– తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో దారుణం
తిరుచి : పెత్తందారి కులాలకు చెందిన తోటి విద్యార్థులు మాయ మాటలతో మోసగించి దళిత విద్యార్థి చేత మూత్రం తాగించిన దారుణ ఘటన తమిళనాడులోని నేషనల్ లా యూనివర్శిటీ (టిఎన్‌ఎన్‌ఎల్‌యు)లో చోటుచేసుకుంది. దీనిపై సదరు దళిత విద్యార్ధి చేసిన ఫిర్యాదుపై టిఎన్‌ఎన్‌ఎల్‌యు విచారణ చేపట్టింది. ఫైనల్ ఇయర్ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమం సందర్భంగా కాలేజీ ఆవరణలోనే ఈ నెల 6న ఈ దారుణం చోటుచేసుకుంది. మూత్రాన్ని కలిపిన కూల్ డ్రింక్‌ను ఫైనల్ ఇయర్ దళిత విద్యార్ధిచే అతని సహచర విద్యార్థులు ఇద్దరు తాగించారు. మరుసటి రోజు జరిగిన మోసం తెలుసుకున్న వెంటనే సదరు విద్యార్థి ఫ్యాకల్టీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్న రిజిస్ట్రార్ బాలకృష్ణన్ తెలిపారు. ఈ నెల 18న కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. నివేదికలోని అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.