క్రీడా ప్రాంగణాల్లో కోచ్ లను నియమించాలి: ఎడ్మ శ్రీనుయాదవ్

నవతెలంగాణ – అచ్చంపేట
రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి.  క్రీడా ప్రాంగణాలలో  సరైన కోచ్ లను నియమించి , క్రీడా ప్రాంగనాలను వినియోగంలోకి తీసుకొని రావాలని నాగర్ కర్నూల్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎడ్మ శ్రీను యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన నవ తెలంగాణతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి క్రీడా ప్రాంగణాలు నిర్మించడం జరిగిందన్నారు.  కోచ్ లను నియమించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది నిరుద్యోగ పీఈటీ లు ఉన్నారని , ప్రతి ఏడాది మరో రెండు వేల మంది పిఈటిలు శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారని ఆయన తెలిపారు. క్రీడా ప్రాంగణాల్లో కోచ్ లను నియమించి సరైన శిక్షణ ఇప్పిస్తే క్రీడారంగంలో రాష్ట్ర, జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలు, కళాశాలలో కూడ సరిపడా వ్యాయామ ఉపాధ్యాయులు లేరని ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో వ్యాయామ విద్యను ప్రవేశపెట్టినట్లయితే ..దేశానికి క్రీడల్లో మంచి గుర్తింపుతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Spread the love