‘ఏనుగు’ కవిత్వావలోకనం

'Elephant' Poetry Reviewతెలంగాణ సాహితీరంగాన్ని 1980ల నుంచి పరిశీలిస్తే ఒక కొత్త పరిణామాన్ని చవి చూసినట్టు తేలుతుంది. ఒక సామాజిక వర్గంగా మధ్యతరగతికి ప్రాతినిథ్యం వహించే కవితాభివ్యక్తి పూర్తిగా గల్లంతయిపోయింది. దీనికి కారణం ఆనాటి నుంచి పెల్లుబికిన కవితా ఉద్యమాలే కారణం. వాటిలో దళితవాదం, మాదిగ వాదం, స్త్రీవాదం, ముస్లిం వాదం,  తెలంగాణ వాదం వంటి కవితా ఉద్యమాలు ఉన్నాయి. ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించిన కవులు, వాటి నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన కవులు సాంతం గ్రామీణ నేపథ్యం  ఉన్నవాళ్లు. వర్గం రీత్యా అత్యధికులు కష్టజీవుల వారసత్వంకలిగినవాళ్లే. వీరిలో దళితులైనా, బహుజనులైనా వృత్తికులాలకు, రైతు వర్గానికి, ముస్లింవర్గానికి చెందిన వాళ్లే. ఒక  మాజిక వర్గం రీత్యా నగర, పట్టణ మధ్యతరగతి వర్గంలో షేరీక్‌ కానీవాళ్లు. విద్యా ఉద్యోగాల రీత్యా మధ్యతరగతి వర్గంలో చేరే క్రమంలో ఉన్నవారు. దాదాపు ఈ కవులంతా  మాలను వదిలేసి పెట్టుబడిదారి సంబంధాలు బలపడుతున్న తమ సమీప పట్టణాలలో నివాసం ఉంటున్నవాళ్లే.

ఈ కవులందరిలో అటు గ్రామీణ జీవితపు గతాన్ని వదులుకోలేక, ఇటు పారిశ్రామిక నాగరికతకు చెందిన పట్టణ జీవితాలలో పూర్తిగా చేరలేక ఒక సంఘర్షణకు గురైన వాళ్లు. ఇందుకు కారణం తమ చదువు కూడ. అది తమ జీవితాలకు సంబంధించినది కాకపోవడంతో పరాయికరణకు గురై తమ వ్యక్తీకరణకు కవితా రచనను ఆశ్రయించడం కనిపిస్తుంది. సారాంశంలో చెప్పాలంటే వారిపై వాదాలదే పైచేయిగా మారిపోయింది. చివరికి తమ సంఘర్షణకు నివృత్తిగా తెలంగాణ రాష్ట్ర భావనను అందుకోవడం కూడ ఉన్నది. ఈ తరహా పరిణామం తొలుత పెట్టు బడిదారి సంబంధాలు బలపడ్డ అనేక దేశాలలలో జరిగింది. ఈక్రమంలో మధ్యతరగతి జీవిత సంఘర్షణను ప్రతిబింభించే కవితా రచన పూర్తిగా కనుమరుగయి పోయింది. అక్కడక్కడ కొందరు వ్యక్తులు ఉన్నా వారిని పూర్తిగా మధ్యతరగతికి ప్రాతినిథ్యం వహించే వారని చెప్పలేం. ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డి అనేక వాదాల సంరంబంలో తాను పుట్టి పెరిగిన మధ్యతరగతి జీవితానికి కట్టుబడి కవితా రచనకు పూనుకున్నాడు. ఇదే వర్తమాన తెలుగు, తెలంగాణ కవితా రంగంలో ఆయనను ప్రత్యేకంగా నిలుపుతోంది.
