Wednesday, August 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా ఇవ్వాలి

‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా ఇవ్వాలి

- Advertisement -


తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై
 కేంద్రం వివక్ష తగదు
తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సర్కారును ఒప్పించాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ ‌చేశారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధ్యం కాదని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ పట్ల వివక్షేనని స్పష్టం చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యంత క్షామ పీడిత, వెనుకబడిన మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా జలాలను అందించే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేంద్ర సహాయం విషయంలో కేంద్రం తాత్సారం చేయడం తగదని సూచించారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, ఇతర విషయాలలో దశాబ్దాల జాప్యం కారణంగా కొన్ని తరాలు నష్టపోయాయనీ, మరింత ఆలస్యం వల్ల నష్టం పెరగడంతో పాటు, వ్యయం కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్ రాష్ట్ర అంశాలను సామరస్యంగా పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదని విమర్శించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కావాల్సిన వనరులను కేటాయిస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం జాతీయ హోదా, నిధులు ఇవ్వాలనీ, ఈ విషయంలో కేంద్రంపై రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రాజెక్టులపై సాచివేత ధోరణిని వీడాలనీ, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, సహాయాన్ని నిర్ణీత కాలవ్యవధిలోగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -