సాంఘిక విప్లవ పితామహుడు ఫూలే

Mahatma Jyotirao Phuleఇల్లాలికి అక్షరాలు నేర్పి లింగబేధం చదువుకు అడ్డం లేదని నిరూపించిన జ్ఞాననేత్రుడు, సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. పద్దెనిమిదవ శతాబ్దంలోనే అణగారిన వారి హక్కులకు, విద్యకోసం పరితపించిన మహోన్నతుడు. మహారాష్ట్ర లోని పూణేలో 11 ఏప్రిల్‌ 1827 పూలే జన్మించేనాటికే సామాజిక సంస్కృతిని దేశం నుండి స్వార్థపరులు తరిమేశారు. ఏకొద్ది మంది హక్కులు, అవకాశాల కోసమే పనిచేసే విధానానికి వైదిక మతం పునాది వేస్తే, ఇప్పుడది హిందూమతం పేరుతో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్నది చూస్తూనే ఉన్నాము. దేశం స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోల్పోయి పరతంత్ర పాలనలో మగ్గిపోతున్న రోజల్లో సైతం పాలకవర్గాలు సమతా న్యాయానికి తూట్లుపొడిచారు. విచ్చిన్నకర సనాతన సాంప్రదాయ సమాజ వ్యవస్థను వదులుకోవడానికి ఆయా వర్గాలు ఇష్టపడలేదు. పైగా పరాయి పాలకుల అడుగులకు మడుగులొత్తి తమ పబ్బం గడుపు కున్నారు. పాలకవర్గాలకు నిమ్న కులాలకు శత్రువులుగా ముద్రవేశారు.ఈ దేశంలో మతాంతరీకరణ వారి సంప్రదా యాలు, ఆచార వ్యవహారాల వల్ల కిందికులాల్లో సామాజిక దృక్పథ విప్లవ పంథా అంకురించింది.ఆ నూతన దృక్పథం ఆవిర్భావమే మహాత్మా జ్యోతిరావుపూలే.ఈ దేశంలో బిరుదులు అలంకరించుకున్న వారినే తప్ప నిజమైన మహానుభావులను ప్రజలు గుర్తించకుండా చేసే పాలన సాగుతున్నది. ముఖ్యంగా నిమ్న కులాల అస్పృశ్యుల విముక్తి కోసం ఉద్యమిస్తే ఈ సమాజం అస్సలు క్షమించదు.ఆ రోజుల్లో ఒకవైపు నిమ్నకులాల పైనా, స్త్రీలపైనా, విద్యావకాశాల నిషేధం కొనసాగింది. నిన్ను కులాలను, స్త్రీలను, అస్పృశ్యులను పట్టించుకోకుండా ఈదేశంలో ఎటువంటి సంస్కరణ గానీ, విప్లవంగానీ అర్దవంతం కాబోదని గుర్తుచేసిన మొదటి భారతీయ సంస్కర్త ఫూలే.
‘విద్యలేనిదే వికాసం-విముక్తి సాధ్యం’ కాదని అన్నాడు. స్త్రీలకోసం ప్రత్యేక విద్యాసంస్థలు నెలకొల్పాడు.తన సతీమణి సావిత్రిబాయికి విద్య నేర్పి ఆమెనే ఒక ఉపాధ్యాయురాలిగా తీర్చి దిద్దాడు. ఆమెనే ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని. సంఘసేవకోసం వారిరు వురూ నిస్వార్థంగా విద్యాబోధన చేశారు. భుక్తి కోసం సాయంత్రం వేళల్లో దర్జీ పనిచేసి బొంతలు కుట్టి ఇల్లు గడుపుకునేవారు. దేశంలో ప్రయోజన విద్యా కేంద్రాలు తొలిసారిగా స్థాపించిన ఘనత ఈ దంపతులదే. మతం ద్వారా ఎంత మోసానికి గురౌతున్నారో బడుగు వర్గాలకు తెలియజెప్ప టానికి త్రిరత్న వంటి నాటకాలు, పెక్కు కవితలు గులాం గిరి వంటి గ్రంథాలు, ఇంకా అనేక ప్రచురణలు చేశారు. వితంతువులకు, అనాధలకు శరణాల యాలకు అద్యుడు ఫూలే. బడుగువర్గాల విజ్ఞాన, వికాసాల కోసం సత్యశోధక్‌ వంటి సంస్థలు స్థాపించి వారిలో ఉద్యమ స్పృహకు నాంది పలికారు. అస్పృశ్యులకు తన ఇంట్లోనే చదువు చెప్పించి వారికి ఒకమార్గాన్ని నిర్దేశించారు. అంబేద్కర్‌ ఆయన్ను ఒక ఆదర్శమూర్తిగా, గురువుగా పేర్కొని గౌరవించేవారు. సమస్త నిమ్నకులాలకు, బడుగు వర్గాలకు ఫూలే సర్వదా సంస్కరణీ యుడు. నేటి యువత, విద్యార్థులు జ్యోతిరావుఫూలే గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(12న నీరుకుళ్లలో పూలే దంపతుల విగ్రహావిష్కరణ జరిగిన సందర్భంగా)
– డా.గడ్డం కృష్ణయ్య, 9177252419

Spread the love