యూరో పార్లమెంటు ఎన్నికలు – ప్రమాద సూచికలు

యూరో పార్లమెంటు ఎన్నికలు - ప్రమాద సూచికలుయూరోపియన్‌ పార్లమెంటుకు జూన్‌ 9న జరిగిన ఎన్నికలు పచ్చి మితవాద పార్టీలు ప్రముఖ శక్తిగా ఆవిర్భవిం చడానికి దారితీశాయి. ఈ పార్టీలలో అనేకం పెట్టుబడిదారీ అనుకూలత, వలస ప్రజానీకంపై వ్యతిరేకత కలిగినవి. అంతేగాక పర్యావరణం గురించి కూడా సందేహాస్పద పాత్ర పోషించేవి. నేటి ప్రపంచీకరణ అనంతర వాతావరణంలో ఈ ఫలితాలు ప్రమాదకర సంకేతాలుగా వున్నాయి. మధ్యేవాద మితవాద కన్సర్వేటివ్‌ శక్తిగా వున్న యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ ఈ ఎన్నికల్లో తన ఓట్ల వాటాను, సీట్లను కూడా నిలబెట్టుకోలేక పోయింది. వామపక్ష మధ్యేవాద సోషలిస్టులు ప్రజాతంత్ర వాదులతో కూడిన ప్రగతిశీల కూటమి ఓట్ల వాటాను స్వల్పంగానూ (ఒక శాతం), సీట్లను (నాలుగు) కోల్పోయింది. కార్పొరేట్‌ అనుకూలమైన ‘రీన్యూ యూరప్‌’ (పునరుద్ధరణ) కూటమి చాలా తీవ్ర స్థాయిలో నాలుగు శాతం ఓట్లను (23 సీట్లను) కోల్పోయింది. వామపక్షాలు, పర్యావరణ వాదుల బృందం ‘జియుఇ/ఎన్‌జిఎల్‌’ ఒక సీటును, 0.2 శాతం ఓట్లను పోగొట్టుకుంది. ఇంకా ఇతర వివిధ హరితవాద పార్టీలు కలసి మొత్తం 20 సీట్ల వరకూ కోల్పోయాయి.
పచ్చి మితవాద పార్టీలు ప్రధానంగా విజయాలు సాధించాయి. ఆ పార్టీల ప్రాతినిధ్యం 30 సీట్లకు పైగా పెరిగింది. 720 మంది సభ్యులున్న యూరోపియన్‌ పార్లమెంటులో ఈ పచ్చి మితవాద పార్టీలకు 145 స్థానాలు దక్కాయి. అంటే దాదాపు నాలుగో వంతు. మితవాదులు, పచ్చి మితవాదులకు కలసి ఇప్పుడు 331 స్థానాలయ్యాయి. ఇతరులు అనే పేరుతో వున్న 55 మందిలోని అనేకమందిని కలిపితే (వీరిలో చాలామంది మితవాద భావాల పట్ల సానుభూతి కలిగినవారు) మితవాద పక్షం బలీయమైన శక్తి అవుతుంది. యూరప్‌లోని మూడు ప్రధాన దేశాలు/ఆర్థిక వ్యవస్థలైన జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీల్లో పచ్చి మితవాద పార్టీలు ఇలా మెరుగైన ఫలితాలతో ముందుకు రావడం ప్రమాద సూచికే. జర్మనీలో డచ్‌లాండ్‌ ఆల్టర్నేటివ్‌ (ఎ.ఎఫ్‌.డి) 16 శాతం ఓట్లు తెచ్చుకుని రెండవ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. పాలక సోషల్‌ డెమోక్రాట్లను మూడో స్థానానికి నెట్టింది. ఫ్రాన్స్‌లో మేరీ లీపెన్‌ నాయకత్వంలోని రసెంబ్లెమెంట్‌ నేషనల్‌ లేదా నేషనల్‌ ర్యాలీ దేశాధ్యక్షుడు మాక్రాన్‌ కన్నా రెట్టింపుగా 32 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇటలీలో ప్రధాని గ్లోరియా మెలోనీ ‘ఫ్రటెల్లి డి ఇటాలియా’ 29 శాతం ఓట్లు తెచ్చుకుని మళ్లీ ఫ్రధాన రాజకీయ శక్తిగా పునరావిర్భవించింది.
