ఆర్థిక సంక్షోభం-ఐఐటిల్లో ఉపాధి తగ్గుముఖం

Economic crisis-decline in employment at IITsదేశంలోని 23 ఐఐటిల్లో క్యాంపస్‌ సెలక్షన్లు తగ్గడంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటిల్లోనూ ప్లేస్‌మెంట్లు గణనీయంగా తగ్గాయని ఈ నివేదిక తెలిపింది. 2021-22లో 98.54 శాతం ఉన్న ప్లేస్‌మెంట్లు 2023-24 నాటికి 79.88 శాతానికి తగ్గాయి. ఇందులో దేశ రాజధాని ఢిల్లీ ఐఐటి లో 15 శాతం, ఆర్థిక రాజధాని ముంబయిలో 12.72, మద్రాసులో 12.42, కాన్పూర్‌లో 11.15 శాతం మేర తగ్గిపోవడం తీవ్ర ఆందోళనకరమని నివేదిక అభిప్రాయపడింది. ఈ పరిస్థితి కొత్తగా స్థాపించిన ఐఐటిలకే పరిమితం కాలేదని, 2015కు ముందు నుండి వున్న వాటిల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నదని ప్రకటించింది. పరిస్థితిని వివరించిన స్టాండింగ్‌ కమిటీ ఇది సాధారణమేనంటూ, ఈ క్షీణతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ పెట్టాలంటూ సూచనలతో సరిపుచ్చింది. దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యాలయాలుగా వున్న ఐఐటి, ఎన్‌ఐటిలలో చదువుకున్న వారికే ఉద్యోగాలు రాకపోతే ఇతర ఇంజనీరింగ్‌ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఈ పరిస్థితులకు కారణాలేమిటి? యువతకు ఉపాధి చూపే పరిష్కారాలు ఏమిటని కేంద్ర పాలకులు ఆలోచించడంలేదు. మరోవైపు ఐటి రంగంలో కొత్త కంపెనీలు రావడంలేదని, ఉన్నవే మూత పడుతున్నాయని సేవా రంగాల రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తాజా నివేదిక ప్రకటించింది.ప్లేస్‌మెంట్లు ఎందుకు లేవు? అంటే ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గడం. అవి ఎందుకు తగ్గాయంటే యూరప్‌, అమెరికాతోపాటు మన దేశ ఆర్థిక వ్యవస్థల సంక్షోభం కారణం. సంక్షోభం ఎందుకు వచ్చిందంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం, దీనికి మూలం అత్యధికమంది ఆధారపడిన వ్యవసాయం దివాళా తీయడం. లక్షల మందికి ఉపాధినిచ్చిన ప్రభుత్వరంగాన్ని ప్రైవేటీకరించడం, కొత్త పరిశ్రమలను స్థాపించకపోవడం, దేశీయ చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించకుండా అదానీ, అంబానీలను పెంచి పోషించడం. వీటి ఫలితంగా కోట్లాది యువత నిరుద్యోగంలో కూరుకుపోతుంటే, అతి కొద్దిమంది అత్యంత సంపన్న బిలియనీర్లుగా ఎదుగుతున్నారు. ఈ వాస్తవాలను ప్రజలు గుర్తించకుండా ఉండేందుకు మొన్నటి వరకు మహా కుంభమేళా, తాజాగా అమెరికా అధ్యక్షుడు మోడీని పొగిడిన వార్తలతో మీడియా హోరెత్తిస్తున్నది.
