కలెక్టర్లకు తాగునీటి నిధులు

– వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
–  ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన నిధుల్ని కలెక్టర్లకు ఇచ్చామనీ, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారుల్ని ఆదేశించారు. బుధవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో తాగునీటి పరిస్థితి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు, వడదెబ్బ నివారణ చర్యల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు అందుబాటులో ఉంచామనీ, వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, నిఘా ఉండాలని చెప్పారు. ప్రతి ఇంటికి సరిపడా నీటిని ఇవ్వాలనీ, ప్రత్యేక అధికారుల బృందాలు గ్రామాలను సందర్శించి నీటి సరఫరాలో జరుగుతున్న అంతరాయాలను నేరుగా ప్రజల నుంచే అడిగి తెలుసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ఆయా కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పాలిన్లు ఏర్పాటు చేశామన్నారు. పాఠశాలల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన మరమ్మత్తు పనులపైనా ఆమె కలెక్టర్లతో మాట్లాడారు. దీనికి సంబంధించిన నిధులు కూడా విడుదలయ్యాయని, ఎన్నికల సంఘం నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చినందున పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వేడిగాలులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బందికి అవగాహనా తరగతులు నిర్వహించామని వివరించారు. ఆరోగ్య సదుపాయాలు మెరుగు పర్చడం, వేడిగాలుల ఎక్కవగా ఉన్న సమయంలో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీరు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బీ వెంకటేశం, సీడీఎంఏ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, వాటర్‌బోర్డ్‌ అధికారులు వీణ, సుదర్శన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love