– రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, వసతిగృహాలు, కేజీబీ పాఠశాలల్లో ఆహారం వికటించడంపై వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులు అస్వస్థతకు గురికావడం, కొన్ని చోట్ల విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులు తుది శ్వాస విడిచే పరిస్థితులు ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. హెల్ప్ ది పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడిలో అరవై మంది విద్యార్థులు ఆస్వస్థతకు గురయ్యారనీ, శైలజ అనే విద్యార్థిని మరణించిందని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక ఎస్పీ విద్యార్థిని, భువనగిరిలో ఇద్దరు ఎస్టీ విద్యార్థినులు మరణించారని చెప్పారు.
సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించిన మేరకు ఈ ఏడాది 42 సార్లు విద్యార్థులకు సరఫరా చేసే ఆహారం వికటించిన ఘటనలున్నాయని తెలిపారు. ఎన్సీపీసీఆర్‌లోని చాప్టర్ నాలుగు ప్రకారం విద్యార్థులకు ఆహార సరఫరా చేస్తున్నట్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. ఇదే హైకోర్టు గతేడాది, ఇటీవల జారీ చేసిన ఉత్తర్వు లను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ప్రభాకర్ వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. మొత్తం ఘటనల గురించి ఒక పట్టిక రూపంలో నివేదించాలని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.