రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి : ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి
జూపల్లి కృష్ణారావు
ప్రాజెక్టులకు వచ్చిపోయే నీటి సమాచారం ప్రజలకు తెలియజేయాలి : పశు సంవర్ధక, క్రీడల శాఖల మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-వనపర్తి
ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉన్నందున ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల్ని సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన కలెక్టరేట్లో సాగునీటి సలహా మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి రైతులకు సాగు నీరు అందించేందుకు ఉన్న అవకాశాలపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఎల్ నినో కారణంగా కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్, కేఎల్‌ఐ, బీమా తదితర ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టం, రాబోయే రోజుల్లో సాగు, తాగు అవసరాలకు సంబంధించి నీటి నిల్వలపై మంత్రులు చర్చించారు. రాబోయే రోజుల్లో రైతులకు సాగునీటి విడుదలకు సంబంధించిన సాధ్యసాధ్యాలపై చర్చించి పలు సూచనలు చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడి నుంచి వరద రావడం వల్ల ప్రస్తుతం ప్రాజెక్టులు నింపుకోవడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరిగితేనే మనం రైతులకు సాగు నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని వివరించారు. అక్కడి నుంచి నీటి ప్రవాహం రాకపోతే సాగు కోసం నీళ్లు విడుదల చేయడానికి అవకాశం ఉండదని తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిపివేశామని తెలిపారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎల్ నినో కారణంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడిన వాస్తవాలను గ్రహించాలన్నారు. అదృష్టవశాత్తు కర్నాటకలో కురిసిన కొద్దిపాటి వర్షాల వల్ల అక్కడి నుంచి జూరాలకు వరద వచ్చిందని తెలిపారు. కానీ వర్షాకాలం పంటలు పండాలంటే డిసెంబర్ వరకు నీరు ఉండాలనీ, అప్పటివరకు నీరు ఇవ్వాలంటే వర్షాలు కురవడం తప్పనిసరి అన్నారు. వర్షాలు కురువకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని వివరించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రోత్సాహం కల్పించాలన్నారు. నీటికి సంబంధించి ప్రస్తుతం ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వరి పంటకు పోకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం వచ్చినప్పుడు రైతులకు తగినంత సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఇన్‌ఫ్లో తగ్గిపోతే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రైతులకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9 టీఎంసీలు కాగా, గతంలో రీజెనెరేటెడ్ నీటి సౌకర్యం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఆరా తీసి దానిపై పూర్తి డేటాను వీలైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించారు.
రైతులకు మినుము, వేరుశనగ, ఆయిల్ పామ్ పంటలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తుంది, ఎంత వదులుతున్నామనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. జవాబుదారీతనంతో ప్రజలకు అన్ని వివరాలు, వాస్తవాలను తెలియజేయాలన్నారు. కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులకు మనం ఏమి ఇవ్వగలమో అదే చెప్పాలని ఆదేశించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ కేఎల్‌ఐ ద్వారా శ్రీశైలం నీటిని వనపర్తి పరిధిలో రైతులకు సాగునీరు ఇవ్వడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నింపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తకోట మండల పరిధిలో ఉన్న శంకర సముద్రాన్ని కూడా నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి రైతులకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో వారానికి మూడు రోజులు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొద్ది రోజులపాటు వానాకాలం సీజన్ పంటల కోసం జూరాల కుడి ప్రధాన కాలువ ద్వారా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఇప్పటికే బోర్ల ఆధారంగా వరి పంటకు ముందుకు వెళ్లారని, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయడం ద్వారా కనీసం బోర్లు రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉందని తెలిపారు. ప్రాజెక్టుల్లో రిపేరుకు గురైన మోటర్లను బాగు చేయాలన్నారు. కోయిల్ సాగర్‌కు నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని సూచించారు. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ రైతులకు నీటి విడుదలపై స్పష్టమైన సమాచారం తెలియజేయాలన్నారు. రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కాలువల్లోకి ఒకసారి సాగునీటిని విడుదల చేసిన వెంటనే రైతులు వరి నాట్లు వేసే అవకాశం ఉందని, అయితే భవిష్యత్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల్లో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని పంటల ప్రణాళికను రూపొందించుకునేలా రైతులను చైతన్యపరచాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, విజయుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ శివసేనారెడ్డి, మహబూబ్‌నగర్ కలెక్టర్ కుష్బూ గుప్త, నారాయణపేట కలెక్టర్ సీహెచ్.ప్రియాంక, గద్వాల కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, నాగర్‌కర్నూలు కలెక్టర్ హిమంత కేశవ్ పాటిల్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