ఇంజనీరింగ్‌ క్రేజ్‌
1991 తర్వాత అనుసరించిన ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా ఇంజనీరింగ్‌ విద్యకు కొత్త క్రేజ్‌ వచ్చింది. ఇంజనీరింగ్‌ పూర్తయితే చాలు, ఐటి రంగంలో ఉద్యోగం, లక్షల వేతనం గ్యారంటీ అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దీంతో ఇంజనీరింగ్‌ కోర్సులో చేరుతున్న విద్యార్థుల్లో అత్యధికమంది కొన్నేళ్ళుగా కంప్యూటర్స్‌, డేటా సైన్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి విభాగాల్లో చదవడం పెరిగింది. రెండేళ్లుగా కంప్యూటర్‌ సైన్స్‌లో 85 శాతం పైగా సీట్లు భర్తీ అవుతుంటే, మెకానికల్‌లో 40-45 శాతం, సివిల్‌లో 25-30 శాతం సీట్లు కూడా భర్తీ కావడంలేదు. సాంకేతిక రంగంలో పరిశోధనలు గణనీయంగా తగ్గాయి. గత రెండు దశాబ్దాలుగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ విద్య అనేది ఒక దర్జాగా మారింది. 2022 నాటికి దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్‌ సీట్లు ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే 6,74,697 సీట్లు ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు వుంటే 30,812, ఎంబిఏ, పిజిడిఎం లాంటి మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సంబంధించిన కోర్సుల్లో కూడా ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాల్లోనే వున్నాయి. అందులో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధిక భాగం వున్నాయి. గత ఐదేండ్లుగా సంవత్సరానికి సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెలుతుంటే అందులో దక్షిణాది రాష్ట్రాల నుండి 2.8 లక్షల మంది ఉన్నారని ఎఐసిటిఇ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి) అధ్యయనంలో తేలింది.
ఐటి రంగంలో కొలువుల కొరత
ఐటిలో తమ పిల్లల భవిష్యత్‌ బాగుటుందనే ఆశతో లక్షల రూపాయలు ఖర్చు చేసి తల్లిదండ్రులు, తీవ్ర ఒత్తిళ్లతో పిల్లలు కష్టపడుతున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆభరణంగా పిలవబడిన ఐటి రంగం మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. 2004లో ఆరు లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు పొందుతుంటే నేడు సుమారు పది లక్షలకు పైగా పెరిగింది. ఈ రంగం నుండి దేశ ఆర్థిక వ్యవస్థకు 1990లో 197 మిలియన్ల ఆదాయం రాగా, 2020 నాటికి 8వేల మిలియన్లకు పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో సేవా రంగం వాటా 55 శాతం వుంటుందని పాలకులు అంచనా వేశారు. అయితే గత మూడేండ్లనుండి ఈ రంగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నది. ప్రపంచ ఐటి అవుట్‌ సోర్సింగ్‌లో మన దేశం కీలక స్థానంలో వుందని ఇన్నాళ్లూ గొప్పగా చెప్పుకున్నాం. మొదట్లో ఐటి రంగం కాల్‌ సెంటర్లకే పరిమితమైంది. క్రమంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, రియల్‌ ఎస్టేట్‌, ప్రొఫెషనల్‌ సర్వీసులు, ఫైనాన్స్‌, వినోదం ఇలా అనేక రంగాలకు ఈ సేవలు విస్తరించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6-8 శాతం మాత్రమే ఐటి రంగం వృద్ధి అయ్యే అవకాశం వుందని సేవ రంగాల రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తాజాగా అంచనా వేసింది. గత ఐదేండ్లల్లో కొత్తగా స్థాపించబడిన ఐటి కంపెనీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా పార్లమెంట్‌లో ప్రకటించింది.
