స్వాతంత్య్రానికి పూర్వం మాదిగ జీవితం

Our life before independenceతరాలు మారుతున్నాయి. అంతరాలు మారుతున్నాయి. అందరూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతా సమానమే అంటున్నారు. కులం లేనే లేదంటున్నారు. కానీ కులం ఎక్కడికి పోలేదు. ఏదో ఒక రూపంలో అది సమాజాన్ని వెంటాడుతూనే ఉంది. ఈ విషయాన్ని సాధికారికంగా చిత్రించిన నవల జక్కులు. దళితుల జీవన విధానం వివక్ష దశాబ్దాల కింద ఎలా ఉందో, అటు ఇటుగా ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ విషయాన్ని మనకు నొక్కి చెపుతున్న నవల జక్కులు. ఇది మంథని శంకర్‌ రాసాడు. తను తన పూర్వికులు చూసిన అనుభవించిన జీవితమే ఈ నవల అనిపిస్తుంది. ఒక రకంగా ఇన్‌ సైడెర్‌ ఈ నవల శంకర్‌ భయోగ్రఫీ అనికూడా అనుకోవచ్చు. దళితుల జీవిత పార్శ్వాలను లోతుగా చిత్రించినది జక్కులు నవల.
ఈ నవల కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని మంథని ప్రాంతమందు 1946కు ముందు కాలంలో జరిగిన మాదిగల జీవితాన్ని ప్రతిబింబించింది. నవలా నాయకుడు జక్కులు. అతను పుట్టింది మొదలు పెరిగిన జీవితాన్ని, జీవితంతో పాటు అప్పటి సమాజాన్ని, సామాజిక చలనాన్ని వర్ణించినది ఈ నవల. అంతర్లీనంగా ఉన్న అప్పటి కుల వివక్ష. అంతే కాకుండా పల్లెటూరులో బడుగు బలహీన వర్గాలు జరుపుకునే పండగలు. అందరినీ కలుపుకుని జరుపుకునే పీరీల పండుగ. దళితులను దూరంగా ఉంచి జరుపుకునే బతుకమ్మ పండుగ దాకా నవలలో చిత్రించబడినది. దళిత జీవనంతో పెనవేసుకున్న పండుగలను, ముస్లిం సమాజం మాదిగల సమాజం కలిసిపోయిన తీరును వర్ణించింది.
ఈ నవలలో రజాకార్ల ఆగడాల నుంచి కమ్యూనిస్టుల పోరాటం దాకా ఎన్నో చారిత్రక సంఘటనలు తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల ప్రస్తావన ఉంది. ఆ కాలంలో భూస్వాముల దోపిడి భూమి కోసం చేసే పోరాటాలు ఎదురు తిరిగితే పడే తీవ్రమైన శిక్షలు ఇందులో కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తాడు రచయిత. అది రజాకార్ల కాలం. ఆ కాలంలో దొరలు భూస్వాములకు రజాకార్లు ఎలా వంత పలికే వారో వారికి ఎలా సహకరించేవారు సోమయదొర ఆదిరెడ్డి లాంటి పాత్రలతో మనకు రచయిత విశదపరుసాడు.
గుర్రపు స్వారీ మరియు దప్పు కొట్టడం లాంటి కొన్ని విద్యలు దళితులు తమంతట తామే అధ్యయనం చేయడం ద్వారా నేర్చుకుంటారన్న వాస్తవం ఈ నవల చెబుతుంది.ఆ కాలంలో మాదిగల జీవితం ఎలా ఉండేది వాళ్ల చేత సభ్య సమాజం ఎలాంటి పనులు చేయించేది. వాళ్ళు ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారు. చాలా హద్యంగా వాస్తవంగా వివరిస్తుందీ నవల. దొరలు, భూస్వాముల ఆగడాలు, దళితులను వాళ్ళు ఎలా అవహేళనగా చూసారు, కేవలం తిండి గింజల కోసం దళితులు పడే ఆరాటం రచయిత ఇందులో వాస్తవంగా చిత్రీకరించాడు రచయిత.
