వరి కోతలు కోసి ఇరవై ఏడురోజులు దాటింది. ఇరవై రోజుల వరకు కొనుగోలు చేసే నాథుడే లేడు. ప్రతిరోజు ఎండల్లో వడ్లను ఎండబెట్టడం కొరకు నేర్పుతూ కుప్పలు పోస్తూ మండేఎండల్లో శ్రమిస్తూ రైతులు వడదెబ్బకు తల్లడిల్లి పోతున్నారు. కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వరి కొనుగోలు చేయమని మొండికేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఏమి పట్టనట్లు ఉదాసీనంగా ఉంది. లక్షలాదిమంది తెలంగాణ, దేశంలోని రైతాంగం దిక్కుతోచక ఎండల్లో వరి కుప్పల మధ్యనే ఇంటిల్లిపాది, కూలీల జీవితం గడిచిపోతోంది. వరి కుప్పలు కాంటాలు వేసి లారీలలో మిల్లులకు చేర్చే విలువైన కాలంలో ఇరవై రోజులు వృథాగా గడిచిపోయింది.
తెలంగాణలో ప్రతి 40 కిలోల బస్తాకు మిల్లర్లు వడ్లు కేజీల చొప్పున దర్జాగా దోచుకుంటున్నారు. అంటే ప్రతి క్వింటాల్‌కు 8 కిలోల చొప్పున దిగ్గోస్తున్నారు. ప్రతి రైతు క్వింటాలుకు 190 రూపాయలు మిల్లర్లకు అర్పిస్తున్నారు. తెలంగాణలో మొత్తం వరి ధాన్యం సేకరణ ను గణిస్తే మిల్లర్ల రూ.వేల కోట్ల భారీ దోపిడీ తేలుతుంది.కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యం కాంటా కోసం క్వింటాలకు అరవై రూపాయలు ప్రతి రైతు అధికారికంగా హమాలీ చెల్లిస్తున్నారు. క్వింటాలుకు 8 కిలోల మిల్లర్ల దోపిడీ 190 రూపాయలు. క్వింటాలకు మిల్లు వద్ద హమాలీ దోపిడీ రెండు రూపాయలు.ఈ లెక్కన ప్రతి క్వింటాలుకు రైతు 252 రూపాయలు, వంద క్వింటాళ్లకు ప్రతి రైతు 26,200 నష్టపోతున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఆదివారం కురిసిన అకాల వర్షాలు రైతులకు ఎనలేని నష్టాన్ని మిగిల్చాయి. కల్లాళ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. చేతికి అందిన పంట తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. మామిడి, నిమ్మ, బత్తాయి తోటల్లో కాయలు నేలరాలి భారీ నష్టం వాటిల్లింది. సూర్యాపేటలో ధాన్యం నీటి పాలయ్యింది. ఖమ్మం, కొత్తగూడెం అనేక జిల్లాల్లో వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం సోధన పల్లి కొనుగోలు కేంద్రంలో తడుస్తున్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు టార్పాలిన్ కప్పుతుండగా పిడుగుపాటుకు గురై రైతు నీలం వెంకన్న మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని ఆరబెట్టిన గౌరయ్య సాయంత్రం నాలుగు గంటల సమయంలో మబ్బులు పడుతుండడంతో ధాన్యాన్ని కుప్పపోస్తూ కుప్పకూలిపోయాడు. రైతుల ఈ దుస్థితికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి.
గోనె సంచులు లేవు.. గోదాములు లేవు
రాష్ట్రంలో మక్కల అమ్మకం రైతులకు పెనుగండంగా మారింది. మద్దతు ధర 2400 ఉంటే, బహిరంగ మార్కెట్లో మక్కలు క్వింటాలుకు 1600-1700 పలుకుతుంది. మద్దతు ధర కంటే రూ.800 ప్రతి రైతు క్వింటాలుకు నష్టపోతున్నారు. రైతు సంఘాలు ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు మక్కల కొనుగోలు బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. నిలువకు మౌలిక సదుపాయాలు గోదాములు లేకపోవడం వల్ల మార్క్‌ఫెడ్, ఫ్యాక్స్ సహకార సంఘాలకు దిన దిన గండంగా మారింది. రాష్ట్రంలో గత యాసంగిలో నాలుగు లక్షల ఎకరాల మక్కల సాగైతే, ఈ యాసంగిలో రైతులు 16.25 లక్షల ఎకరాలలో మక్కలు సాగు చేశారు. ప్రతి ఎకరాకు 23.50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అలా 43.2 0 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు ఉత్పత్తి కావడంతో మార్క్‌ఫెడ్ తల పట్టుకుంది.గోనె సంచులు లేవు. సంచుల సరఫరా కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. గోనె సంచులు తీసుకువచ్చిన రైతుల మక్కలను మాత్రమే ప్యాక్స్ సంఘాల నాయకులు కాంటాలు వేస్తున్నారు. హమాలీల సమస్య తీవ్రంగా ఉంది. గోదాములు లేక కాంట వేసిన మక్కలను నిలువ చేయడం మార్క్ ఫెడ్ కు ప్రధాన సమస్యగా మారింది.