పల్లెలోనే పుట్టినా చిన్నపాటి పట్టణంలో పెరిగిన నరసింహారెడ్డి పూర్తిగా ఈ క్రమానికి బలంగా ప్రాతినిధ్యం వహించే కవులలో శిఖర సమానుడు. 1990లలో తలెత్తిన తెలంగాణ భావన, రాష్ట్ర ఉద్యమ సందర్భంగా కవితా రచనకు పూనుకున్న వచన కవులలో ఏనుగు నరసింహరెడ్డి (ఏనరె) ప్రముఖుడు. ఇంతేకాదు, ఆయన కావ్యకర్త, కార్యకర్తకూడా. మధ్యతరగతి జీవనరీతికి, సంఘర్షణకు, విలువలకు ఆయన కవిత ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ లక్షణం మొత్తం తెలంగాణ కవులలోనే ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ లక్షణం ఏనరె కవితా విశిష్టత. దాదాపు మూడు దశాబ్దాలకవితా రచనలో ఆయా మలుపులలో తెలంగాణ చవిచూసిన పరిస్థితులపై ప్రతిస్పందిడం కూడా ఉన్నది. ఏనరె కవిత ఉద్యమకవుల కంటే చాలా భిన్నమైంది. ఉన్నత విద్యావంతుడై ఆంగ్లం, ఉర్దూ, హిందీ సహా తెలుగు ప్రాచీన, ఆధునిక కవితా సంప్రదాయాలపై బాగా అధ్యయనం ఉండడం వల్ల, తనకంటూ ఒక సాహిత్య దృక్పథం ఉన్నందువల్ల కావచ్చు, కవితా రూపం, ప్రతీకలు, నిర్మాణం సరికొత్తగా రూపు దాల్చాయి. ఇంతకు మునుపు కవిత్వంలో అపరిచితమైన తెలంగాణ జీవన శకలాలను అత్యంత సౌందర్యపూరిత ప్రతీకలతో పరిచితం చేసే రచన ఏనరె కవిత. సారాంశంలో చెప్పుకోవాలంటే అతనొక శైలి శైలూషి. గ్రామీణ జీవితాన్ని వదులుకుని పట్టణాలకు వలసపోయి ఉద్యోగాలలో స్థిరపడిన వారిని మధ్యతరగతిగా పిలవడం సామాజిక శాస్త్రవేత్తలకు రివాజు. దీనితో బేరీజు వేస్తే ఏనరె ఉన్నత విద్యావంతులతో రూపు దిద్దుకున్న తెలంగాణ మధ్యతరగతికి తిరుగులేని ప్రతినిథిగా నిలుస్తాడు. ఆయా ఆధునిక సమాజాలకు చెందిన మధ్యతరగతి అనేది ఉత్తమ విలువలకు, జీవనరీతికి ప్రతీక. ఏనరెకూడ అంతే. అటు ఉన్నత వర్గాలను, అటు అట్టడుగు వర్గాలను ఆకట్టుకునే వినూత్న అభివ్యక్తి ఏనరెది. వస్తువు వల్ల, మహా కావ్య రచనా శైలిని వచనకవితలో చొప్పించడం వల్ల అభివ్యక్తి వినూత్నంగా రూపుదిద్దుకున్నది.
దీనివల్ల ఏనరె కవిత అటు ఉన్నత వర్గాలను, అట్టడుగు వర్గాలను అకట్టుకునే వెసులుబాటు కలిగింది. అటు ధ్యంసమై పోతున్న గ్రామీణ జీవితపు ఉత్తమ విలువలను, జ్ఞాపకాలను వదులుకోలేని అశక్తత దాని తాలూకు సంక్షోభం, పట్టణ నగరజీవితపు యాంత్రికత, ఒంటరితనం అనివార్యంగా సంక్రమించే సంఘర్షణ ఏనరె కవితలో ఒక ప్రధాన లక్షణం. ఈ సంఘర్షణ అనేది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుంచి పెట్టుబడి దారీవ్యవస్థ బలపడేకొద్దీ ఆయా దేశాలకు చెందిన ఉన్నత విద్యావంతులైన ఆధునిక కవులలో ఏదో రూపంలో ప్రతిఫలించడం చూడవచ్చు. సంఘర్షణ ఏదైనా మధ్యతరగతి దృక్కోణం నుంచి వాటిని నిర్వచించడం ఏనరే కవితా రచనలో ఒక ప్రత్యేకత. వ్యక్తిగత సంబంధాల అసంబద్దత వల్ల కలిగే అవేదన, అన్యాయం పట్ల నిరసన ప్రతిఫలనాలు బలంగా ఉన్నాయి. ఏనరె రాసిన స్మృతి