నవలలో ప్రధాన పాత్ర అయిన జక్కులు తన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి అందరిలా ఊరుకోకుండా భరించకుండా దాని పరిష్కారం కోసం ఆలోచిస్తుంటాడు. కానీ తమకు కీడు చేసె దొరలు భూస్వాములకు కూడా మేలు చేయడం, వాళ్ళ మేలుని కోరడం దళితుల యొక్క కల్లాకపటం తెలియని మనస్తత్వాన్ని సూచిస్తుంది.
గ్రామంలో భూమిని అంత తమ ఆధీనంలో పెట్టుకున్నది దొరలు. కాని వాళ్ళ భూములను పండించేది మాత్రం మాదిగలు. వాళ్ళ పంటకు రోగాలు వస్తే గ్రామదేవతల కొలువులు చేయాల్సింది మాదిగలే. వర్షాలు బాగా కురిసి చెరువు తేగే పరిస్థితి వస్తే మైసమ్మ జాతర చేయాల్సింది కూడా దళిత బహుజనులే. ఇవన్నింటికి ముందుండి నడిచే దళితులకు చివరికి ఉనికి ఉండదు. అంటే తమ ఊరిలోనే దళిత బహుజనులకు తమదైన జీవితం అంటూ ఉండదు. దొరల ఆధిపత్య వర్గాల అవసరాలు తీర్చడమే ఊరి శ్రామిక కులాల జీవితం. కనీసం వీరికి ఏదైనా విలువైన ప్రతిఫలం ఉంటుందంటే అదీ ఉండదు. కనీసం మర్యాద అనే మాట కూడా ఉండదు. కడుపునిండా తిండి ఉండదు. ఆర్థిక ప్రతిఫలం కూడా ఉండదు. ఇలాంటి వాస్తవిక సంఘటనలతో నవల సాగుతుంది.
రచయిత జక్కులును ఒక విచిత్రమైన నాయకుడుగా తీర్చి దిద్దాడు. అతడు ఒక శ్రామికుడు. అన్నింటికి మించి మంచి డప్పు కళాకారుడు. అతడి డప్పు నైపుణ్యం చూసి పెద్ద కులానికి చెందిన భారతి ఆకర్షితురాలు అవుతుంది. అలాగే నర్సు కూడా ఆకర్శితురాలవుతుంది. అయినా యవ్వనంలో ఉన్న జక్కులు ఎక్కడ బలహీనతకు లోను కాడు. శ్రామికులకు ఉండే తాగుడు అలవాటు కూడా అతనికి లేదు. చాలా నిగ్రహంగా ఉంటాడు. నిక్కచ్చి వ్యక్తిత్వంతో ఉంటాడు. తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడే జక్కులు తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు.
భర్త చనిపోయిన రంగిని తిరుపతి దొర కొడుకు రమేష్‌ అనుభవించి కడుపు చేస్తే కాన్పు కాగానే బిడ్డకు నోట్లో వడ్ల గింజలు వేసి చంపేస్తుంది. కానీ ఆ అన్యాయాన్ని ఎదిరించి అడగని అసహాయత రంగిది.పై కులాల అమ్మాయిలు కింది కులాల అబ్బాయిలను కవ్వించినా చివరికి బూతులు వినాల్సింది, దెబ్బలు తినాల్సింది పేద కులాల యువకులే. ఈ నవలలో ఈ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.
