– సిల్క్యారా సొరంగ ప్రమాదంపై ఆర్టీఐ సమాధానం
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదంలో టన్నెల్లో చిక్కుబడిపోయిన 41 మంది కార్మికులు 17 రోజుల పాటు క్షణమొక యుగంలా గడిపి చివరికి సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి గురైన అండర్‌పాస్ నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ నవయుగపై ఇప్పటి వరకూ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడీసీఎల్) ఇచ్చిన సమాధానం ఇది. ఈ కార్పొరేషన్ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఈ సొరంగ నిర్మాణాన్ని చేపట్టింది.
ఆర్టీఐ కింద అజరు బోస్ అడిగిన ప్రశ్నకు ఎన్హెచ్ఐడీసీఎల్ (బార్కోట్) జనరల్ మేనేజర్ కల్నల్ ప్రదీప్ పాటిల్ సమాధానం ఇస్తూ ప్రమాదంపై జరిగిన విచారణకు సంబంధించి నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. విచారణ కమిటీ గత నెల 13-15 తేదీల మధ్య ఘటనా స్థలాన్ని సందర్శించిందని, అయితే కమిటీ నివేదికను ఇంకా ప్రచురించలేదని వివరించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో నాగపూర్-ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదంలో 20 మంది కార్మికులు, ఇంజినీర్లు మరణించిన ఘటనను మరువక ముందే మూడు నెలల తర్వాత సిల్క్యారా సొరంగంలో ప్రమాదం చోటుచేసుకుంది. దాని ప్రధాన కాంట్రాక్టర్ కూడా నవయుగ సంస్థే. అయితే సబ్-కాంట్రాక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేలో కొంత భాగాన్ని నిర్మించేందుకు సబ్-కాంట్రాక్ట్ ఇచ్చారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ చార్‌ధామ్‌ను సందర్శించేందుకు వీలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సిల్క్యారా సొరంగ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.