సమ సమాజ నిర్మాణం – సామాజిక న్యాయం

Equality Society Building - Social Justiceసామాజిక న్యాయం అంటే వ్యక్తికి సమాజానికి మధ్య న్యాయమైన సంబంధం. సరళంగా చెప్పాలంటే, సమాజంలో సంపద, అవకాశాలు, హక్కుల పంపిణీ పరంగా న్యాయాన్ని ఇది సూచిస్తుంది. జాతి, లింగం, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సమానత్వంతో జీవిస్తున్నా రనే భరోసా ప్రజల్లో కలగాలి. చట్టబద్ధమైన పాలన ద్వారా సామాజిక ఆర్థిక అసమానతల సవాలును ఎదుర్కోవడం దీని లక్ష్యం. ఒక దేశం అభివృద్ధి బాటలో పయనించాలంటే అక్కడ ఉండే ప్రజల సహకారం అవసరం. దీనికి ప్రజలందరికీ వివక్ష లేకుండా సామాజిక న్యాయం అందించ బడాలి. ఒకవేళ సరైన రీతిలో సామాజిక న్యాయం అమలు కాకపోతే అక్కడ ప్రజల్లో అసంతృప్తి పేరుకుని ఆందోళనలు, పోరాటాలు, ఉద్యమాలు చెలరేగుతాయి. అనేక దేశాల్లో ఇలాంటి నిరసనలు ఈ కాలంలో పెరగ డాన్ని మనం గమనించొచ్చు. సమాజంలో వనరులు, అవకాశాలు, విశేషాధికారాల నిష్పాక్షిక, సమాన పంపిణీని సామాజిక న్యాయం అంటారని ప్లేటో తాను రాసిన ” ది రిపబ్లిక్‌” గ్రం థంలో ప్రస్తావించారు. ఆధునిక కాలంలో ఇది పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో పారిశ్రామిక విప్లవ అనం తరం పెట్టుబడిదారీ దోపిడీకి బలైపోతున్న మానవ శ్రమకు పరిష్కారం చూపించి సమానత్వ సమాజా లను సృష్టించే లక్ష్యంగా యూరప్‌ అంతటా జరిగిన పౌర విప్లవాల సమయంలో ఉద్భవించింది.
సామాజిక న్యాయం సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. పేదరికం, అసమానతలు, సామాజిక ఉద్రిక్తతలను తగ్గిస్తుంది. చట్టపరమైన, రాజకీయ, ఆర్థిక, ఇతర పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రజలు సంపద, ఆరోగ్యం, శ్రేయస్సు, న్యాయం, సమాన ప్రాప్తిని కలిగి ఉంచుతుంది. ఇంకా ఆర్థిక పరంగా, సామాజిక న్యాయ ప్రయత్నాలు సాధారణంగా జాతి, లింగ, మతం వంటి సమూహ గుర్తింపు లేదా జనాభా లక్షణాల ద్వారా నిర్వచించబడిన వివిధ సమూహాల ఆర్థిక స్థితిని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించ బడుతుంది. చట్ట పరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను అధిగమించడానికి చేయవలసిన కృషికోసం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నేడు నిర్వహించుకుంటారు. ”సామాజిక న్యాయం కోసం ప్రపంచ కూటమి- అంతరాలను తగ్గించి పొత్తులను నిర్మించడం.” అనే ఇతివృత్తాన్ని ఈ ఏడాది తీసుకున్నారు. దేశాల్లో అంతర్గతంగా, విభిన్న దేశాల మధ్య శాంతి, భద్రతను సాధించడానికి, నిర్వహించడానికి సామాజిక అభివృద్ధి, సామాజిక న్యాయం ఎంతో అవసరమని, అన్ని మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల గౌరవం లేనప్పుడు సామాజిక అభివృద్ధి, సామాజిక న్యాయం పొందలేమని ఈ దినోత్సవం గుర్తిస్తుంది. పేదరిక నిర్మూ లన, పూర్తి ఉపాధి, గౌరవప్రదమైన పనిని ప్రోత్సహించడం, లింగ సమానత్వం, సామాజిక శ్రేయస్సు, అందరికీ న్యాయం పొందడంలో అంత ర్జాతీయ సమాజం ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడానికి ఈ దినోత్సవం దోహదపడుతుంది. సమాజం తన సామాజిక వనరులను ఎలా విభజిస్తుందో దానిలో న్యాయాన్ని ఇది నొక్కి చెబుతుంది. సామాజిక న్యాయం సామాజిక సంస్థల్లో హక్కులు బాధ్యతలను ఏర్పరుస్తుంది. సహకార ప్రయోజనాలు, ఖర్చుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావడానికి అనుమతిస్తుంది. పన్నులు, సామాజిక బీమా, ప్రజారోగ్యం, ప్రజా విద్య, ప్రజాసేవలు, కార్మిక చట్టం, మార్కెట్‌ నియంత్రణ అనేవి సమాన అవకాశాలు, సంపద పంపిణీని నిర్ధారించడంలో ఇది సహాయపడే విధంగా ఉంటుంది. నేడు రష్యా-ఉక్రెయిన్‌, పాలస్తీనా-ఇజ్రాయిల్‌ యుద్ధాల వల్ల వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ దేశాల మధ్య సామరస్యాన్ని పెంపొందించి దేశ ప్రజలకు భరోసానిచ్చే విధంగా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకోవడం తక్షణ అవసరం.
