‘యంగ్‌ఇండియా’తో విద్యారంగం గట్టెక్కేనా!?

Has the education sector been affected by 'Young India'?”యంగ్‌ ఇండియా నా బ్రాండ్‌ ఇమేజ్‌” అని ముఖ్యమంత్రి ప్రకటిస్తూ, ప్రాథమిక విద్య పై ప్రభుత్వ విద్యారంగంలో అస్పష్టత ఉందని, దానికి పరిష్కారం సర్కారు ఆధ్వర్యంలో ప్రీస్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న నర్సరీ, ఎల్‌కెజీ, యూకేజీ తరగతులకు విద్యార్థులు ఆకర్షింపబడు తున్నారని, కాబట్టి ప్రభుత్వ నిర్వహణలో ప్రీస్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలే బ్రాండ్‌ ఇమేజ్‌గా స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తున్నది. ఇప్పటికే 26 వేల ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలను గాలికొదిలి 58 యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 175 ఇంజనీరింగ్‌ కళాశాలల నుంచి 1.10 లక్షలమంది పట్టభద్రులవుతుంటే, వారికి నైపుణ్యాలు లేవని, వారి డిగ్రీలకు నాణ్యత లేదని, నైపుణ్యాల కోసం యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని ప్రారంభించింది. వర్సిటీ స్థాపనతోనే పట్టభద్రులకు స్కిల్స్‌ వస్తాయా? లేదా ఈ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఉండే క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిష్కరించడం, సిలబస్‌ను అప్డేట్‌ చేయడం, అధ్యాపక నియామకాలు చేయడం ద్వారా స్కిల్స్‌, నైపుణ్యాలు పెరుగుతాయా? అని ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్‌ చెప్పాలి. అంత గొప్పగా చెప్పే యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి విద్యావేత్తలను వైస్‌ ఛాన్సలర్‌గా నియమించకుండా, ఆ యూనివర్సిటీకి ప్రయివేటు పారిశ్రామికవేత్తను వైస్‌చాన్సలర్‌గా నియమించి, యూనివర్సిటీ నిర్వహణను ప్రయివేటు పార్ట్‌నర్‌షిప్‌కు అప్పగిస్తే బ్రాండ్‌ ఇమేజ్‌ అవుతుందా?
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలోని విద్యా విధానం, మన విద్యా ప్రమాణాలపై చర్చ జరిగింది. విద్యారంగంలో సమూల ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యతను గుర్తించాలని, అప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పారు.అందరి సలహాలతో సమగ్రమైన పాలసీ డాక్యుమెంటును రూపొందించి, చర్చించి, అవసరమైన మార్పులు చేద్దామని కూడా వివరిం చారు. ఈసందర్భంగా తాము అధికారంలోకి రాగానే డీఎస్సీ నిర్వహించి పదివేల టీచర్‌ పోస్టులను భర్తీ చేశామని, పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు, పదోన్నతులను పూర్తి చేశామని చెప్పారు. విద్య అభ్యసన ప్రక్రియ దీర్ఘకాలిక లక్ష్యాలతో జరగాలని, సామాజిక అవసరాలకు అను గుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందని, రాజకీయ కోణంలో ఆలోచన చేస్తే విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయలేమని కూడా అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు గురించి యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటిఐలను సంస్కరిస్తూ అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌ క్రెడిట్‌ చేస్తున్నామని, తాము తీసుకున్న చర్యలను వివరించారు. అలాగే క్రీడాకారులను తయారు చేయడానికి యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, అకాడమీలను ప్రారంభించనున్నట్టు కూడా చెప్పారు. కలెక్టర్‌నైనా బదిలీ చేయొచ్చు, కానీ ఉపాధ్యా యులను బదిలీ చేయడం ఆషామాషీ కాదని కూడా ఉపాధ్యాయులనుద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ, బదిలీలు, పదోన్నతులు, నియామకాలు పూర్తిచేయగానే విద్యార్థుల్లో ప్రమాణాలు అమాంతం పెరగవు.
విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరగడానికి తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం, పాఠశాల వాతావరణం, విద్యార్థుల సంసిద్ధత,ఉపాధ్యాయుల బోధన అభ్యసన ప్రక్రియలు కారణాలుగా ఉంటాయి. కానీ సామర్ధ్యాలు లేమికి కేవలం ఉపాధ్యాయులే కారణమని నిందించడం,వారిని ఏమీ చేయలేమని ఆశక్తత వ్యక్తం చేయడం, కలెక్టర్ల కన్నా వారి బదిలీ సంక్లిష్టమని వ్యాఖ్యానించడం నేలవిడిచి సాము చేయడమే అవుతుంది అంతే కాకుండా మన విద్యారంగ ప్రక్రియ అంతా ”మార్కెట్‌ అనుకూల విద్యగా” మారింది. ”సమాజం కోసం విద్య” అనే లక్ష్యం నుండి వైదొలగడంతోనే అనర్థాలు వస్తున్నాయని గ్రహించాలి. మన విద్యావ్యవస్థలో ఉన్న పాఠశాలలు, గురుకులాలు, సాంఘిక సంక్షేమ స్కూల్స్‌ను పటిష్టం చేయాల్సి ందిపోయి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ప్రీస్కూల్‌ విధానం తెస్తామంటే ఎలా? ప్రీ ప్రైమరీ పాఠశాల ఎలా ఉండాలి, బోధకులైన ఉపాధ్యాయులకు శిక్షణ ఏమిటి, పాఠశాలల పర్యవేక్షణ, పాలన ఎలా ఉండాలో కూడా ఆలోచించాలి కదా! ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల నిర్వహణ, పర్యవేక్షణ చిన్నాభిన్నమై, తల్లిదండ్రులు మన పాఠశాలలకు ఆకర్షింపబడడం లేదనే విషయాన్ని ప్రభుత్వం గమనించడం లేదు. కొత్త విద్యాసంస్థల స్థాపనే సమస్యల పరిష్కారానికి మార్గమని భావించడం ఎంతమాత్రం సరికాదు.
విద్యారంగ ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు ప్రత్యక్ష బోధన గావిస్తారు. ఈ బోధనకు కావలసిన సౌకర్యాలు వసతులు ప్రభుత్వం కల్పించాలి. బోధనను మూల్యాంకనం చేసే పర్యవేక్షణ వ్యవస్థ, విద్యాపాలన కూడా ఇందులో భాగం. పాఠశాల విద్యాశాఖకు గుండెకాయ వంటి ఎస్‌సిఈఆర్‌టిలో ప్రొఫెసర్లు, అధ్యాపక పోస్టులన్నీ ఖాళీలే ! భావి ఉపాధ్యాయులను తీర్చిదిద్దే బిఈడి మరియు డైట్‌ కళాశాలల్లో గత దశాబ్దంగా బోధించే అధ్యాపకులు లేక సరైన శిక్షణ లేకుండానే బిఈడి, డిఈడి కోర్సులను పూర్తి చేస్తున్నారు. సరైన శిక్షణ పొందని భావి ఉపాధ్యాయుల నుండి నాణ్యమైన బోధన ఆశించలేము.విద్యాహక్కు చట్టం ప్రకారం ఎస్సీఈఆర్టీ అకాడమిక్‌ అథారిటీగా ఉంది. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన శిక్షణ అందించడం, విద్యా లక్ష్యాలు, బోధనా విధానాలు, విద్యా ప్రణాళిక రూపకల్పన, పాఠ్యపుస్తకాల రచన, నూతన మూల్యాంకన బోధనా పద్ధతులపై పరిశోధన చేయడం వంటి బాధ్యతలు నిర్వహించే ఎస్సీఈఆర్టీ ఖాళీలతో అచేతనంగా ఉంది. పాఠశాల విద్యాశాఖకు విద్యాసంవత్సరానికి కావలసిన అకాడమిక్‌ క్యాలెండర్‌ రూప కల్పనలో ఎస్సీఈఆర్టీ కీలకపాత్ర వహిస్తుంది. ఈ అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారంగానే ఉపాధ్యాయుల బోధన ప్రక్రియ సాగాలి.
