నవతెలంగాణ-మల్హర్ రావు
ఎకరాల కొద్దీ కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా ఎరువులు పట్టాదారు పేరిట పొందాల్సివస్తోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తీసు కొచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ తో కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడంలేదంటున్నారు. పట్టాదారుడి ఆధార్, ఓటీపీతో యాప్ ద్వారా ఎరువులు విక్రయిస్తున్నారు. కొందరు యజమానులు ఇవ్వకపోవడంతో కౌలు రైతులు ఎరువులు పొందలేకపోతున్నారు. యాప్లో పలు గ్రామాల వివరాలు అందుబాటులో లేవు. పట్టాలు ఉన్న రైతులు సైతం ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. మండలాన్ని ఒక యూనిట్గా పరిగణించి షాప్లు కేటాయించడంతో స్థానికంగా కాకుండా ఇతర గ్రామాల్లోని దుకాణాల్లో ఎరువులు బుక్ అవుతున్నాయని రైతులు అంటున్నారు. దీంతో అంత దూరం నుంచి ఎరువులు తెచ్చుకునేందుకు అదనపు రవాణా భారం పడుతోందని వాపోతున్నారు.
గుర్తింపు కార్డులివ్వాలి
మండలంలో సుమారు వేయ్యిమంది కౌలు రైతులు దాదాపు 4 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు అంచనా. అయితే, సాగు చేస్తున్న రైతుకే ఎరువులపై హక్కు ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు. పట్టాదారుల మాదిరిగానే తమ పేర్లతోనూ ఎఫ్ఎఫ్ఎస్ యాప్లో ఎరువులు పొందే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