2020లో 16,338 ఐటి కంపెనీలు వుంటే 2025 నాటికి 2,419 కి అంటే 90 శాతానికి తగ్గడం దేశీయ ఐటి రంగం పట్ల ఆశలతో వున్న కోట్లాది యువతను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ఆధారంగా కార్పొరేట్‌ దగ్గిజాలుగా పిలవబడుతున్న ఇన్ఫోసిస్‌, విప్రో వంటి కంపెనీలకు కేంద్రంగా వున్న బెంగళూరులో కొత్త ఐటి కంపెనీలు రావడంలేదు. కర్నాటకలో 2020లో కొత్త ఐటి కంపెనీలు 2,544 స్థాపించగా, 2025 మార్చి నాటికి 212కు, మహారాష్ట్రలో 2,483 నుండి 375కు, తెలంగాణలో 2,077 నుండి 233 తగ్గాయని మంత్రితత్వశాఖ నివేదిక తెలిపింది. ఇది కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాలేదని, దేశమంతటా ఇదే పరిస్థితి కొనసాగుతున్నదని ప్రకటించింది. కొత్త సంస్థలు రాకపోగా వున్నవి మూత పడడం ఈ రంగాన్ని మరింత కలవరపరస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,300 కంపెనీలు మూతపడ్డాయి. వీటిలో మహారాష్ట్రలో 459, కర్నాటకలో 440 మూతపడడం ఈ రంగంలో వున్న సంక్షోభానికి పరాకాష్ట. 2023 ఆర్థిక సంవత్సరంలో 2.40 లక్షల మందికి ఐటి రంగం ఉపాధి కల్పించగా, 2024 నాటికి ఇందులో 40 శాతం అంటే లక్ష మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయింది. దేశంలోని ఐదు పెద్ద ఐటి కంపెనీల్లో 21,838 మంది ఉద్యోగాలను కోల్పోయినట్లు మంత్రతత్వ శాఖ నివేదిక తెలిపింది. ఐటి ఉద్యోగాలు తగ్గడమంటే దానితో ముడిపడిన ఈ అన్ని రంగాలు కష్టాల్లో వున్నట్లే. అందుకే క్యాంపస్‌ నియామకాలు తగ్గిపోతున్నాయి. ఎంపికైన వారికి సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వడంలేదు. పనిలో వున్నవారికి వేతనాల పెంపుదల నామమాత్రంగా జరుగుతున్నది. ఇదిలా వుండగా 18 గంటల పనిదినం కావాలని, ఆదివారం శెలవు ఎందుకని ఐటి యాజమాన్యాలు బహిరంగంగానే ప్రకటి స్తున్నాయి. దీంతో ఐటి ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. ఇటీవల బెంగళూరులో వేలాది టెకీలు రోడ్డు మీదకొచ్చి ‘మేము బానిసలం కాదు, మాకు కుటుంబాలు వున్నాయి’ అని గర్జించారు.
ఈ పరిస్థితికి కారణాలు
2025లో ప్రపంచ ఆర్థికాభివఅద్ధి రేటు 3.2 శాతానికి మించి వుండదని, అభివృద్ధి చెందిన యూరప్‌ దేశాలతో పాటు, అమెరికా 1 నుండి 1.78 శాతానికి మించి అభివృద్ధి సాధించలేవని ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు అంచనా వేశాయి. 46 దేశాల అభివృద్ధి మరింత కనిష్టంగా వుంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 13 శాతం మంది యువజనులు అంటే 6 కోట్ల 49 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సంపదలో కార్మికుల వాటా పెద్ద ఎత్తున తగ్గింది. ప్రపంచ జనాభాలో 300 కోట్ల మంది దారిద్య్రరేఖ కంటే దిగువన జీవిస్తున్నారు. మన దేశంలో వ్యవసాయం, తయారీ రంగాలు గత రెండు దశాబ్దాలుగా సంక్షోభంలో వున్నాయి. పెద్దనోట్ల రద్దు, కోవిడ్‌ చిన్న, మధ్యతరహా పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీశాయి. పదకొండు సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ దగ్గర ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన ఆర్థిక ప్రణాళిక లేదు. మతాన్ని, రాజకీయాలను మిళితం చేసి ప్రజల ఐక్యతను చీల్చి అధికారంలో కొనసాగడం, అధికార బలంతో కార్పొరేట్‌ శక్తులకు దేశాన్ని దోచిపెట్టడం వారి విధానంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత విద్యావంతులు వాస్తవాల్ని గుర్తించడం ముఖ్యం.
వి.రాంభూపాల్‌వి.

Spread the love