హైదరాబాద్ : దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్‌గా తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి డా. ఈ. విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ హోదాలో ఆయన వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (డబ్ల్యుటిఐటిసి) ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాల నేతృత్వంలోని ప్రముఖ వ్యాపారవేత్తల ప్రతినిధి బృందంతో తొలి అధికారిక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, స్టార్టప్‌లు, అంతర్జాతీయ పెట్టుబడులు వంటి రంగాల్లో భారత్–యూఏఈ మధ్య సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు మరియు పెట్టుబడిదారులకు దుబాయ్ వేదికగా మరిన్ని అవకాశాలు సృష్టించేందుకు తమ కౌన్సిల్ సంపూర్ణ సహకారం అందిస్తుందని సందీప్ కుమార్ మక్తాల పేర్కొన్నారు.



