– నగర తాగునీటి అవసరాల దృష్ట్యా చర్యలు
– ఏడేండ్ల తర్వాత పంపింగ్‌ను ప్రారంభించిన జలమండలి ఎండీ
– అవసరమైతే రెండు రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల దృష్ట్యా నాగార్జున సాగర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించి నట్టు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సాగర్ జలాశయంలో ఎమర్జెన్సీ పంపింగ్ శనివారం ప్రారంభమైంది. నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోవ డంతో ఈ ప్రభావం హైదరాబాద్ తాగునీటి మీద పడకుండా ఉండేందుకు ఏడేండ్ల తర్వాత అత్యవసర పంపింగ్ ప్రారంభించారు. 10 పంపులను ఉన్నతాధికారుల సమక్షంలో ఎండీ సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడు తూ.. అవసరమైతే రెండో దశ అత్యవసర పంపింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. నీటిలో తేలియాడే సబ్ మెర్సబుల్ పంపుల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వచ్చే నెల 15 నుంచి ఎల్లంపల్లి జలాశయంలో అత్యవసర పంపింగ్ ప్రారంభిస్తామని వివరించారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు జలాశయాల్లో పుష్కలంగా నీరుందని, హైదరాబాద్ లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. అవసరమైతే రెండు రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా తాగునీరు అందిం చడానికి జలమండలి సిద్ధంగా ఉందన్నారు. జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నాగార్జు న సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 508 అడుగులకు చేరిందన్నారు. ఓఆర్‌ఆర్ వరకు విస్తరించిన హైదరాబాద్ మహానగర వాసుల తాగునీటి అవసరాల కోసం జలమండలి నాగార్జున సాగర్ జలాశయం, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ – 1, 2, 3ల ద్వారా రోజుకి 270 ఎంజీడీల నీటిని తరలిస్తోందని వివరించారు. ఈ ఏడాది నగరానికి సరఫరా చేసే సామర్థ్యం 2600 ఎంఎల్డీలకు పెంచామని, గతేడాదితో పోలిస్తే ఈసారి 175 ఎంఎల్డీల అదనపు నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఈనెల 10 నుంచి ఉస్మాన్‌సాగర్ నుంచి 5 ఎంఎల్డీలు, 15 నుంచి హిమాయత్ సాగర్ నుంచి అదనంగా 7 ఎంజీడీల (30 ఎంఎల్డీలు) నీటిని సరఫరా చేస్తున్నామని, వచ్చే నెల 15 నుంచి మరో 30 ఎంఎల్డీల అదనపు నీటిని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ప్రాజెక్టు డైరెక్టర్-2 సుదర్శన్, ట్రాన్స్‌మిషన్ సీజీఎం దశరథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.