గోదాముల్లో పాత బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. కొనుగోలు చేస్తున్న వరి ధాన్యానికే గోదాములు లేవు. పత్తి నిలువకు సంబంధించిన గోదాములు ఖాళీగా ఉన్నా, సెప్టెంబర్‌లో వచ్చే పత్తికి గోదాములు ఖాళీ చేస్తామని కలెక్టర్లు హామీ ఇస్తేనే మక్కలకు గోదాములు ఇస్తామని నిర్వాహకులు తెగేసి చెప్తున్నారు.వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలుకానందుకు నిరసనగా కొద్ది మంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. మరింత వేగవంతంగా, సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు చేయడం కోసం సాఫ్ట్ వేర్ లో కీలక మార్పులు చేశామని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది. ఈ మార్పుతో రవాణా సమయం కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుందంటున్నా, మిల్లర్లు ఐక్యమై సాఫ్ట్వేర్ అంగీకరించమని మొండికేశారు. ప్రభుత్వ కొత్త సాప్ట్‌వేర్ ఓడిపోయింది. మిల్లర్ల దోపిడీ కోసం వారి మొండితనం గెలిచింది. 20 రోజుల పాటు ఒక్క వరిగింజ కూడా రైస్ మిల్లులకు చేరలేదు.
ఏ సాప్ట్‌వేర్ లేని రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ నిరాటంకంగా సాగి, ఏప్రిల్ లోనే సగానికి పైగా వరి కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిన గత కాలాలు ఎన్నో ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు, పొలాల నుండి కాంటాలు వేసి తరలించడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విఫలమయ్యాయి. లక్షలాది రైతుల భవిష్యత్తు పట్ల అత్యంత ప్రమాదకర వైఖరిని, వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నాయి. 145 కోట్ల ప్రజల ఆహార భద్రతకు, సుస్థిరతకు ఇది గొడ్డలి పెట్టు. కరోనా మహమ్మారిలో ప్రజలను కాపాడింది ఈ వ్యవసాయమే అని బీజేపీ, కాంగ్రెస్ లు మరిచిపోయాయి. రైతుల పంటల కొనుగోళ్ల ప్రక్రియ నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పూర్తిగా వైదొలుగుతుంది. అందులో భాగంగానే మోడీ ప్రభుత్వం వరి కొనుగోళ్ల కోటాలను గణనీయంగా తగ్గిస్తూ వస్తోంది. యాసంగి వరి, బ్రోకెన్ రైస్ ను కొనమని మోడీ ప్రభుత్వం మొండికేసింది. ఆ విధంగా దేశంలోని కోట్లాది, తెలంగాణలోని లక్షలాది రైతుల పొట్టలను కొట్టడానికి, కార్పొరేట్ల ఆదేశాలకు తలొగ్గి మోడీ ప్రభుత్వం సిద్ధపడింది.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 44-45 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. మహానగరాలు, పట్టణాల్లో ప్రజలు వీధుల్లోకి రావడం లేదు. పట్టణాల్లో రోడ్లన్నీ బోసిపోతున్నాయి.ఈ మండుటెండల్లో ఇంటిల్లిపాది, కూలీలతో రైతులు వరి ధాన్యం ఎండబెడుతూ, నేర్పుతూ కుప్పలు పోస్తూ వాటి రక్షణే నేడు లక్షలాది రైతులకు సర్వస్వమైంది. తుఫానులతో విపత్తులతో, ప్రకృతితో, మృగాలతో, కీటకాలతో, తెగుళ్లుతో పోరాడి పంటల కోతలు కోసి కుప్పలను రక్షించుకోవడంలో రైతులు గెలిచారు. పంటల కొనుగోళ్లలో బడా సంపన్నులు పాలకులు చేస్తున్న మాయాజాలాన్ని అర్థం చేసు కోవడంలో రైతులు ఓడిపోతున్నారు. కానీ ఎన్నికలలో పాలకుల వాగ్దానాల మేరకు ప్రతి గింజను కొనిపించడం అనే వాగ్దాన అమలుపై నిలేయడంలో రైతుల ఐక్యత, ఆందోళన ఆశించినంతగా లేదు.
