డోనాల్డ్‌ ట్రంప్‌ – కిస్సింజర్‌ విరుద్ధ వ్యూహం

Donald Trump-Kissinger Contrast Strategyఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్‌చేసి, తన ప్రభుత్వం ఉక్రెయిన్‌లో శాంతి ప్రక్రియకు కట్టుబడి ఉంటుందని చెప్పాడు. ఈ ఒప్పందంలో భాగంగా తూర్పు ఉక్రెయిన్‌, క్రిమియాలోని కొన్ని భాగాలు రష్యా చేతుల్లోనే ఉంటాయని ట్రంప్‌ పాలనా విభాగం స్పష్టం చేసింది. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) ప్రధాన కార్యాలయం వద్ద ట్రంప్‌ రక్షణ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ 2014కు ముందున్న తన సరిహద్దులకు తిరిగి వెళ్తుందనే భావన, అంటే క్రిమియా రష్యాతో జరిగే చర్చల్లో భాగం కాదనేది ”అవాస్తవమని” అన్నాడు. అమెరికాకు సంబంధించి నంత వరకు, ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం సాధ్యం కాదని అన్నాడు. అమెరికా, యూరోపియన్‌ భద్రతపైన ప్రాథమికంగా కేంద్రీకరించడమే కాకుండా ప్రధానంగా తన సొంత దేశ ప్రయోజనాల పైనే దష్టి పెట్టిందని హెగ్సెత్‌ నాటోతో చెప్పాడు. నాటోలో యూరోపియన్‌ నాయకులు చేయగలిగింది, చర్చల్లో ఉక్రెయిన్‌కు స్థానం కల్పించాలని డిమాండ్‌ చేయడమే. అయితే రష్యా చర్చలకు రావడానికి రాయితీలివ్వాలన్న అమెరికా చేసిన ఒత్తిడికి వ్యతిరేకంగా చాలా కొద్దిమందే మాట్లాడారు. ఉక్రెయిన్‌, యూరోప్‌లు తమ అభిప్రాయాల్ని తెలియజేయవచ్చు కానీ ట్రంప్‌ మాత్రమే ఎజెండాను నిర్ణయిస్తాడని హెగ్సెత్‌ అన్నాడు. ”దేన్ని అనుమతిస్తాడు, దేన్ని అనుమతించడనేది స్వేచ్ఛాయుత ప్రపంచ నాయకుడు, ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పరిధిలో ఉంటుంది”.
హెగ్సెత్‌ బ్రస్సెల్స్‌లో ఉండగా, ట్రంప్‌ తన సన్నిహితుడైన ఎలోన్‌మస్క్‌తో వాషింగ్టన్‌లో ఉన్నాడు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలని వారిరువురూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గడచిన ఐదు దశాబ్దాలకు పైగా అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యంగా సాంఘిక సంక్షేమ కేటా యింపుల విషయంలో బాగా కుంచించుకు పోయింది. ఆయుధ పరిశ్రమ లాంటి పెద్ద కార్పోరేషన్‌ల పర్యవేక్షణలో రక్షించబడిన ప్రాంతాలు మిగిలాయి. ఈ పరిశ్రమ ఎప్పుడూ అపవిత్రం కానిదిగానే కనిపించింది. అమెరికాలో సైనిక వ్యయంలో కోత విధిస్తే అది కొనసాగడం అసాధ్యం. అయితే ఆయుధ పరిశ్రమ విశ్రాంతిగా ఉండడం తేలిక. మస్క్‌, అతని బందం మిలిటరీ ఒప్పందాల్ని తగ్గించబోవడం లేదు, కానీ మిలిటరీ, పౌర ఉద్యోగుల వెంట పడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు ఏడుగురు నాలుగు నక్షత్రాల (ఫోర్‌ స్టార్‌) జనరల్స్‌ ఉండగా, ఇప్పుడు అమెరికాకు 44 మంది అలాంటి వారున్నారు. సిబ్బంది సంఖ్య, యుద్ధంలో విజయాల మధ్య ఒక విలోమ సంబంధం ఉంటుంది. మాకు ఎక్కువ మంది ఉన్నతాధికారులు అవసరం లేదు, దిగువ స్థాయిలో పోరాడే యోధుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ట్రంప్‌ పాలనా విభాగం ఈ చర్యల్ని ప్రాథమికమైన తప్పులుగా అర్థం చేసుకుంటుంది.”