నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో మేడే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ రాంపల్లి రమేష్ అధ్యక్షతన ఎంహెచ్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..144 సంవత్సరాల క్రితం కార్మికలోకం కదంతొక్కి 8 గంటల పని దినాన్ని సాధించుకుందని, వారి త్యాగాలకు, పోరాటాలకు చిహ్నం మేడే అని ఆయన తెలియజేశారు.
వామపక్షాల పాలనలో భూతల స్వర్గాన్ని తలపించే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసి చూపించామన్నారు. అనేక అడ్డంకులు ఎదురైనా మార్క్స్-ఏంగెల్స్ మౌలిక సిద్ధాంతానికి అనుగుణంగా పాలన సాగించామని, వారి ఆశయాల అమలుకు నిరంతరం శ్రమించామన్నారు. ప్రస్తుత కాలంలో వామపక్షాలకు బలం తగ్గినా..ఆదరణ తగ్గలేదని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణమాలు సామ్రాజ్యవాద పతనానికి దారితీస్తున్నాయని అందుకు నిదర్శనం అమెరికా-ఇజ్రాయిల్ వైఖరే కారణమన్నారు. 65 రోజులు సాగినా ఇరాన్-అమెరికా యుద్దంలో ట్రంప్ ప్రపపంచ వ్యాప్తంగా అపఖ్యాతి మూటకట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కానీ మోడీ ట్రంప్‌కు బానిసగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా కుటీల రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారని, ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి అనైతికంగా ఆప్ ఎంపీలను బీజేపీలోకి ఆహ్వానించారని ధ్వజమెత్తారు.


