పొదుపు పోట్లతో కుదుపు
సోషల్‌ డెమోక్రాట్లు, కన్జర్వేటివ్‌లు అధికారంలో వున్న చోట్ల అనుసరించిన ‘పొదుపు’ చర్యల ఫలితమే పచ్చి మితవాద పార్టీల ఈ విజయం. వారు ఆ పేరుతో సామాజిక సంక్షేమ పథకాలను తీవ్రంగా కోత కోశారు. పదవీ విరమణ వయస్సు పెంచారు. పెన్షన్లు తగ్గించారు. సామాన్య ప్రజలపై విధించిన రకరకాల పన్నులతో వారి జీవనోపాధి దెబ్బ తినిపోయింది. తత్ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగిన తీరును యూరోపియన్‌ కమిషన్‌ జరిపిన సర్వే విదితం చేసింది. 2024 వసంత కాలంలో జరిపిన ఈ సర్వేలో 46 శాతం మంది తమ జీవన స్థాయి పడిపోయిందనే అభిప్రాయం వెలిబుచ్చగా ఆరు శాతం మంది మాత్రమే మెరుగు పడిందన్నారు. జీవన వ్యయం పెరుగుదల అతి పెద్ద సమస్యగా వుందని అత్యధిక యూరోపియన్లు (31 శాతం) చెప్పారు. ఆ తర్వాత నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలు (26 శాతం) పేర్కొన్నారు. ప్రజల అవసరాలను అందుకోలేకపోతున్న తమ దేశాల ప్రభుత్వాలపై 55 శాతం మంది అవిశ్వాసం వెలిబుచ్చారు. క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులపై ఆగ్రహం, ప్రధాన రాజకీయ పార్టీలపై నమ్మకం సన్నగిల్లిపోవడంతో ఎ.ఎఫ్‌.డి, రసెంబ్లెమెంట్‌ నేషనల్‌, ఫ్రటెల్లి డి ఇటాలియా వంటి పచ్చి మితవాద పార్టీలు పెరుగుదల సాధ్యమైంది. ప్రధాన స్రవంతి వ్యవస్థాగత పార్టీలు నిరుత్సాహపర్చడం వల్లనే తాము ఎ.ఎఫ్‌.డికి ఓటు చేశామని జర్మనీలో జరిగిన సర్వేలో 44 శాతం మంది చెప్పారు. ఈ పచ్చి మితవాద పార్టీలు ప్రజల అసంతృప్తిని ఆర్థిక విధానాలపై నుంచి దృష్టి మళ్లిస్తున్నాయి. ఇస్లాంపై ద్వేషం (ఇస్లామోఫోబియా), వలస వచ్చిన వారిపై వ్యతిరేకత ఉధృతంగా ప్రచారం చేశాయి. సమాజంలో తీవ్ర విచ్ఛిన్నాలు సృష్టిం చాయి. యూరోపియన్‌ యూనియన్‌పై తమ వ్యతిరేకతను కూడా అవి తగ్గించేశాయి. పై రెండు రకాల స్రవంతులను మిళితం చేసేట్టయితే యూరోపియన్‌ యూనియన్‌ పరిధిలో వలస జీవులపై మరింత కఠినతర వైఖరి తీసుకుంటామని వాగ్దానం చేశాయి. పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడ్డ మనే తమ మూకుమ్మడి నమ్మకం ఆధారంగా అన్ని తీవ్ర మితవాద శక్తులను ఒక్కటి చేయడానికి యూరప్‌లోని పాలక వర్గాలు సహాయపడ్డాయి. మితవాద యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ జార్జియా మెలోనీ నాయకత్వంలోని నయా ఫాసిస్టు పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా దానికి చట్టబద్దత కల్పించింది. దాంతో ప్రజా ప్రతిఘటన వున్నప్పటికీ ఇ.యు లో వాణిజ్య వర్గాలకు మేలు చేసే కొన్ని చట్టాలు ఆమోదం పొందడానికి వీలు కలిగింది. జాతీయ విధానాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. పెన్షన్‌ సంస్కరణలపై కార్మికుల నిరసనలు, ‘ఎల్లో వెస్ట్స్‌’ నిరనసనలపై దాడులకు దిగింది. ఈ నిరసనకారులపై ఇస్లామో వామపక్ష వాదులని ముద్ర వేసింది. ‘సంక్షేమ బిచ్చగాళ్లయిన వలసదారులు’ అని చులకన చేసింది. ఇవన్నీ అచ్చంగా లీపెన్‌ వాడిన పదాలే.
