ఓట్లు కాదు! పోరాటాలే కమ్యూనిస్టుల ఆయువుపట్టు!

అసెంబ్లీ ఎన్నికలలో వినియోగించుకున్న ఓటుకు గుర్తుగా ఎడమ చేతి చూపుడు వేలు మీద వేసిన సిరా చెదిరిపోక ముందే ప్రజా సమస్య లపై గళం విప్పారు కమ్యూనిస్టులు. వారు బలహీనంగా ఉన్నారని భావిం చే జగిత్యాల జిల్లాలో 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో 8 వేల గుడిసెలు వేశారు. గూడు లేని ప్రజలు గెలిచిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లలేదు. గట్టి పోటీ ఇచ్చిన ఇతర పార్టీల అభ్యర్థుల వద్దకు వెళ్లలేదు. వారు ఎర్రజెండాను నమ్ముకున్నారు. గోదావరిఖని, ఎన్టీపీసీ, కోరుట్లలో 600 పైగా పక్కా ఇండ్లను ప్రజలు నిర్మించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక భూ పోరాట కేంద్రాలలో పేదల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. తొమ్మిదిన్నర సంవ త్సరాలు కేసీఆర్‌ అధికారంలో ఉండి కేటాయించిన బహుళ అంతస్తుల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల సంఖ్య కంటే ఇవి చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఆరు నెలలుగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలు, ఆందోళనలు చేపట్టిన అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్‌, గ్రామపంచాయతీ కార్మికులు, ఆరోగ్య శాఖ లోని ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, హమాలీలు, బిల్డింగ్‌ నిర్మాణ కార్మికులు, ప్రయివేటు ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు వారి యూనియన్ల నాయకత్వంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సంబంధిత శాఖల మంత్రులను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవిస్తున్నారు. పరిష్కరిస్తే సరి, లేదంటే ఉద్యమానికి రెడీ అంటున్నారు.
గత దశాబ్ద కాలంగా ఎన్నికల రాజకీయాలలో కమ్యూనిస్టులు బల హీనపడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలలో ప్రభుత్వాలను కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన వివిధ ఎన్నికలలో కూడా ఓట్లు, సీట్లు తగ్గిపోవడం ఈ అభిప్రాయానికి కారణంగా ఉన్నది. సాంప్రదాయానికి భిన్నంగా కేరళలో వరుసగా రెండవసారి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చినప్పటికీ, బీహార్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలో ఓట్లు, సీట్లలో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ బూర్జువా, భూస్వామ్య శక్తు లు, మీడియా, సోషల్‌ మీడియా అదే పనిగా కమ్యూనిస్టుల పని అయిపో యిందని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా వామపక్షాలతో ఎన్నికల పొత్తు విషయంలో అవకాశవాదంగా వ్యవహరించిన బిఆర్‌ఎస్‌ ను, ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసిన కాంగ్రెస్‌ ను కాకుండా వామపక్షాలపై ముఖ్యంగా సీపీఐ(ఎం)పై విమర్శలు ఎక్కుపెట్టారు.
మొసలి బలం నీటిలోనే. కమ్యూనిస్టుల బలం ప్రజా ఉద్యమాలతోనే. ఆ మాటకొస్తే సమాజ పురోగమ నానికి ప్రధాన కారణం ప్రజా ఉద్యమాలే. సారా వ్యతిరేక ఉద్యమం, కుల నిర్మూలన పోరాటం, బాల్య వివాహాల రద్దు పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వర్లీ ఆదివాసి తిరుగు బాటు, పోడు భూముల పోరాటం, బొగ్గు గని కార్మికుల పోరాటం, ఆర్టీసీ, విద్యుత్తురంగ సంస్కరణల వ్యతిరేక ఉద్యమాలు ఎన్నో జరిగాయి. స్వాతం త్య్రానికి ముందు ఆ తర్వాత జరిగిన అనేక ప్రజా పోరాటాల ఫలితంగానే ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కొన్ని చట్టాలు, చట్ట సవరణలు, సంస్క రణలు జరిగాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్లనే భూ సీలింగ్‌ చట్టం, రక్షిత కౌలుదారి చట్టాలు వచ్చాయి. ప్రభుత్వం కొంత భూమిని పంచింది. వినోబభావే భూదాన్‌ సంస్కరణ ఉద్యమం వచ్చింది. 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్‌ సంస్కరణల వ్యతిరేక పోరాటం ఫలితమే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌. కుల వివక్ష వ్యతిరేక పోరాట ఫలితం జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల చట్టబద్ధత పోరాట ఫలితమే.
