నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ తీరంలో కార్గో షిప్ లో రెండో రోజు కూడా మంటలు, పేలుళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. కంటైనర్లలో ఉన్న వివిధ కెమికల్ పదార్థాల కారణంగా పేలుళ్లు కొనసాగుతున్నాయి. దీంతో నాలుగు రెస్క్యూ బోట్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. మంటలు అదుపులోకి రావడం లేదు. మిడ్-షిప్ ప్రాంతం- వసతి బ్లాక్‌కు ముందున్న కంటైనర్ బే నుంచి మంటలు చెలరేగుతున్నట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 18 మందిని కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడి సురక్షితంగా తరలించారు.
కాగా, కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా బెయ్ పూర్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం సింగపూర్ కంటైనర్ నౌక లో పేలుడు సంభవించింది. దీంతో ఈ నౌకలో అగ్ని కీలలు అంటుకున్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో నౌక లోపలి డెక్కులో పేలుడు సంభవించింది. కొచ్చికి 315 కిలోమీటర్ల దూరంలో, బెయ్ పూర్ కు పశ్చిమ దిశలో సుమారు 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. నౌక కోలోంబో నుంచి మహారాష్ట్రలోని నహవా శేవా (ముంబయి) వైపు ప్రయాణిస్తుంది. 270 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. ఇది జూన్ 7న కోలంబో నుంచి బయలుదేరింది, జూన్ 10న ముంబయికి చేరుకోవాల్సి ఉండగా.. అనుకోకుండా పేలుడు సంభవించింది.