సింగరేణిని కాపాడుకుందాం.. కొత్త గనులు కేటాయించకపోతే సంస్థ మనుగడ కష్టమే..
కార్మిక ఐక్యతతోనే ప్రభుత్వాల కుట్రలకు చెక్
పర్మినెంట్, కాంట్రాక్టు విభజనతో కార్మికుల మధ్య చిచ్చు
రూ.50 వేల కోట్ల విద్యుత్ బకాయిలతో
సింగరేణిపై తీవ్ర ఆర్థిక భారం
జులై 1 నుంచి దేశవ్యాప్త పోరాటాలు
సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్తాతో
‘ నవతెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
నవతెలంగాణ-గోదావరిఖని
‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రయివేటీకరణ కుట్రల వల్ల దేశీయ బొగ్గు రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. ఒకే సంస్థలో, ఒకే రకమైన పని చేస్తున్నా.. పర్మినెంట్, కాంట్రాక్టు వ్యవస్థల పేరిట ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా కార్మికులను విడదీసి వారి ఐక్యతను దెబ్బతీసేందుకు వ్యవహరిస్తున్నాయి. సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన చారిత్రక బాధ్యత అందరిపై ఉంది..’’ సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు సుదీప్ దత్తా వివరించారు. ఇటీవల గోదావరిఖనిలో జరిగిన ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సెమినార్‌కు హాజరైన సుదీప్ దత్తాతో ‘నవతెలంగాణ’ ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు.
నవతెలంగాణ: సింగరేణి ప్రస్తుత ఉత్పాదకత, సంస్థ స్థితిగతులు ఎలా ఉన్నాయి?
సుదీప్ దత్తా: సంస్థలో కొన్నేండ్లుగా బొగ్గు ఉత్పాదకత 65 నుంచి 70 మిలియన్ టన్నుల వద్దే స్తంభించిపోయింది. ఉత్పత్తిని పెంచేందుకు యాజమాన్యం వద్ద ఎలాంటి నిర్దిష్టమైన, ప్రభావవంతమైన ప్రణాళికలూ లేవు. ఎక్కువ ఉత్పత్తినిచ్చే పాత గనులు అడుగంటిపోతున్నాయి. తద్వారా వాటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సంస్థ భవిష్యత్ అనేది కొత్త, అధిక ఉత్పాదకత కలిగిన గనుల బ్లాకులను సాధించుకోవడంపైనే ఆధారపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్త బ్లాకులను కేటాయించకుండా, ఉన్న గనులపైనే ఉత్పత్తి పెంచాలని ఒత్తిడి తెస్తోంది. దీనివల్ల గనుల్లో రక్షణ లోపించి ప్రమాదాలు జరుగుతున్నాయి.
సింగరేణిపై వస్తున్న రాజకీయ ఆరోపణలు, విమర్శలపై మీ స్పందన ఏంటి?
సింగరేణిపై అధికార, ప్రతిపక్షాలు చేసుకుంటున్న రాజకీయ ఆరోపణలు పైపైన కనిపించేవి మాత్రమే. అసలు అవినీతి అంతా యాజమాన్య స్థాయిలో, పాలక వర్గాల అండతోనే జరుగుతోంది. సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ప్రధానంగా వ్యవస్థాగతమైనవే. ప్రభుత్వాల తప్పుడు విధానాలకు సంబంధించినవే.
కాంట్రాక్ట్ కార్మికుల భద్రత, రక్షణ చర్యలపై మీరేమంటారు?
భద్రతాపరంగా కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైన ప్రాణ సంకటాన్ని ఎదుర్కొంటున్నారు. డీజీ మైన్స్ (డీజీఎమ్‌ఎస్) లాంటి తనిఖీ, నిర్ణయాధికార వ్యవస్థల అధికారాలను ప్రభుత్వాలు క్రమంగా తగ్గించేశాయి. దీనివల్ల గనుల్లో సరైన భద్రతా విధానాలు అమలు కావడం లేదు. ఫలితంగా గనుల్లో అత్యధిక ప్రమాదాలు, మరణాలు కాంట్రాక్ట్ కార్మికులకే సంభవిస్తున్నాయి. ఒకే సంస్థలో పని చేస్తున్నా పర్మనెంట్, కాంట్రాక్టు పేరిట వేతనాలు, రక్షణ సౌకర్యాల్లో తీవ్ర వ్యత్యాసం చూపడం ప్రభుత్వాల కుట్ర పూరిత వైఖరికి నిదర్శనంగా చెప్పొచ్చు.
సింగరేణి మనుగడకు ఆర్థికంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి?
సంస్థను ప్రభుత్వాలే ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. రాష్ట్ర జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు సింగరేణికి దాదాపు రూ.50 వేల కోట్ల బొగ్గు బకాయిలు పడ్డాయి. ఈ భారీ బకాయిల వల్ల సింగరేణి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రోజువారీ కార్యకలాపాల కోసం అధిక వడ్డీలకు బయట అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది సంస్థ మనుగడకే పెద్ద ముప్పుగా మారుతోంది.
కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త నిబంధనల
ప్రభావం ఎలా ఉండబోతోంది?
కేంద్ర ప్రభుత్వం దేశీయ సంస్థలను దెబ్బతీసి, విదేశీ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తోంది. విదేశీ బొగ్గును విద్యుత్ సంస్థలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలంటూ కేంద్రం నిబంధనలు పెట్టింది. దీనివల్ల దేశీయ బొగ్గుకు డిమాండ్ తగ్గి మన సంస్థలు మూతపడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, విదేశీ బొగ్గు కొనుగోలు వల్ల పెరిగే అదనపు ఆర్థిక భారం అంతా చివరికి విద్యుత్ వినియోగదారులైన దేశ ప్రజలపైనే పడుతుంది.
కార్మికుల సమస్యల పరిష్కారానికి, సింగరేణి రక్షణకు సీఐటీయూ భవిష్యత్ వ్యూహం ఏంటి?
సీఐటీయూ ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుంది. ప్రతి గని స్థాయికి చేరుకుని కార్మికుల వ్యక్తిగత, ఉమ్మడి సమస్యలను వింటున్నాం. సమస్యల పరిష్కారం కోసం గని, ప్రాజెక్ట్ మేనేజర్ల స్థాయిలోనే వినతిపత్రాలు ఇచ్చి ఒత్తిడి తెస్తున్నాం. ప్రభుత్వాల కండ్లు తెరిపించేందుకు జులై 1 నుంచి దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాం. సింగరేణి కార్మికులకు సంబంధించినది మాత్రమే కాదు. దీనిపై ఆధారపడి ఎంతో మంది వ్యాపారులు, ఇతర వృత్తుల వారు జీవనోపాధి పొందుతున్నారు. అందుకే కార్మికులు, యూనియన్లతో పాటు ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ ఒక విస్తృత ‘ప్రజా ఐక్యత ఉద్యమాన్ని’ నిర్మిస్తున్నాం. అందరూ వాస్తవాలను గ్రహించి ఈ పోరాటంలో కలిసి రావాలని పిలుపునిస్తున్నాను.



