– అనుమతులు రద్దు చేయాలని గుగ్గీల్ల,పోతారం రైతుల డిమాండ్
పచ్చని పంట పొలాల్లోకి రసాయన పరిశ్రమలు రావడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామ శివారులో సుమారు 22 ఎకరాల్లో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం,తయారైన ఇథనాల్ ఇంధనాన్ని నిల్వ చేయడానికి పోతారం గ్రామ శివారులో స్టోరేజ్ నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.మరోపక్క పరిశ్రమ నిర్మాణంపై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని రైతులు చెబుతున్నారు. ఆ తర్వాత ఈ పరిశ్రమ ప్రారంభమైతే చుట్టుపక్కల పొలాలపై ప్రభావం పడుతుందని.. వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు దుర్వాసన వస్తుందని, జీవ వైవిధ్యానికి అవరోధంగా మారుతుందని భావించిన రైతులు పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే గుగ్గీల్ల గ్రామ శివారుల్లోని పరిశ్రమల వ్యర్థాలు చుట్టుపక్కల సమీప పొలాల్లోకి రావడంతో దుర్వాసన కారణంగా పనులు చేసేందుకు కూలీలు ఎవరూ రావడం లేదని తెలుసుకున్న రైతులు ఇక్కడ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించారు. సుమారు గత కొద్ది నెలల నుంచి వివిధ రూపాల్లో నిరసన కొనసాగుతోంది. అధికారులు,పాలకవర్గం తీరుపై రైతుల అగ్రహం ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా అధికారులు,అయా గ్రామాల పంచాయతీల పాలకవర్గం సభ్యులు కుమ్మక్కయి పరిశ్రమ యాజమాన్యానికి అనుగుణంగా పంచాయతీ తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి అందజేశారని అయా గ్రామాల రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి అధికారులు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు సహకరించేల వ్యవహరిస్తు తమ జీవితాల్లో మట్టి కొడుతున్నారని రైతులు అవేదన వెలిగక్కుతున్నారు.