అమెరికాకు ప్రథమ స్థానం” ఇచ్చేందుకు కట్టుబడి, తనకు ప్రయోజనం లేని, ఖర్చుతో కూడిన యుద్ధాల కొనసాగింపునకు ఇష్టపడని అధ్యక్షుని అసాధారణ దురుసుతనంగా వీటిని కొన్ని సందర్భాల్లో చూస్తున్నారు. కానీ ఇది, ఉక్రెయిన్‌, అమెరికా మిలిటరీకి సంబంధించి, పుతిన్‌తో మాట్లాడిన ట్రంప్‌ హ్రస్వ దష్టితో కూడిన తప్పుడు అంచనా. దీన్ని ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోని వ్యూహంగా చూడడం కంటే, చైనాను ఒంటరిని చేయడానికి ట్రంప్‌, రష్యాతో స్నేహంగా ఉండేందుకు కిస్సింజర్‌ విరుద్ధ వ్యూహాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం చేసుకోవడం ముఖ్యం.
రష్యా, అమెరికా ఉనికికి ముప్పుగా పరిణమించదనే విషయం ట్రంప్‌కు తెలుసు. యూరోప్‌కు రష్యా ఇంధన అమ్మకాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వానికె లాంటి భయం లేదు. ఎందుకంటే, ఈ ప్రాథమిక సరుకుల అమ్మకాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా కున్న అదుపును బలహీనపర్చడానికి సాహసించవు. అయితే చైనా వేగవంతమైన శాస్త్ర, సాంకేతిక అభివద్ధితోపాటు నూతన ఉత్పత్తి శక్తులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రంగాల్లో అమెరికా ఆధిపత్యానికి ముప్పు కలిగిస్తాయి. కూటములు, శత్రువుల పట్ల ట్రంప్‌ వైఖరిని ప్రేరేపించేది, అమెరికా దష్టిలో ఉన్న చైనా నుండి వచ్చే ముప్పే.
కిస్సింజర్‌ వ్యూహం : రష్యాను ఒంటరి చేయడానికి చైనాతో స్నేహం
హెన్రీ కిస్సింజర్‌ (1923-2023) అత్యంత ప్రభావవంతమైన అమెరికా విదేశాంగ విధానం అధికారుల్లో ఒకరు. 1969 నుండి 1974 వరకు రిచర్డ్‌ నిక్సన్‌ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కిస్సింజర్‌, అమెరికా విదేశాంగ విధానాన్ని నిర్వహించాడు. నిక్సన్‌, కిస్సింజర్‌లు ఇరువురూ సోవియట్‌ యూనియన్‌, పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (పీఆర్‌ సీ)ల మధ్య ఉన్న వివాదాన్ని చాలా దగ్గరగా చూశారు. నిక్సన్‌ అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు, జెన్బావో ద్వీపం చుట్టూ ఉన్న రష్యా-చైనా సరిహద్దు వివాదం, బీజింగ్‌పై సోవియట్‌ యూనియన్‌ అణుదాడితో మరింత తీవ్రమైంది. రెండు పెద్ద యూరేషియన్‌ దేశాలు అట్లాంటిక్‌ కూటమికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన యూనియన్‌ను నిర్మించకుండా అడ్డుకున్నందున ఈ వివాదం అమెరికాకు చాలా విలువైనదిగా కిస్సింజర్‌ గుర్తించాడు. రష్యా, చైనాలు ఏకమైతే, అవి ప్రపంచంలోని