కొన్ని ఆశాకిరణాలు
ఈ విధమైన సమ్మేళనమే ఈ పచ్చి మితవాద పార్టీలకు ఆమోదయోగ్యత కల్పించి పునాది పెంచుకోవడానికి తోడ్పడింది. ఇటీవల జరిపిన ఒక అభిప్రాయ సేకరణలో రిపబ్లికన్‌ పార్టీ ఓటర్లలో యాభై శాతం మంది లీపెన్‌ పార్టీతో పొత్తును సమర్థిస్తున్నట్టు చెప్పారు. ఈ విధంగా ఆ చెదురుమదురు శక్తులే ప్రధాన శక్తులుగా తయారైనాయి. ఈ మొత్తం నిరాశామయ వాతావరణంలో ఒకే ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. ఫిన్లాండ్‌లో వామపక్ష కూటమి (వాసెమ్మిస్టోలిట్టో) 17.3 శాతం ఓట్లు అదనంగా తెచ్చుకోగలిగింది. మరోవైపున పచ్చి మితవాద ఫిన్స్‌ పార్టీ ఓట్లు 6.2 శాతం తగ్గి కేవలం 7.6 శాతానికే పరిమితమైంది. డెన్మార్క్‌లో సోషల్‌ పీపుల్స్‌ పార్టీ 17.4 శాతం ఓట్లతో పెద్ద పార్టీగా వచ్చింది. ఇక్కడ పాలక సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ 5.9 శాతం ఓట్లు కోల్పోయి 15.6 శాతం ఓట్లకే పరిమితమైంది. జర్మనీలో సహ్రా వగేనెక్ట్‌ నాయకత్వంలోని డై లింకె నుంచి విడిపోయిన పార్టీ బుండిస్‌ సహ్రా వగేనెక్ట్‌ (బి.ఎస్‌.డబ్ల్యు) ఆరు సీట్లు తెచ్చుకుని ఆశాకిరణంగా నిలిచింది. వర్గ రాజకీయాలను నొక్కి చెప్పడం ద్వారా వగేనెక్ట్‌ ఒక వేదికను సృష్టించగలిగింది. గ్రీస్‌, బెల్జియం, చెక్‌ రిపబ్లిక్‌లలోని కమ్యూనిస్టు పార్టీలు కూడా మంచి ఫలితాలే సాధించాయి. ఓట్ల శాతం పెంచుకున్నాయి. ఈ పార్టీలు కార్మికవర్గ ప్రయోజనాల కోసం నిలబడ్డాయి. ప్రజల జీవనోపాధి సమస్యలలో క్రియాశీలంగా పాత్ర వహించాయి. వలస జీవుల విషయంలోనూ సరైన వైఖరి తీసుకున్నాయి. పొదుపు చర్యలపై రాజీ లేని పోరాటం నడిపాయి. ఆ విధంగా ప్రజలకు దగ్గరై వారి విశ్వాసం పొందాయి. ఈ ఫలితాలు ఆ విధమైన సూచికలుగా వున్నాయి. పోర్చుగల్‌, సైప్రస్‌లలోని కమ్యూనిస్టు పార్టీల ఓట్లు తగ్గుదలపై, ఫలితాలపై సమీక్షించుకుం టున్నాయి. తమ నాయకత్వంలో వర్గ పోరాటాలను మరింత సంఘటితం చేసి పార్టీ నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేసుకో వడం గురించి ఆలోచిస్తున్నట్టు తొలి స్పందనలు తెలియ జేస్తున్నాయి.
ఐక్యత దిశగా అడుగులు
పచ్చి మితవాద పార్టీల పెరుగుదల యూరప్‌ అంతటా ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదాన్ని గుర్తించి మేలన్న వారు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఫ్రాన్స్‌లో ఫ్రాన్స్‌ ఇన్సొమైజ్‌, సోషలిస్టు పార్టీ, ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ (పి.సి.ఎఫ్‌)లే ఎకాలజిస్టుల వంటి వామపక్ష మధ్యేవాద, వామపక్ష శక్తులు ఒక కూటమిగా పాపులర్‌ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. ఫలితాలు వచ్చాక వారంలోనే ఈ ఫ్రంట్‌ ఏర్పడింది. దేశమంతటా జరిగిన అనేక ప్రదర్శనలు, సభలు వాటిలో వేలకు వేల మంది పాల్గొన్న దానికి ప్రతిస్పందనగా ఈ ఫ్రంట్‌ ఏర్పడింది. ఈ సమీకరణలన్నింటా మితవాద శక్తుల పెరుగుదల పట్ల ఆవేదన ప్రకటిస్తూ వామపక్షాలు చేతులు కలపాలనే భావన వినిపించింది. కనీస వేతనాల పెంపు, ప్రభుత్వ సర్వీసులలో పెట్టుబడుల పెంపు, రిటైర్మెంట్‌ సంస్కరణల రద్దు, సంపన్నులపై పన్నుల పునరుద్ధరణ వంటి కోర్కెలతో ఈ ఫ్రంట్‌ ఒక ముసాయిదా ప్రణాళిక ప్రకటించింది. పొదుపు పేరిట ప్రవేశ పెట్టిన చర్యలను వెనక్కు తీసుకుని పర్యావరణ ప్రణాళిక దిశలో అడుగులు వేయాలని కోరింది. పచ్చి మితవాద శక్తుల ముప్పును తిప్పి కొట్టాలంటే ఆర్థిక విధానాలపై వారిని ఢకొీనాలి. వారి సామాజిక, సాంస్కృతిక విధానాలను సవాలు చేయాలి. దోపిడీకి గురయ్యే వారందరినీ ఐక్యం చేసి బహుముఖ పోరాటాలు నిర్వహించడం ద్వారానే ఈ పచ్చి మితవాద శక్తులను ఓడించడం సాధ్యం.
(జూన్‌ 19 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

Spread the love