హరితహారంపై గొడ్డలి వేటు.!

– యథేచ్ఛగా హరితహారం చెట్ల నరికివేత
– పట్టించుకోని  అటవీశాఖ అధికారులు
నవతెలంగాణ – నసురుల్లబాద్
పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయాలు వెచ్చించి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఏడాది వానాకాలంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం, ప్రైవేటు ఖాళీ స్థలాలతో పాటు, ఇళ్లలో, పొలాలు, చెరువులు గట్లపై ప్రతిష్ఠాత్మకంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపడుతున్నారు. అవి పెరిగి పెద్దవికాగానే కొందరు అక్రమంగా ఏపుగా పెరిగిన చెట్లను నరికేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ 22వ కాలువ పై ఉన్న వందలాది పెద్దపెద్ద వృక్షాలను కొందరు వ్యక్తులు ఇటుక బట్టీల కోసం చెట్లు కోసే యంత్రాలతో  చెట్లను నరికి వేయడంతో హరితహారం పై గొడ్డలి వేటు పడింది. బస్వాయిపల్లి నుండి దుర్కి గ్రామం వరకు ఉన్న నిజాంసాగర్ 22వ డిస్ట్రిబ్యూటర్ కాల్వ పై ఉన్న చెట్లను యంత్రాల సాయంతో నరికి వేశారు.  ఈ తతాంగం అంత గత రెండు రోజుల నుంచి జరుగుతున్నా హరితహారం నిర్వాహకులు గాని గ్రామపంచాయతీ సిబ్బంది గాని అటవీ శాఖ అధికారులు గాని ఎవరు పట్టించుకోకపోవడంతో దర్జాగా చెట్లను నరికి వేశారు.
కన్నెత్తి చూడని మున్సిపల్‌ అధికారులు
గ్రామీణ ప్రాంతంలో వంట చేసుకునేందుకు కట్టెల కోసం అడవి నుండి ఎండిపోయిన కట్టెలను పేదవాడు తీసుకుని వస్తుంటే పెదవాడిని అధికారులు పట్టుకొని వారికి జరిమానా విధిస్తుంటారు. హరితరంలో పెంచిన మొక్కలు పెరిగి పచ్చగా ఉన్న చెట్లు కొందరు అక్రమంగా వారి స్వార్థం కోసం యంత్రాల సాయంతో నరికి వేస్తుంటే అధికారులు చూసి చూడనట్లు వివరించడం పట్ల ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ బోధన్ వెళ్లే మార్గంలో దుర్కి గ్రామం మధ్యలో ఉన్న చెట్లను నరికివేసిన పట్టించుకోని అటవీ శాఖ అధికారులు పెద్దఎత్తున రోడ్లకిరువైపుల చెట్లు నరికివేతకు గురౌతున్నప్పటికీ ఇటు హరితహారం అధికారులు కానీ, ఆటు అటవీ శాఖ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఎంతో ప్రజాధనం వెచ్చించి హరితహారంలో భాగంగా పెంచిన చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లు నరికేస్తున్నా కనీసం చర్యలు చేపట్టడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైన అధికారులు స్పందించి చెట్లు నరికివేతకు గురికాకండా చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
చెట్లు నరికిన వారిపై చర్యలు
హరితహారం లో భాగంగా పెంచిన చెట్లను అక్రమంగా కొందరు వ్యక్తులు 100కు పైగా యంత్రాల సాయంతో చెట్లను నరికి వేసినందుకు గాను వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని నస్రుల్లాబాద్ ఎంపీడీవో కళావతి తెలిపారు. చెట్లను నరికి వేసిన వారిని గుర్తించి వెంటనే జరిమానా తో పాటు వారికి శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు సూచించారు.
Spread the love