విద్యారంగంలో ఉన్న సమస్య లను, సామర్ధ్యాల సాధనలో వెనుకబడిపోవడానికి సంబంధించిన కారణాలను అన్వేషించాలి. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలను గాలికొదిలేసి, యంగ్‌ ఇండియా ఇంటర్నే షనల్‌ స్కూల్స్‌ స్థాపించ డమనేది ప్రభుత్వ ప్రచారానికి ఉపయోగపడుతుంది, తప్ప విద్యార్థుల్లో ప్రమాణాలు పెరగవు. దానికి దీర్ఘకాలిక వ్యూహంతో పటిష్టమైన విద్యా ప్రణాళికతో ప్రభుత్వాధినేతలు, అధికారులు వ్యవహరించాలి. గత పదేళ్లుగా విద్యారంగానికి బడ్జెట్‌లో నిధులను తగ్గించారని ఊదరగొట్టిన ప్రభుత్వం, పదిహేను శాతం నిధుల కేటాయింపుకు వాగ్దానం చేసింది. కాని గత రెండు బడ్జెట్‌ల్లోనూ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి అరకొర నిధులు కేటాయించింది. ఇలాగైతే విద్యారంగ ప్రక్షాళన ఎట్లా జరుగుతుంది? ఒకవైపు ”సమూల ప్రక్షాళన” అంటూ, మరో వైపు నిధుల కేటాయింపు లేకపోతే విద్యావ్యవస్థ ఎలా బాగుపడుతుంది. ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసే యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల విద్య విద్యాలయాల నిర్వహణ బాధ్యతను ఒక్కొక్క కార్పొరేట్‌ సంస్థకు అప్పగించే ఆలో చనలో సర్కార్‌ ఉంది. అంటే ప్రభుత్వం తాను ప్రారంభించే పాఠశాలలను ప్రయివేటుకు అప్పగిస్తూ ”గొప్ప విద్యను” తెలంగాణకు అందిస్తామంటే నమ్మశక్యమేనా? క్షేత్రస్థాయిలోని సమస్యలను ఆమూలాగ్రం పరిశీలించి, ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేసే విధంగా ”తెలంగాణ విద్యా కమిషన్‌” మండలానికి మూడు పాఠశాలలను అభివృద్ధి చేయడానికి నిర్దిష్టమైన ప్రణాళికను ప్రతిపాదించింది. ఇందుకు 22 వేల కోట్ల రూపాయల ఖర్చుతో అంచనాలను రూపొందించింది. ఈ ప్రతిపాదన ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ వాటిని ఇంటర్నేషనల్‌ పాఠశాలల స్థాయిలో అభివృద్ధి చేసే సూచనలను ప్రభుత్వం ఆమోదించి, అమలుకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఏడెనిమిది రకాల దొంతరలతో కూడిన పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఏకరూప పాలన లేదు. ఏక రూప సర్వీస్‌ నిబంధనలు లేవు. ఏకరూప వేతన వ్యవస్థ లేదు. వీటన్నింటినీ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి.
విద్యారంగం బాగుపడాలన్నా, సాఫీగా సాగాలన్నా ”కామన్‌ స్కూల్‌ విధానం” మాత్రమే ఏకైక శాశ్వత పరిష్కారం. తాత్కాలిక సర్దు బాట్లతో మరిన్ని కొత్త సమస్యలు పుట్టుక రావడం మనం దశాబ్దాలుగా చూస్తున్నాం. కొఠారి కమిషన్‌ సూచించినట్లు రాష్ట్ర బడ్జెట్లో 30శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తూ, ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌ వివాదాన్ని పరిష్కరించి, పర్యవేక్షణ అధికారుల పోస్టులైన ఎంఈఓ, డిప్యూటీ విద్యాధికారి, డిఈఓ, బీఈడీ కళాశాల, డైట్‌ కళాశాల లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయాలి.రాష్ట్రంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తినిస్తూనే పర్యవేక్షణ, నాయకత్వం, సమాన విద్యను పిల్లలందరికీ అందించడానికి విద్యాశాఖ గొడుగు కిందకు తీసుకురావాలి. పాఠశాలలో ఒక తరగతిగదిని బాగు చేస్తామంటే సరిపోదు. సమగ్రమైన ఆలోచనతో, లక్ష్యాలతో కూడిన పర్యవేక్షణ మన విద్యారంగానికి అవసరం ఉంది. అకడమిక్‌ లీడర్‌ షిప్‌ లక్షణాలు పెంచే చర్యలు తీసు కోవాలి. డిగ్రీ విద్య, విశ్వవిద్యాలయ విద్యను బాగుచేయడానికి ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళికతో చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టు, తాత్కాలిక ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేసే ఆలోచన చేయాలి. విద్యారంగానికి నిధులు పెంచితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ప్రభుత్వం పాఠశాల యజమానిగా తన ఆధీనంలోని పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రతి సబ్జెక్టుకు, ప్రతి తరగతికి తగినంత మంది ఉపాధ్యాయులను నియమించడం, అవసరాలకు సరిపడా ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు పిల్లల జీవితాలను సున్నితంగా తీర్చిదిద్దే విధంగా బోధనా- అభ్యసన వాతావరణం ఉండేలాగా దృష్టి పెట్టాలి. పౌష్టికాహారంతో కూడిన మధ్యా హ్న భోజనాన్ని అందిస్తూ, పటిష్టమైన పర్యవేక్షణతో, జవాబుదారీతనంతో కూడిన ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తామని తల్లిదండ్రులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేలాగా ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలి. ప్రతిబిడ్డ తాను గౌరవం, శ్రద్ధ పొందుతున్నానని భావించే విధంగా వ్యవస్థను తయారుచేయటం, పిల్లల స్వేచ్ఛను విస్తరించే ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్మించడం నేడు ఉన్న పెద్దసవాలు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలనే బ్రాండ్‌ ఇమేజ్‌గా తీర్చిదిద్దే నిర్దిష్ట, సమగ్ర విద్యా ప్రణాళిక నేడు రాష్ట్రానికి కావాలి.
కె. వేణుగోపాల్‌
9866514577

Spread the love