Tuesday, July 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎర్రగడ్డ ఆస్పత్రి భూమి ప్రభుత్వానిదే : హైకోర్టు

ఎర్రగడ్డ ఆస్పత్రి భూమి ప్రభుత్వానిదే : హైకోర్టు

- Advertisement -

‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎర్రగడ్డ బహలూల్‌ ఖానాగూడ (ఎర్రగడ్డ ఆస్పత్రి) పరిధిలోని 1.31 ఎకరాలు, 1.20 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చిచెప్పింది. లీజు పత్రాలు లేదా రెవెన్యూ రికార్డుల్లో మార్పుల ఆధారంగా యాజమాన్య హక్కులు రావని స్పష్టం చేస్తూ ప్రయివేటు వ్యక్తులకు అనుకూలంగా కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను సోమవారం రద్దు చేసింది. నిజాం కాలంలో ప్రభుత్వం లీజుకు తీసుకున్న భూమిపై ప్రయివేటు వ్యక్తులకు హక్కులు సంక్రమించబోవని తెలిపింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ భూమి ప్రభుత్వానిదేనని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్‌ సుద్దాల చలపతిరావు అనుమతించారు.

9న బండి సాయి భగీరథ్‌ బెయిల్‌పై ‌హైకోర్టు తీర్పు
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును ఈనెల తొమ్మిదో తేదీకి రిజర్వు చేసింది. దర్యాప్తు తుది దశలో ఉన్నందున బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్‌ వాదించగా, పిటిషనర్‌ తరఫు న్యాయవాది కేసు ఆలస్యంగా నమోదైందనీ, 45 రోజులుగా జైలులో ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. విచారణ సందర్భంగా పోక్సో కేసు కావడంతో ఆన్‌లైన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది.
సలార్‌-ఇ-మిల్లత్‌ ట్రస్ట్‌ భవనాలకు స్టేటస్‌కో
బండ్లగూడ మండలం కేశవగిరిలో సలార్‌-ఇ-మిల్లత్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్మించిన భవనాలకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భవనాన్ని కూల్చివేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయత్నిస్తున్నారని ట్రస్ట్‌ హైకోర్టును ఆశ్రయించింది. భవన క్రమబద్ధీకరణకు సంబంధించి బీఆర్‌ఎస్‌ దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో స్టేటస్‌కో కొనసాగించాలని ఆదేశించిన కోర్టు, పూర్తి వివరాలు సమర్పించాలని జీహెచ్‌ఎంసీకి సూచిస్తూ విచారణను వచ్చేనెల మూడో తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -