నవతెలంగాన – హైదరాబాద్ : నాంపల్లి రైల్వే స్టేషన్‌లో నిన్న సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న హైదరాబాద్-జైపూర్ స్పెషల్ ట్రైన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ప్రయాణికులు ఎక్కకముందే ఈ ఘటన జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, రాత్రి 7:50 గంటలకు జైపూర్ బయలుదేరాల్సిన స్పెషల్ రైలును ప్లాట్‌ఫామ్ 4 పైకి తీసుకొస్తున్న సమయంలో, సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో B1, B2 ఏసీ కోచ్‌ల నుంచి దట్టమైన పొగ, మంటలు వచ్చాయి.
ఆ సమయంలో బోగీలు ఖాళీగా ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మూడు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా మంటలు వ్యాపించిన రెండు కోచ్‌లను రైలు నుంచి వేరు చేశారు.



