– ఆర్డర్‌పై ట్రంప్ సంతకం
వాషింగ్టన్: అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్‌ను పేర్కొంటూ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. తాజా ఆదేశాలు ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు తమ సేవలను, పత్రాలను ఆంగ్లేతర భాషల్లో కొనసాగించాలా, వద్దా? అని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ”ఇంగ్లీష్ అధికారిక భాషగా ఏర్పాటు చేయడం వల్ల సంభాషణలు క్రమబద్ధీకరించడమే కాకుండా ఉమ్మడి జాతీయ ప్రయోజనాలు బలోపేతమవుతాయి. సమ్మిళిత, సమర్థవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు” అని ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామం దేశంలో ఐక్యతను ప్రోత్సహిస్తుందని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో సమర్థతను నెలకొల్పుతుందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మార్గాన్ని ఏర్పరుస్తుందని వైట్‌హౌజ్ అభిప్రాయపడింది. ఇంగ్లీష్‌ను అధికారిక భాషగా గుర్తిస్తూ ఇప్పటికే అమెరికాలోని 30 రాష్ట్రాలు చట్టం చేసినట్టు సమాచారం. అయితే, అమెరికా అధికార భాషగా గుర్తింపు కోసం కాంగ్రెస్ చట్టసభ సభ్యులు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే వైట్‌హౌస్ వెబ్‌సైట్ స్పానిష్ వెర్షన్‌ను తొలగించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడయ్యాక ఇదే విధంగా చేసినప్పటికీ.. బైడెన్ వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించడం గమనార్హం.