ఈ కులతత్వం, అస్పశ్యత, సమాజంలో లోతుగా ఎలా నాటుకు పోయింది, ఒక డక్కలి స్త్రీ అడుక్కుంటుండగా ఒక మాదిగ పిల్లవాడు ఆమెను తాకినప్పుడు జరిగిన పరస్థితులు అప్పటి సమాజ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు మనకు చూపిస్తాడు రచయిత. పంటల కాలంలో తిరుపతిరెడ్డి పొలంలో జక్కులు వరికట్టలు ఎక్కువ కట్టాడని రమేష్‌ రెడ్డి అతన్ని తంతాడు. మారన్న జక్కులను ఓదార్చి రమేష్‌ రెడ్డి మీద తిరగబడతాడు. తనని కొట్టడం భరించలేక జక్కులు రమేష్‌ రెడ్డిని కొడతాడు. దీని మీద ఆది రెడ్డి దగ్గర పంచాయతీ. జక్కులు తన వాళ్ళని సమీకరించి ఆదిరెడ్డి దగ్గర మట్లాడిన తీరు దీంతో గ్రామం రెండు పాయలుగా చీలిపోతుంది. ఒక సందర్భంలో ఊరిలో శాలోళ్ళు మాదిగలు ఘర్షణ పడుతుంటే ఆదిరెడ్డి లేచి వెళ్ళిపోతారు. శాలోల్లతో కలిసి మాదిగల మీద దాడి చేస్తారు. ఆ సమయంలో రమేశ్‌ రెడ్డితో బాధలను అనుభవించి ఉన్న రంగి అతని కంట్లో కారం కొడుతుంది. అతని మెడ మీద కాలు పెట్టి నలిపింది. రంగి ఈవిధంగా పగను తీర్చుకున్న సంఘటన ఎంతో తీవ్రతను చిత్రించిన నవల ఇది. పరిశీలన అధ్యయనం ఉంటే తప్ప ఇలా లోతైన జీవితాలను చిత్రించడం కుదరదు.
నవలలో అనేక పర్యాయములు యువతీ యువకుల మధ్య కులాతీతంగా పుట్టే ఆకర్షణ ఉంది. జక్కులు ఎర్ర పోసు. జక్కులు నర్సు, జక్కులు భారతి, అఫ్టల్‌ పద్మ, ఇలా ఈ ఆకర్షణతో మనకు ఏమి తెలుస్తుందంటే మానవ సంబంధాలు ప్రేమలు సహజంగా ఏర్పడతాయని వాటికి కులమత ఆర్థిక బేధాలు ఉండవని తెలుస్తుంది.
ఈ దేశంలో ఇంకా ఊరుకు దళిత వాడకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఈ తేడాను చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడే శక్తులు కూడా ఉంటాయి. శంకర్‌ జీవితాన్ని అనుభవించి అధ్యయనం చేసి పలవరించి రాసిన నవల ఇది. నవల రాయడం లో ఆయన ప్రదర్శించిన నైపుణ్యం, నవల నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్త నవల కోసం చేసిన అధ్యయనం రచయితగా అతడిని ఒక మెట్టు పైన నిలబెడుతుంది.
కథానాయకుడు జక్కులు అందరికీ ప్రేమాస్పదుడు. ఆత్మ సౌందర్యం ఉన్నవాడు. మనుషులంటే అపారమైన ప్రేమ ఉన్నవాడు. సాహస వంతుడు. మడుగును చూసి అందరు భయపడుతుంటే దాన్ని ఒంటిచేత్తో ఈదిన మొనగాడు.అందుకే అతడు అంటే యువతులకు మోహం. ఇంకా యవ్వనంలో ప్రవేశించక ముందే నర్సు జక్కులను కావాలంటుంది. మనస్పూర్తిగా అతనితో ఏకం కావాలనుకుంటుంది. ఆ ఊరి రెడ్డి కూతురుకు కూడా జక్కులంటే తనివి తీరని ప్రేమ. గాఢంగా ప్రేమించింది. తన ప్రేమ తెలిస్తే ఎక్కడ జక్కులుకు ఆపద కలుపుతుందేమోనని భయపడింది. అతడు యోగక్షేమాలు కోరుకుంది. నవలలో భారతి పాత్ర రచయిత ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. అగ్రకులాలకు మాదిగలకు మధ్య జరిగిన ఘర్షణ నవలలో అక్కడక్కడా చిత్రించినా అనాటి సామాజిక వైరుద్యాన్ని అంటరానితనపు తీవ్రతను దళితుల పట్ల సమాజపు చిన్న చూపును వాస్తవానికి దగ్గరగా చిత్రించాడు.
