Wednesday, August 12, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సీఎం చెప్పినా.. 
మంత్రులు లెక్కచేయట్లే

సీఎం చెప్పినా.. 
మంత్రులు లెక్కచేయట్లే

- Advertisement -


 నిధుల కోసం ఫోన్ చేస్తున్నా.. రెస్పాండ్ కావట్లే
 కొందరి దౌర్భాగ్యుల వల్లే పార్టీ మారాల్సి వచ్చింది : బాన్సువాడ ఎమ్మెల్యే ‘పోచారం’ హాట్ కామెంట్స్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి

వ్యవసాయరంగ ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాల్సి వచ్చిందని, కానీ నిధుల కోసం సీఎం చెప్పినా.. మంత్రులు వినట్లేదని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం లో నిధుల విషయమై మంత్రులు స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన పోచారం.. తాజాగా సీఎంతో పాటు మంత్రులపైన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో మంగళవారం పలువురు రైతులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన ఆవేదనను వ్యక్తపరిచారు. 2024, జూన్ 20న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ చేసి నియోజకవర్గంలో నిధుల విషయంలో సమస్యలున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పి ఇంటికి వచ్చారని, సీఎంతో అప్పుడే ఫోన్‌‌లో మాట్లాడించడంతో మరునాడే సీఎం రేవంత్‌రెడ్డి తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కోసం వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణాల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.70 కోట్లతో పాటు నియోజకవర్గంలో కార్యకర్తలు చేపట్టిన వివిధ పనుల కోసం ఎస్డీఎఫ్ నిధులు రూ.100 కోట్ల విషయం ప్రస్తావిస్తే విడుదల చేస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ జెండా కండువా కప్పుకున్నట్టు తెలిపారు. కానీ ఇప్పటి వరకు నిధులు విడుదల చెయ్యలేదని.. ఎస్డీఎఫ్ రూ.100 కోట్లకు గానూ రూ.30 కోట్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు సుమారు రూ.25 కోట్లు విడుదల చేసి.. రూ.45 కోట్లు పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. గతేడాది నవంబర్‌లో ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశంలో తాను సీఎంను ప్రశ్నించానని.. “పార్టీ మారేందుకు ఏమైనా డబ్బులు తీసుకున్నానా.. లేక నన్ను కొన్నావా” అని అడిగితే సీఎం అలాంటిదేమీ లేదని చెప్పారని అన్నారు. నిధుల విషయం ప్రస్తావిస్తే రెండు విడతల్లో విడుదల చేయాలని మంత్రులు భట్టి విక్రమార్కకు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సూచించారని తెలిపారు. తర్వాత ఫోన్ చేస్తే మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సీఎం ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడి అక్కడే ఉన్న వేం నరేందర్‌రెడ్డిని పిలిచి మూడు విడతల్లో పూర్తి నిధులు విడుదల చేయాలని ఆయనకు సూచించారని చెప్పారు. తర్వాత రోజు నుంచి ఆయనకు సుమారు 50 సార్లు ఫోన్ చేసినట్టు తెలిపారు. అప్పుడు చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, కొందరి దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. అన్నం పెట్టిన వారిని మరువవద్దని.. ఆ సమయంలో పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చినా కేసీఆర్‌ను మోసం చేయడం ఇష్టం లేకపోయినా కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారాననంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -