేదా చెమట కలిగించేలా వేడి ప్రాంతాల్లో ఉండకూడదు. స్టీమ్ బాత్, హాట్ వాటర్, ఎండలోకి వెళ్లడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. చికాకు కలిగిస్తుంది.
– చాలా మంది ముఖాన్ని తాకుతుంటారు. ఎక్కడెక్కడో ముట్టుకున్న తర్వాత అవే చేతులతో ముఖాన్ని తాకడం ద్వారా చేతులకు ఉండే మురికి, బ్యాక్టీరియా ముఖంపైకి చేరతాయి. దీని వల్ల చర్మంపై మచ్చల్లాంటివి ఏర్పడతాయి.
– కెమికల్ పీల్స్ వాడటం ఎట్టిపరిస్థితుల్లోనూ మంచిది కాదు. దీని వల్ల చర్మ సమస్యలు రావొచ్చు.