మాదిగ యువకులలో వస్తున్న చైతన్యాన్ని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోలేక దొంగ చాటుగా దాడులు చేయించి తనకి ఏమీ తెలియనట్లు ఉండే వాడు ఆదిరెడ్డి. మాదిగలతో తన అవసరాలను తీర్చుకుంటుండేవాడు. దొరల ఆధీనంలో ఉన్న భూములన్నీ మాదిగలవేనని వారి పేరు మీద తహసీల్‌ ఆఫీస్‌ లో కాగితాలు ఉన్నాయని అఫ్టల్‌ ద్వారా మాదిగలకు తెలుస్తోంది. మాదిగల నుంచి ఆ కాగితాలను తీసుకోవాలని సోమయ్య మాదిగల అందరిని బంధిస్తాడు. ఈ మొత్తం దౌర్జన్యానికి ఆదిరెడ్డి సహకరిస్తాడు. చివరికి జక్కులు తండ్రి మాదిగ మారన్ని చంపేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావించిన ఆదిరెడ్డి చెరువు కట్ట దగ్గర ఉన్న మైసమ్మ పండుగకు ఏర్పాటు చేస్తాడు. ఆ పండుగలో దున్నను బలిచ్చే సమయంలో పాడైన మొండి కత్తిని మారయ్య చేతికిచ్చి అతని అక్కడే చంపించాలని సోమయ్య దొర ఆదిరెడ్డి ఇద్దరు కుట్ర చేస్తారు. కానీ విషయం తెలిసిన జక్కులు తన తండ్రి మారయ్యను రక్షించుకోవడం కోసం గుర్రం మీద జోరుగా కురుస్తున్న వర్షంలో వెళ్ళి మైసమ్మకు దున్నను బలిస్తాడు. ఇది నవలలో ఉత్కంటతను కలిగించే సంఘటన.
ఇప్పటి తరానికి తెలియని ఎన్నో చారిత్రక అంశాలను చర్చకు పెట్టింది ఈ జక్కులు నవల. చిందు డక్కలి కులాలు మాదిగలను తప్ప ఇంకే కులాలను ఆశ్రయించరు. మాదిగలే సమాజంలో అట్టడుగున ఉంటారంటే వారి కన్నా ఇంకా దీనంగా వారినే అడుక్కునే కులాల జీవితాలను ఒకసారి ఊహించకుంటే అప్పటి సామాజిక అసమానతలు మనకు ఈ నవల ద్వారా అవగతమవుతాయి. సంవత్సరానికి ఒకసారి జాంబవ పురాణం కథను మాదిగలకు చెప్పేవారు చిందు వాళ్ళు. మాదిగల నుంచి త్యాగం తీసుకుంటారు. మాదిగలలో పెద్ద మాదిగ వీరికి ఆశ్రయం ఇస్తారు. ఇలా ఉపకులాలను సాకడానికి ఆ రోజుల్లో మాన్యం భూములు ఉండేవి. వాటి మీద వచ్చిన పంటను వీళ్ళకి బరణంగా ఇచ్చేవారు. పంటతో పాటు ఇంటికి ఇంత అని కొన్ని గింజలు పెట్టేవాళ్ళు. చిందువాళ్ళు ఆటలు పాటలు వారి సాంస్కతిక విశేషాలను జక్కులు నవలలో విస్తారంగా చూడవచ్చు. మొత్తంగా ఒక మంథని లాంటి అగ్రహారం పరిసరాలల్లో స్వాతంత్రానికి పూర్వం దళితుల జీవణ చిత్రణను సాధికారకంగా చిత్రించిన నవల జక్కులు. శైలి శిల్పపరంగా ఒక కొత్త ఒరవడిని సష్టించిన నవల కూడా ఇదే. ఈ నవల రచయిత మంథనిశంకర్కు అభినందనలు.
– పెద్దింటి అశోక్‌ కుమార్‌
సినీ రచయిత

Spread the love