మనదేశంలో సామాజిక న్యాయం సమస్య సామాజిక సమానత్వంతో ముడిపడి ఉంది. స్వాతంత్య్రం సమయంలో సామాజిక సమా నత్వం, సామాజిక న్యాయం అనే భావన రాజ్యాంగ నిర్మాతలను బాగా ప్రభావితం చేసింది. సోషలిస్ట్‌, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వంటి పదాలను అదే కారణంతోనే రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబ డింది. అన్ని వర్గాల ప్రజలను ఎటువంటి సామాజిక భేదం లేకుండా న్యాయంగా చూసుకోవడమే సామాజిక న్యాయం. ఇది సమాజంలోని పేద, బలహీన వర్గాల తరగతులు, మహిళల సమస్యలు, సంపద, జీతం, ఆస్తిలో స్పష్టమైన అసమానతలను తొలగిస్తుంది. కానీ ఈ దశాబ్దకాలంగా చూస్తే నేడు అధికారంలో ఉన్న పాలకులు దేశాన్ని మతప్రాదికన పాలించడం ఆందోళనకరం. విభజించు, పాలించు విధానాన్ని అవలంభించడంతో రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య అసమా నతలు పెచ్చుమీరుతున్న పరిస్థితి. సందదంతా కొద్ది మంది సంపన్నులకు చెందేలా చూడటం పేద, ధనిక మధ్య అంతరాలు పెరగడానికి కారణం. ”పంపిణీ న్యాయం” అని పిలువబడే సామాజిక, ఆర్థిక న్యాయాల కలయిక. ప్రవేశిక కింద భారతీయులందరికీ అవకాశం, హోదాలో సమానత్వం హామీ ఇవ్వ బడింది. సామాజిక పురోగతికి సామాజిక న్యాయాన్ని ఒక సమర్థవంతమైన సాధనంగా మార్చడానికి, విధానాలు సరిగ్గా, నిష్పాక్షికంగా అమలు చేయబడతాయని పాలకులు హామీనివ్వడం చాలా ముఖ్యం. మన దేశంలో సామాజిక న్యాయం రాజ్యాంగం ఆర్టికల్స్‌ ద్వారా దేశ ప్రజలకు హామీ ఇస్తుంది. ఆర్టికల్‌ 15(1) మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఆర్టికల్‌ 16(1) అందరికీ సమానావకాశాలు కల్పిస్తుంది. ఆర్టికల్‌ 17 అంటరానితనాన్ని నిర్మూలించి దాని ఉనికిని నిషేధించింది. ఆర్టికల్‌ 19 దేశ ప్రజల ప్రాథమిక హక్కులను ప్రతిబింబిస్తుంది. 23, 24 ఆర్టికల్స్‌ దోపిడీకి వ్యతిరేకంగా ప్రాథమిక హక్కులను కల్పిస్తున్నాయి. ఆర్టికల్‌ 38 ప్రజల సంక్షేమాన్ని పెంపొందించడానికి ఒక సామాజిక క్రమాన్ని రూపొందించాలని రాష్ట్రాన్ని నిర్దేశిస్తుంది.
జీవితం అర్థవంతంగా, గౌరవంతో జీవించగలిగేలా ఉండాలంటే, మన రాజ్యాంగంలో పొందుపరచబడిన విధంగా అందరికీ న్యాయం చేయడం, వారి హక్కులను కాపాడడం చాలా ముఖ్యం. ఇది సమాజంలోని పేదలు, బలహీన దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాల బాధలను తగ్గించడానికి ఒక సాధనం. ఆరోగ్యం, విద్య సౌకర్యాలను అందించడం ద్వారా మానవ వనరుల పరిరక్షణకు సహాయపడుతుంది. సమాజంలో కులవ్యవస్థ, అంటరానితనం, ఇతర వివక్షత వంటి సవాళ్లను నిర్మూలించడానికి దోహదపడుతుంది. అదనపు కట్నం, ఆడ భ్రూణహత్యల వంటి దురాచారాల్ని రూపుమాపేలా చేస్తుంది. ఇది తగ్గుతున్న లింగ నిష్పత్తి, బాలికలకు పరిమిత విద్యా అవకాశాల సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక, ఆర్థిక స్థితి, వారి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా సామాజిక న్యాయాన్ని అందించేందుకు పాలకులు కృషి చేయాలి. పిల్లలకు సంబంధించి బాలకార్మిక, బాల్యవివాహం, పోషకాహార లోపం, మహిళల పట్ల లింగ వివక్షత, పిల్లలపై వేధింపులు, అశ్లీలత, శిశు మరణాలు లేకుండా చూడాలి. మైనార్టీలకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించి వారికి భరోసాగా నిలవాలి. అందరికీవిలువలతో కూడిన విద్యనందించాలి. దళితులు, గిరిజనులకు రాజ్యాంగ పరమైన హక్కులు కల్పించబడాలి. మహిళలకు అన్ని హక్కులు అమలు కావాలి. ఎటువంటి వివక్ష లేకుండా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలి. ఇలా సామాజిక సమస్యల్ని, సవాళ్లను పరిష్కరించి ముందుపోయినప్పుడే సమ సమాజం నిర్మాణం సాధ్యం.
(నేడు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం)
డి.జనక మోహనరావు
8247045230

Spread the love