యూపీలో సీట్ల సర్దుబాటులో తొలి అడుగు

యూపీలో సీట్ల సర్దుబాటులో తొలి అడుగు– కాంగ్రెస్‌తో చర్చల్లో 11 స్థానాలపై పురోగతి : అఖిలేష్‌
లక్నో : రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు ప్రయత్నాల్లో తొలి అడుగు పడిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 11 కీలకమైన లోక్‌సభ స్థానాలకు సంబంధించి చర్చల్లో పురోగతి సాధించామని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. దేశంలో అత్యధికంగా లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఇదే.
‘కాంగ్రెస్‌తో మా సహృద్భావ పొత్తులో తొలి అడుగు పడింది. పదకొండు కీలకమైన స్థానాల విషయంలో పురోగతి ఉంది. ఇది కొనసాగుతుంది. ఇండియా జట్టుతో చరిత్రను మార్చేయాలన్నదే మా లక్ష్యం’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో అఖిలేష్‌ తెలియజేశారు. మరోవైపు కాంగ్రెస్‌ మీడియా విభాగం అధిపతి జైరాం రమేష్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అశోక్‌ గెహ్లాట్‌, అఖిలేష్‌ యాదవ్‌ మధ్య సీట్ల సర్దుబాటుపై నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాజ్‌వాదీ పార్టీ నేత ఫక్రుల్‌ హసన్‌ చాంద్‌ తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ పెద్దది. ఢిల్లీ చేరాలంటే యూపీ మీదుగానే పోవాలి. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ ఇస్తున్న సందేశం ఇండియా కూటమిని బలోపేతం చేస్తుంది’ అని చాంద్‌ అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ యూపీ నుండి రెండు స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీకి 7.53% ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ బలం బాగా తగ్గింది. ఆ పార్టీ 6.36% ఓట్లతో కేవలం ఒకే స్థానాన్ని దక్కించుకుంది.

Spread the love