కవితలు చాలా ప్రత్యేకమైనవి. అరుదైనవి. సాధారణంగా ఈ తరహా కవితలలో ఏ కవి అయినా తన స్మృతులలో భాగమైన వ్యక్తి గురించి రాస్తూ తన సంబంధాలను చెప్పి వలపోయడం ఒక రివాజు. కానీ ఏనరె వైఖరి ఇందుకు భిన్నం. ఇవి చదివినప్పుడు ఎలిజీ పేరుతో ఒక కావ్యసంఫుటి వేసిన జర్మన్‌ మహాకవి రిల్కే గుర్తు కొచ్చాడు. ఏనరె మొత్తం ఆరు స్మృతి కవితలు రాశాడు. సదరు వ్యక్తి స్మృతిలో రాసిన కవితలో వారి వ్యక్తిత్వాన్ని క్లుప్తంగా చెప్పడం ఉంటుంది. అకారణ వలపోత ఉండదు. ‘పట్నం చిట్టెమ్మ’ పేరుతో రాసిన స్మృతి కవిత ఎంతో విశిష్టమైన కవిత. ఈ రచన చదివినప్పుడు నాకు చేతనావర్తం కవి, వేణు ముద్దల నరసింహారెడ్డి స్మృతిలో కాళోజి రాసిన కవిత గుర్తుకు వచ్చింది. మిత్రుడు లేడు మండలి (మిత్రమండలి) ఉన్నది అని కాళోజీ చేసిన వ్యాఖ్యానం ఆయన గురించే. ఏనరె రాసిన స్మృతి కవితలను అధ్యయనం చేస్తే కాళోజీ, సురవరం, దాశరథి, మక్దూం మీద ఎంతో గొప్పగా రాసిన సినారె కవితలు గుర్తుకు రావడం ఖాయం. సంప్రదాయ హిందీ, ఉర్దూ, తెలుగు కవితా స్రవంతులపై బాగా పట్టు ఉండడం వల్ల కావచ్చు తనదైన కావ్యభాషను తీర్చిదిద్దుకున్నాడు. దీనితో తనదే అయిన శైలి ఏర్పడింది. తీవ్రమైన విషయాలను కూడ చాలా సున్నితంగా చెప్పడం ఉంటుంది. ఉర్దూ అభివ్యక్తి రూపాలను ప్రవేశపెట్టడం వల్ల ఇటీవల వెలువడిన కొత్తపలక, మూలమలుపు సంకలనాలకు కొత్త సొగసు ఏర్పడింది. రూపానికి సంబంధించి విశేషాలు కూడ ఉన్నాయి. తీవ్రమైన విషయాలను కూడ చాలా క్లుప్తంగా చెప్పడం ఉన్నది. నిజానికి క్లుప్తత అనేది ఏనరె కవితారచనలో ఒక విశిష్టత. ఈ లక్షణాన్ని చూస్తే తెలుగులో పేరుగాంచిన ఇస్మాయిల్‌ సాబ్‌ గుర్తుకొస్తాడు. పదాల పేర్పుతో ఒక రూపాన్ని ఆవిష్కరించినా అవికూడ క్లుప్తమైనవే. తెలంగాణ కవితా రచనలో క్లుప్తతను కొన్ని కవితలలో బాగా పాటించిన కవులలో కాళోజీ, వెల్దుర్తి, సినారె ప్రత్యేకంగా నిలుస్తారు. వారి తొలిసంకలనాలే క్లుప్తతకు దర్పణంగా నిలుస్తాయి. అలిశెట్టి క్లుప్తంగా రాసినా మినీ కవితా ఉద్యమంలో భాగం. వాటి లక్షణాలు, లక్ష్యం వేరే. వచన కవిత నిర్మాణంలో వస్తువును రూపాన్ని సమన్వయం చేయడం చాలా కష్టమైన సర్కస్‌. కానీ ఏనరె వస్తువును, రూపాన్ని భాషను, వాటికి తగిన వ్యక్తీకరణను సమన్వయం చేసి క్లుప్తతను సాధించడం గొప్ప విషయం. ఇవి చదివితే ప్రపంచ వ్యాప్తంగా వచన కవితలో క్లుప్తతకు సంబంధించి ఎంతో పేరుగాంచిన ఈఈ కమ్మింగ్స్‌, పీసోవా, జర్మన్‌ కవి జర్టిట్యూడ్‌ బెన్‌ గుర్తుకు రావడం ఖాయం. చివరగా చెప్పేదేమిటంటే ఆయనే ఒక కవితలో చెప్పుకున్నట్టు రాళ్లు పేర్చి పూలు పంచి కోటనుండి కాస్త తోటలోకి అడుగెయ్యాలె అంటాడు. బహుశా ఆ తోట తెలంగాణ సాహిత్యరంగమే కావచ్చు. నేనైతే అదే అనుకుంటున్నాను.
– సామిడి జగన్‌రెడ్డి, 8500632551

Spread the love