బురదలో కూరుకుపోయిన వాహనాలు.. ట్రాఫిక్ జామ్
ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
భారీగా ఆస్తి, ప్రాణనష్టం
హిమాచల్, మహారాష్ట్రలో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా కిశ్త్వాడ్లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ సైట్కు వెళ్లే రహదారిపై భారీగా బురద పేరుకుపోయింది. ఫలితంగా వాహనాలు, మిల్లులు, యంత్రాలు అందులో చిక్కుకుపోయాయి. మరికొన్ని రాళ్ల కింద కూరుకుపోయాయి. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఆకస్మిక వరదల కారణంగా భారీ పరిమాణంలో బురద, బండరాళ్లు ప్రాజెక్టు ప్రాంతంలోకి కొట్టుకువచ్చాయని అధికారులు తెలిపారు. దీనివల్ల ట్రక్కులు, ఇతర నిర్మాణ పరికరాలతో సహా అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయని పేర్కొన్నారు. నిర్మాణ సామగ్రి కూడా దెబ్బతిందన్నారు. అనేక వాహనాలు తీవ్రంగా దెబ్బతిని శిథిలాల కింద చిక్కుకుపోయాయని, వాటిని వెలికితీయడానికి, ప్రభావిత ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది, రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే, హైవేపై భారీగా బురద పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, రియాసి జిల్లాలోని ఎత్తైన ప్రాంతాల్లో కూడా చిన్నపాటి ఆకస్మిక వరద ఘటనలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోని బలహీన ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రభుత్వం అంతకుముందే హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా వాగులు, నదులు సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలు
- Advertisement -
- Advertisement -



