ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

– జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
– తాడ్వాయి మండలం లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 
నవతెలంగాణ – తాడ్వాయి 
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం లో,  జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు పై శిక్షణ తరగతుల  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రైతులు తమ పంటకు మద్దతు ధర సాధించడానికి నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ధాన్యాన్ని బాగా ఆరబెట్టి చెత్త, తాలు, మట్టి పెడ్డలు , రాళ్లు లేకుండా శుభ్రపరచాలని అన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పంట తీసుకొని రావాలని తెలిపారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులు తమ ఫోన్ నెంబర్ ను ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి తీసుకుని రావాలని, ధాన్యం విక్రయించే సమయంలో ఓటిపి కోసం సెల్ ఫోన్ తీసుకుని రావాలని , ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం బ్యాంక్ ఖాతా పుస్తకం తమ వెంట తీసుకుని రావాలని అన్నారు. అంతేకాకుండా, కోనుగోలు కేంద్రంలో అవసరమైన మౌళిక వసతులను సరి చూసుకొని, అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొని, సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని, రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సి హెచ్ మహేందర్ జి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ రాంపతి, డి ఏ వో  విజయ్ చంద్ర , డి సి ఓ సర్దార్ సింగ్, గిరిజన సహకార సంస్థ మేనేజర్ దేవా,  స్థానిక ఎమ్మార్వో తోట రవీందర్, ఎల్ డి  యం రాజ్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి పోరిక జై సింగ్, పిఏసిఎస్ సీఈవో స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love