– భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతి మహిళకూ సాధికారత కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే లక్ష్యాన్ని సాధించటం దేశంలోని ప్రతి మహిళ బలం, స్వావలంబన, సాధికారతపై ఆధారపడి ఉన్నదని ఆమె తెలిపారు. అణగారిన వర్గాలను, ముఖ్యంగా మహిళలను ఉద్ధరించడంలో స్వయం సహాయక సంఘాల పాత్రను కూడా ఆమె నొక్కి చెప్పారు. జైసల్మేర్లో జరిగిన లఖపతి దీదీ సదస్సులో ప్రసంగిస్తూ ఆమె ఈ విధంగా అన్నారు. రాజస్థాన్లోని మహిళలు వారి కుటుంబాలు, ఆర్థిక పురోగతికి అందిస్తున్న సహకారాన్ని రాష్ట్రపతి ఎత్తిచూపారు. రాష్ట్రంలో 11 లక్షలకు పైగా ”లఖపతి దీదీలను” తయారు చేయటం కేంద్ర ప్రతిష్టాత్మకమైన లక్ష్యమని అన్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ‘లఖపతి దీదీ’ పథకాన్ని ప్రకటించారు. ఇందులో రెండు కోట్ల మంది మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ మైక్రో ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించేలా ప్రోత్సహిస్తారు.