పాశ్చాత్య శక్తుల పునాదుల్ని బలహీనపరుస్తాయని కిస్సింజర్‌కు తెలుసు. ఆ కూటమిని అడ్డుకోవాలంటే, ఈ రెండు దేశాల మధ్య ఒక లోతైన చీలికను సష్టించడానికి చైనా, సోవియట్ల వివాదాన్ని ఉపయోగించుకోవడం కిస్సింజర్‌ విధానం. చైనాతో కుదిరిన సయోధ్య, అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా వియత్నాం జాతీయ విముక్తి దళాల యుద్ధంలో వారికి సేనల కదలికల వ్యూహానికి సంబంధి ంచిన మార్గాన్ని మూసేయడానికి అమెరికాకు అనుమతిచ్చింది. ఆ కారణంతో కిస్సింజర్‌, 1970లో పాకిస్థాన్‌ ద్వారా చైనా ప్రభుత్వంతో రహస్య చర్చలు ప్రారంభించి, 1971 లో రహస్యంగా బీజింగ్‌ పర్యటించాడు. ఆ విధంగా ఆ తర్వాత సంవత్సరం నిక్సన్‌ చైనా సందర్శనకు మార్గం సుగమం చేశాడు. తన చైనా పర్యటన తరువాత వైట్‌ హౌస్‌ సిబ్బందితో జరిగిన రహస్య సంభాషణలో కిస్సింజర్‌ ముఖ్యమైన వ్యాఖ్య చేశాడు: ”చైనీయులు చాలా గంభీరమైన మనుషులు. వారు మన మంచిని కోరుకోరు. ఆ విషయంలో మనకెలాంటి భ్రమల్లేవు. అయితే సోవియట్‌ ఒత్తిడి, ఆగేయాసియాలోని పరిస్థితితో మన మొత్తం పరిస్థితుల దష్ట్యా చైనీయులను తీసుకొనిరావడం మనకు ప్రయోజనం. రష్యా, చైనాల విభజన అమెరికా ప్రయోజనం కోసమే కాబట్టి నిక్సన్‌ చైనాలో పర్యటించాడు. ఆ విధంగా అమెరికా, ఆసియా ఖండం చుట్టూ తన అధికారాన్ని సష్టించ గలిగింది. సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిన తరువాత కూడా కిస్సింజర్‌, రష్యాను ఒంటరి చేయడానికి, యూరోప్‌ పై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అమెరికా చైనాతో స్నేహం చెయ్యాలని అంటూనే ఉన్నాడు. కిస్సింజర్‌ రచించిన 600 పేజీల పుస్తకం ”ఆన్‌ చైనా”లో కూడా అదే విధమైన వాదన.
చైనాను ఒంటరి చేయడానికి రష్యాతో స్నేహ వ్యూహం
సోవియట్‌ యూనియన్‌ పతనంతో అమెరికా ప్రభుత్వం రష్యా, చైనా, రెంటిలో రష్యాతో ఎక్కువ స్నేహం చెయ్యాలనే ఒక వ్యూహాన్ని రచించింది. 1991 నుండి 1999 వరకు బోరిస్‌ యెల్స్తిన్‌ అధ్యక్షునిగా ఉన్న కాలంలో రష్యా అమెరికాకు లొంగి ఉండడం సంపూ ర్ణమైందనీ, రష్యన్లు యురేషియా ఖండంలో ఒక చిన్న ఆటగాడిగా మారిపోతారని విదేశాంగ విధాన ఉన్నత వర్గాల వారు భావిం చారు. 1998 లో రష్యా జీ-7 లో ప్రవేశం అనేది విధేయతకు పరాకాష్ట. రష్యా ప్రజానీకంలో క్రైస్తవం తిరిగి రావడం, అదే విధంగా రష్యా యూరోప్‌ వైపు చూసే సంస్కతిని ప్రోత్సహించడంతో రష్యా తన పాశ్చాత్య సంస్కతిని స్వీకరించి, సార్వభౌమాధికారం నుండి లేదా ఆసియా నుండి దూరం జరిగిందనీ, అందువల్లే చైనా నుండి దూరమైనట్టు భావించారు. 1993లో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, యెల్స్తిన్‌కు ఫోన్‌ చేసి, ”మనం దీర్ఘకాలం పాటు కలిసి ఉన్నామనే విషయాన్ని మీకు తెలియజేయాలని, నేను అనుకుంటున్నానని” అన్నాడు.
2000 చివరిలో అమెరికాలో ఒక తీవ్ర మితవాద వర్గం రెండు అంశాల్ని గుర్తించింది. మొదటిది, చైనా ఉత్పత్తి శక్తుల సాంకేతిక అభివద్ధి అమెరికా సంస్థల మేథో సంపత్తి ఆధిపత్యాన్ని తీవ్రంగా బెదిరించింది. రెండోది, రష్యా నూతన జాతీయవాదం, సార్వభౌమాధికారం (పుతిన్‌ దేశభక్తియుత పార్టీల ఆవిర్భావం ద్వారా గుర్తించబడిన), తెల్లవారి ఆధిపత్యం మరియు రష్యన్‌ సాంప్రదాయవాదం పై ఆధారపడింది. అమెరికాలో తీవ్ర మితవాద వర్గం, రష్యన్‌ దేశభక్తియుత జాతీయవాదాన్ని తన సొంత భావజాలంగా చూస్తుంటే, చైనా కమ్యూనిజాన్ని తన ప్రత్యర్థిగా చూస్తుంది. తన మొదటి అధ్యక్ష పదవీకాలంలోనే ట్రంప్‌ యూరోప్‌ను తక్కువ భావనతో చూసేందుకు, చైనాను ఒంటరి చేయడానికి రష్యాతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిం చాడు. ఈ కిస్సింజర్‌ విరుద్ధ వ్యూహం ప్రగతిశీలమైనది కాదు, అయితే అదే విధమైన ప్రతిఘాతకమైనది, ప్రమాదకరమైనది కూడా. విరుద్ధమైన పాత్ర దారులతో అదే విభజన వ్యూహాన్ని, అమెరికా ఆధిపత్యాన్ని ఖాయం చేసే ఏకీకత లక్ష్యం.
2007లో పుతిన్‌ మ్యూనిచ్‌ భద్రతా మహాసభలో అమెరికా నుండి అధికారికంగా విడిపోయిన నాటి నుండి చైనా, రష్యాల మధ్య ఏర్పడిన సంబంధాన్ని బద్దలు కొట్టడానికి ఇప్పుడు అమెరికా ప్రయత్నం చేస్తోంది. చైనా, రష్యాల మధ్య మంచి సహకారం చాలా వేగంగా బలపడింది. రెండు దేశాలూ తమ సొంత కరెన్సీలో వస్తువులు, సేవల బదిలీ కింద భద్రతా ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంబంధాల్ని విచ్ఛిన్నం చేయడం అంత తేలికైన పని కాదు కానీ ఇప్పుడు ట్రంప్‌ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
1971లో కిస్సింజర్‌, చైనా నాయకత్వం గురించి చేసిన అంచనాను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.”వారి లక్ష్యం వంద శాతం రాజకీయమైనది. వీరు సైద్ధాంతిక స్వచ్ఛత కలిగిన వారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చౌ-ఎన్‌-లై1920లోనే, అంటే చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ఏర్పాటుకు ముందే ఫ్రాన్స్‌లోని కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరాడు. ఈ తరం వారు యాభై ఏళ్ల పాటు పోరాడి, వాణిజ్యం కోసం లాంగ్‌ మార్చ్‌ చెయ్యలేదు”. ఈ దష్టి కోణం చౌ-ఎన్‌-లై, మావో సేటుంగ్‌లను మాత్రమే కాక వ్లదిమీర్‌ పుతిన్‌, షీ జిన్‌పింగ్‌లను కూడా ఆకర్షించింది. వారు కూడా గత దశాబ్ద కాలంగా అమెరికా వ్యతిరేక పోరాటంలో ఉక్కుపాదం కింద నలిగి పోతున్నారు. ట్రంప్‌ అనుసరించే కిస్సింజర్‌ విరుద్ధ వ్యూహాన్ని స్వీకరించడానికి చిన్న చిన్న మాటలు పుతిన్‌ను ఆకర్షించే అవకాశం లేదు.
(”పీపుల్స్‌ డెమోక్రసీ” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
విజరు ప్రసాద్‌

Spread the love