చారిత్రాత్మకమైన వేతన ఒప్పందం చేస్తాం : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
సీఐటీయూకు ఐఎన్టీయూసీ మద్దతు
పరిశ్రమ ఆవరణలో గేట్ మీటింగ్
నవతెలంగాణ-రామచంద్రాపురం
పెన్నార్ కార్మికులకు పరిశ్రమలో చారిత్రాత్మక వేతన ఒప్పందం చేయిస్తామని, ఈ ఎన్నికల్లో సీఐటీయూనే గెలిపించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కార్మికులను కోరారు. సంగారెడి జిల్లా రామ చంద్రాపురం మున్సిపల్ పరిధిలోని పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా పరిశ్రమ ఆవరణలో గురువారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. పెన్నార్ పరిశ్రమలో చారిత్రకమైన వేతన ఒప్పందం చేసి చూపిస్తామని, కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌టీయూ కార్మికులను మోసం చేసిందని, ఏ సమస్య కూడా పరిష్కరించలేదని విమర్శించారు. పరిశ్రమలో బీఆర్టీయూ రూ.9 వేతన ఒప్పందం చేస్తామని చెప్పి రూ.5500 మాత్రమే చేసిందన్నారు. ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా మేనేజ్‌మెంట్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. మహిళల సమస్యలు ఒక్కటీ పరిష్కరించలేదని, పైగా ట్రాన్స్‌పోర్టు సౌకర్యాన్ని ఎత్తేశారన్నారు. అనేక పరిశ్రమల్లో వేతన ఒప్పందాలు చేస్తున్న అనుభవం ఉన్న నాయకులు సీఐటీయూలో ఉన్నారని, అందుకే ఇక్కడా గెలిపించాలని కోరారు. ఇదే పరిశ్రమంలో 565 మందిని పర్మినెంట్ చేయించిన చరిత్ర సీఐటీయూకు ఉందని, రెండు వేతన ఒప్పందాల్లో అనేక సౌకర్యాలు సాధించామని గుర్తు చేశారు. బీఆర్‌టీయూ మాత్రం బోనస్ తక్కువగా ఇప్పించిందని, యూని ఫామ్, గిఫ్టు బూట్లు కూడా ఇప్పించలేదని తెలిపారు. ఈసారి ఓడిపోతుందని తెలిసే ఆ సంఘం నాయకులు కార్మికుల ఇంటింటిటీ తిరిగి డబ్బులు, మద్యం పంచుతున్నారని ఆరోపించారు. నిరంతరం కార్మికుల పక్షాన పనిచేస్తున్న సీఐటీయూనే గెలిపించాలని, చుక్క గుర్తుకే ఓటేయాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూకు ఐఎన్టీయూసీ మద్దతు
కార్మికులకు నిరంతరం సేవ చేస్తున్న సీఐటీయూకు ఐఎన్టీయూసీ మద్దతిస్తుందని, సీఐటీయూనే గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్జి కాట శ్రీనివాస్ గౌడ్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. పటాన్‌చెరు ప్రాంతాల్లో అవినీతిపరులు ఎన్నికల్లోకి వస్తున్నారని, వాళ్లను ఓడించాలని కోరారు. పెన్నార్ కార్మికులకు సీఐటీయూ మంచి చేస్తుందనే మద్దతిస్తున్నామని ప్రకటించారు. అనుభవం ఉన్న నాయకులు సీఐటీయూలో ఉన్నారని, కార్మికుల కోసం నిరంతరం సేవ చేసే సంఘం సీఐటీయూ అని, అందుకే గెలిపించాలని కార్మికులను కోరారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు మల్లేష్, కోశాధికారి కె.రాజయ్య, నాయకులు పాండురంగారెడ్డి, శేషగిరి, త్రిమూర్తులు, రెహమాన్, శివపాలు తదితరులు మాట్లాడారు. సీఐటీయూ ద్వారానే పెన్నార్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, సీఐటీయూను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు మాధవ రాజు, జయ కుమార్, చంద్ర కిరణ్ సింగ్, అర్జున్, రాజు, మాణిక్యం, నాగేశ్వరరావు, శాంతకుమార్, మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జయమ్మ, శ్రీశైలం, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘పెన్నార్’లో సీఐటీయూని గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



