నవ తెలంగాణ- నవీపేట్: మద్యం ఇవ్వనందుకు ఒకరిపై తండ్రి కొడుకులు దాడి చేయగా బాధితుడు మృతి చెందిన సంఘటన నవీపేట్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నార్త్ రూరల్ సిఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దర్యాపూరు కాలనీకి చెందిన కొక్కుల సాయిరాం(42) దుబాయ్ నుండి కొన్ని రోజుల క్రితం తిరిగివచ్చాడు. మద్యంకు బానిస కావడంతో స్థానిక చేపల మార్కెట్ షెడ్డులో ఆదివారం మద్యం సేవిస్తుండగా లింగమయ్య గుట్టకు చెందిన ధైరంగుల నాగరాజు మద్యం ఇవ్వాలని కోరగా ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. నాగరాజు కడుపు, చాతిపై తీవ్రంగా కొట్టడంతో పాటు అతని కొడుకు గణేష్ సైతం తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితుడి కుమారుడు అతన్ని స్థానిక ఆర్ఎంపి వైద్యుడి వద్ద చికిత్స చేసి ఇంటికి తీసుకెళ్లగా అతను గత రెండు రోజుల నుండి ఆహారం తీసుకోకపోవడం రాత్రి సైతం తినకుండా నిద్రపోవడంతో సోమవారం ఉదయాన్నే మృతి చెందాడు. మృతుడి భార్య కొప్పుల ఇందిరా ఫిర్యాదు మేరకు సీఐ సతీష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం మేరకు నిజామాబాద్ ఏసీబీ కిరణ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట ఎస్సై యాదగిరి గౌడ్ ఉన్నారు.