లోక్‌ సభలో 303 సీట్లతో సంపూర్ణ మెజార్టీ కలిగిన బీజేపీ ప్రభుత్వం తాను తీసుకు వచ్చిన మూడు రైతు చట్టాలను తానే రద్దు చేయడానికి కారణం ఢిల్లీ కేంద్రంగా ఏడాదికి పైగా రైతాంగం నిర్వహించిన ఉద్యమం. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినవి వామపక్ష రైతు సంఘాలు. ఈ ఉద్యమ స్ఫూర్తితోనే ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, పాండిచ్చేరి, హర్యానా తదితర రాష్ట్రాల్లో వినియోగదారులకు, ఉద్యోగులకు తీవ్ర నష్టదాయకమైన విద్యుత్‌ సవరణ చట్టాలను వెనక్కి తిప్పిగొట్టగలిగింది. ఆయా రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉద్యోగులు చేసిన సమ్మె పోరాటాల వల్లే ఇవి సాధ్యమయ్యాయి. ప్రజా ఉద్యమాలకు ఉండే శక్తి అటువంటిది. అందుకే కమ్యూనిస్టులు ప్రజా ఉద్యమాలకు ఊపిరిలౌతారు. వాటికే ప్రథమ ప్రాధాన్యతను ఇస్తారు. ప్రజా ఉద్యమాల ఫలితంగానే కమ్యూనిస్టులు చట్టసభలకు ఎన్నికైనారు. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. వాటిని ఉపయోగించింది ప్రజా సమస్యల పరిష్కారం కోసమే. యూపీఏ-1 కు ఇచ్చిన మద్దతు ఫలితం సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం తీసుకురాగలగడం.
ఆయా వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా పట్టి పోరాడుతున్నారు. సాధారణ ఎన్నికలలో కమ్యూని స్టు పార్టీలకు పెద్దగా ఓట్లు వేయని కార్మికవర్గం పరిశ్రమలలో జరిగే యూ నియన్‌ గుర్తింపు ఎన్నికలలో మాత్రం ఎర్రజెండా యూనియన్లనే ఎక్కువగా ఎన్నుకుంటున్నారు. ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడే హరీష్‌రావును, హోం మం త్రిగా పనిచేసిన నాయిని నరసింహారెడ్డిని, బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రఘునందన్‌రావు వంటి అనేకమందిని వివిధ పరిశ్రమల యూనియన్‌ గుర్తింపు ఎన్నికలలో ఓడించి, సీఐటీయూను గెలిపించారు. సింగరేణి, ఆర్టీ సీ వంటి సంస్థలలోనూ ఎక్కువసార్లు గెలిచినవి ఎర్రజెండా యూనియన్లే. పోరాటాలలో ఎర్రజెండా నీడన చేరుతున్న ప్రజలు, పరిశ్రమలలో ఎక్కువ శాతం ఎర్రజెండా యూనియన్లనే గెలిపిస్తున్న కార్మికులు సాధారణ ఎన్నిక లలో కమ్యూనిస్టులకు ఓట్లు ఎందుకు వేయడం లేదు? అది కమ్యూనిస్టు శ్రేణులు అర్థం చేసుకోవాల్సిన అంశం. ప్రజల జీవితాలకి సంబంధించిన ప్రతి పార్శ్వాన్ని టచ్‌ చేసేలా కమ్యూనిస్టుల పని ఉండాలని లెనిన్‌ చెప్పిన మాటలను గమనంలో ఉంచుకుని కృషి చేయాలి.
– గీట్ల ముకుంద రెడ్డి, 94900 98857

Spread the love