సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు…

– ఇరువైపుల వాహనాల నిలిపడంతో ఇక్కట్లు పడ్డ ప్రజలు…
నవతెలంగాణ – మంథని
మంథని మండల కేంద్రంలోని పాత పెట్రోల్ బంకు ప్రధాన రహదారిపై రైతన్నలు సాగునీటి కోసం రాస్తారోకో నిర్వహించారు. పొలాలు ఎండిపోతున్న కాలువల ద్వారా ప్రభుత్వం, అధికారులు నీరు సరఫరా చేయడం లేదని పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పాత పెట్రోల్ కూడలి వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చివరి ఆయకట్టు ప్రాంత రైతులకు సాగునీరు అందించి పంటలు కాపాడాలని కోరుతూ నినాదాలు చేశారు. ఎస్సారెస్పీ డి-83 కాలువ పరిధిలోని కాకర్లపల్లి, రామకృష్ణాపూర్, మైదుపల్లి, సూరయ్యపల్లి, గాజులపల్లి ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో యాసంగి వరి సాగు చేసామన్నారు. నాటు వేసి 45 రోజుల నుంచి రెండు నెలలు అవుతుండగా కీలక దశలో పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు మంథని పాత పెట్రోల్ బంక్ కూడలిలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంథని పెద్దపెల్లి రహదారిపై బైఠాయించారు. ఇప్పటికే అనేకమంది రైతుల పంట పొలాలు ఎండిపోయాయని వెంటనే కాలువ నీరు విడుదల చేస్తే సగం మేరకైనా పంటలు పండుతాయని రైతులు తెలిపారు. కాలువ నీళ్లు రావని ముందే చెప్తే యాసంగిలోవరి పంటలు వేసేవాళ్లం కాదన్నారు.మంథని సిఐ,ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో ఆందోళన విరమింప చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాస్తరోకోతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు నిరసన రాస్తారోకో విరమించలేదని భీష్మించుకుని కూర్చున్నారు. రోజులు గడుస్తున్న కాలువ నీరు రాక సక్రమంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందించి పంటలు కాపాడకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పొలాలు ఎండిపోయే పరిస్థితి దాపరిoచిందని వెంటనే అధికారులు స్పందించి కాలువ నీరు విడుదల చేయాలన్నారు.అప్పు సప్పులు చేసి పెట్టుబడి పెట్టిన అన్నదాత పొలాలకు సాగునీరు అందక ఎండిపోతున్న పంటను చూసి ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సాగునీరు అందించాలని కోరారు.సంఘటన స్థలానికి మంథని హార్డీవో హనుమ నాయక్ చేరుకొని రైతులతో సంప్రదించి మాట్లాడారు. రైతుల సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు కాలువ నీరు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Spread the love