పంట కొనుగోళ్లకు కేంద్రం కోత
అధిక నిల్వలు ఉన్నాయనే పేరిట, దేశంలో వరి గోధుమ కొత్తగా అధిక కొనుగోళ్లు చేయడం తగ్గించాలని కేంద్రం చూస్తోంది. ఇతర పంటల వైపు రైతులను మళ్లిస్తోంది కానీ వాటి మద్దతు ధరలు ఆశించినంతగా లేవు. ఆచరణలో పంటల మార్పు విధానాలు విఫలం కావడానికి ప్రధాన కారణం, అవి రైతులను ఆకర్షించే విధంగా లేవు. గత్యంతరం లేక ఎంఎస్‌పి ఉన్న వరి పంటనే అందరూ సాగు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో (ఉదా: ఒడిశా, తెలంగాణ) గతంలో ఎంత ధాన్యం పండిస్తే అంతా కొంటామని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. ఇటీవలి కాలంలో ఎగుమతి అవసరాలు, బఫర్ స్టాక్ నిబంధనల పేరిట కొనుగోలు లక్ష్యాలకు కోత విధించింది. దీనివల్ల రైతులు తాము పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభు త్వానికి అమ్ముకోలేక లక్షలాది రైతులు విలవిలలాడుతున్నారు. క్వాలిటీ రూల్స్ పేరిట తేమ శాతం, ధాన్యం నాణ్యత విషయంలో మోడీ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడం వల్ల కూడా, కేంద్ర ప్రభుత్వ కొనుగోళ్లు తగ్గుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరలను ప్రకటించి, పంటలు కొనుగోళ్ల నుంచి తప్పుకుంటుంది. వాస్తవ కొనుగోలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపై లేదా ప్రయివేటు మార్కెట్‌పై నెట్టేస్తోందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, రైతు సంఘాల ఐక్య కూటములు విమర్శిస్తున్నాయి. దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంటలు కొనుగోళ్లకు నిధులు కేటాయించకుండా చేతులెత్తేస్తున్నాయి. అందుకే రైతుల పంటల కొనుగోలుకు నోచుకోకుండా 45 డిగ్రీల ఎండల్లో కుప్పలతో పాటు వాటి రక్షణలో ప్రతిరోజు మండిపోతున్నారు.
దేశంలోని రైతులు రెండు ముఖ్యమైన డిమాండ్లు చేస్తున్నారు. వడ్లు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. ఎంఎస్‌పికి చట్టపరమైన హక్కు కల్పించాలి. ప్రస్తుతం ఎంఎస్‌పి మోడీ ప్రభుత్వం డొల్ల విధానం మాత్రమే. రైతులను రక్షించే చట్టబద్ధమైన హక్కు కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 23 పంటలకు ఎంఎస్‌పి ప్రకటించింది. కానీ వాస్తవ కొనుగోలు ప్రధానంగా రెండు పంటలకే, అవి వరి, గోధుమలకే పరిమితమైంది. మిగతా 21 పంటల కొనుగోలును గాలికి వదిలేసింది కేంద్రం. ఆ కోట్లాది రైతుల పంటలను, జీవితాలను ప్రయివేటు వ్యాపారుల అంగట్లో వేలం వేస్తుంది. అందుకే ఈ దుస్థితి. నరేంద్ర మోడీ 2020 వ్యవసాయ చట్టాల ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ నియంత్రణ నుండి పంటల కొనుగోళ్లను తప్పించడం. మార్కెట్లను ప్రభుత్వ నియంత్రణ, నిబంధనల నుండి విముక్తి చేయడం. రైతులు ప్రత్యక్షంగాబడా ఆహార కంపెనీలకు అమ్మే అవకాశం కల్పించడం. కానీ దేశ రైతుల భయం నేడు నిజం అవుతుంది. కేంద్ర తప్పుకుంటే, రాష్ట్రం చేతులెత్తేసింది. అంతిమంగా ఎంఎస్‌రెంటీ అనేది వట్టి డొల్లగా మారింది.
రైతులు ఆందోళన ఏమిటంటే, వ్యవసాయ రంగం కార్పొరేట్లకు తెరుచు కుంటే, స్థానిక మార్కెట్లలో వారి ఉత్పత్తులకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి. కనీస ధర హామీ లేకుండా, ప్రభుత్వాల కొనుగోళ్లు ఉండవు, నియంత్రణ ఉండదు. పెద్ద కంపెనీల దోపిడీలో దేశ రైతాంగం బలి పశువులుగా మారుతారు. రైతులు ఆందోళన చెందుతున్న నేటి కొనుగోళ్ల విష వలయం అందులోదే. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పేరిట మోడీ ప్రభుత్వం ఇతర దేశాల పంటలను పన్నులు లేకుండా దిగుమతి చేసుకుంటున్న విధానం కూడా భారతీయ రైతులకు సామూహికంగా ఉరివేస్తుంది. రైతులు ఐక్యమై ఈ విధానాలను అడ్డుకోక పోతే రైతుల భవిష్యత్తు అగమ్య గోచరమే.
నైనాల గోవర్ధన్
9701381799



