సెంట్రల్ బ్యాంక్ వెల్లడి
ఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బాకీల వసూళ్ళపై కీలక దృష్టి సారించినట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో తన బ్యాలెన్స్ షీట్‌ను మరింత బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగా రూ. 3,500 కోట్ల నుండి రూ. 4,000 కోట్ల మేర నిరర్ధక ఆస్తులను రికవరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంక్ వద్ద సాంకేతికంగా రద్దు చేసిన ఖాతాలలో సుమారు రూ. 32,000 కోట్లు ఉన్నాయని.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఈ రద్దు చేసిన రుణాల నుంచే రూ.2,300-2,500 కోట్ల రికవరీని ఆశిస్తున్నామని బ్యాంక్ ఎండి అండ్ సిఇఒ కళ్యాణ్ కుమార్ తెలిపారు. నికర లాభాలను పెంచే ఈ రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడానికి బ్యాంక్ ఇప్పటికే వ్యవసాయ ఖాతాల కోసం ప్రత్యేక వన్ టైమ్ సెటిల్మెంట్ (ఒటిఎస్) పథకాలు, ప్రాపర్టీ ఎక్స్‌పోలు, సర్ఫేసి చట్టపరమైన చర్యలను ముమ్మరం చేసిందన్నారు.మరోవైపు వడ్డీయేతర ఆదాయాన్ని, ఫీజు ఆదాయాన్ని పెంచుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త వ్యాపార విభాగాల్లోకి అడుగుపెడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వెల్త్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ కార్డ్ సేవలను ప్రారంభించేందుకు బోర్డు ఆమోదం పొందడంతో ఆర్‌ఎఫ్‌పి జారీ చేసే ప్రక్రియలో ఉంది. వీటితో పాటు కార్పొరేట్ క్లయింట్ల కోసం ఆగస్టు నాటికి అధునాతన క్యాష్ మేనేజ్‌మెంట్ సేవలను, విదేశీ మారకం, లెటర్ ఆఫ్ క్రెడిట్ వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 2025-26లో ఈ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి రూ. 969.64 కోట్ల మొత్తాన్ని డివిడెండ్ రూపంలో చెల్లించింది.
రూ.4వేల కోట్ల ఎన్‌పిఎ వసూళ్లపై దృష్టి
- Advertisement -
- Advertisement -



