చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో అగ్నిప్రమాదం

Fire in Chevella Government Hospital– డయాలసిస్‌ సెంటర్‌లో కొంత భాగం దగ్ధం
– బయటకు పరుగులు తీసిన రోగులు, ఆస్పత్రి సిబ్బంది
– ఫైర్‌ ఎక్స్‌ విషర్‌తో మంటలార్పిన సిబ్బంది
– ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌
– కమిషనర్‌ డాక్టర్‌ అజయ్ కుమార్‌
నవతెలంగాణ-చేవెళ్ల
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌తో డయాలసిస్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ చూసిన సిబ్బంది, ఆస్పత్రిలోని రోగులను బయటకు పంపించారు. సిబ్బంది కూడా బయటకు పరుగులు తీశారు. డయాలసిస్‌ సెంటర్‌కు తాళం వేసి ఉండటంతో మంటలు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని పోలీస్‌, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అంతలోపే డయాలసిస్‌ సెంటర్‌ ఇన్‌చార్జి వచ్చి ఫైర్‌ ఎక్స్‌ విషర్‌ మిషన్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఫైర్‌ సిబ్బంది మిగతా మంటలను ఆర్పి వేశారు. అప్పటికే ఆస్పత్రిలోని ఫైల్స్‌, డయాలసిస్‌ వైద్య పరికరాలు కాలిపోయాయి. విద్యుత్‌ అధికారులు ఆస్పత్రికి చేరుకొని విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌ తన సిబ్బందితో ఆస్పత్రికి చేరుకొని షార్ట్‌ సర్క్యూట్‌ సంబంధించిన వివరాలను తెలుసుకొని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్‌ జరిగిన సమయంలో కాన్పు నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలు, పలువురు బాలింతలు, కొంతమంది ఇన్‌ పేషెంట్స్‌ ఉన్నారు. ఆస్పత్రిలో కరెంటు నిలిచిపోవడంతో రోగులు గంటల తరబడి బయటే ఉండాల్సి వచ్చింది. కాగా, పాడైపోయిన వైరింగ్‌, ఆస్పత్రిలో అంతర్గత విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడమే అగ్ని ప్రమాదానికి కారణమని విద్యుత్‌ అధికారులు స్పష్టం చేశారు. డయాలసిస్‌ సెంటర్‌ రాత్రి వేళలో నిర్వహణ జరగదు. అదే పగలు జరిగి ఉంటే డయాలసిస్‌ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండేది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్ కుమార్‌
విధుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజరు తెలిపారు. శనివారం రాత్రి చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించేందుకు ఆదివారం ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ప్రమాదానికి కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో వెంటనే స్పందించిన సిబ్బందిని అభినందించారు. సాయింత్రంలోగా డయాలసిస్‌ సెంటర్‌లోని విద్యుత్తును సరి చేయడంతో పాటు రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమవారం నుంచి యధావిధిగా డయాలసిస్‌ సేవలు అందించాలని తెలియజేశారు.

Spread the love