జులై 18 నుంచి డీఎస్సీ రాతపరీక్షలు

DSC written exams from July 18– ఆగస్టు 5 వరకు నిర్వహణ
– ఆన్‌లైన్‌లో రోజు రెండు విడతల్లో
– పూర్తిస్థాయి షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మెగా డీఎస్సీ రాతపరీక్షలు కంప్యూటర్‌ ఆధారిత విధానం (సీబీఆర్టీ)లో ఆన్‌లైన్‌లో వచ్చేనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు ఐదో తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పోస్టు కేటగిరీ, మాధ్యమం వారీగా డీఎస్సీ రాతపరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శుక్రవారం విడుదల చేశారు. మెగా డీఎస్సీకి 2,79,966 దరఖాస్తులొచ్చిన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి విదితమే. ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో రెండో విడతల్లో రాతపరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. వచ్చేనెల 18న మొదటి విడతలో స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌ స్టడీస్‌), స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ సైన్స్‌) తెలుగు మాధ్యమం అభ్యర్థులకు రాతపరీక్షలుంటాయని పేర్కొన్నారు. రెండో విడతలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) పోస్టుకు  హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ, కన్నడ, తెలుగు మాధ్యమాల్లో పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. అదేనెల 19న మొదటి విడత, రెండో విడతలో ఎస్జీటీ తెలుగు మాధ్యమం అభ్యర్థులకు పరీక్షలుంటా యని వివరించారు. ఆగస్టు ఐదో తేదీన మొదటి విడతలో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) ఉర్దూ, ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమంలో, రెండో విడతలో లాంగ్వేజ్‌ పండిట్‌ (హిందీ) అభ్యర్థులకు రాతపరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Spread the love