పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలన్నా.. ఆమె హెల్తీగా ఉండాలన్నా గర్భిణీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం తీసుకునే విషయంలో కొన్ని సూచనలు పాటించాలి. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు, చేపలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. అలాగే సరైన విశ్రాంతి తీసుకోవాలి. గర్భిణీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన పండ్లు (కర్జూరం, ద్రాక్ష), నువ్వులు, చెరుకురసం, ఉలవలు తీసుకోవాలి.
రోజుకు ఒకటి చొప్పున ఐరన్ మాత్రలు వేసుకోవాలి. కొన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలు తినడం వల్ల సమస్యలు వస్తాయన్న అపోహలు ఉన్నాయి. బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందనడం ఎంత మాత్రం నిజం కాదు. ఇందులో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే తొందరగా జీర్ణం కాదు. కొబ్బరి నీళ్లులో ఎక్కువ మోతాదులో పొటాషియం, లవణాలు ఉంటాయి. బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు… క్యారెట్ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బీట్‌రూట్ కన్నా క్యారెట్ కొంత వరకు మంచిదే. అరటిపండు తినడం వల్ల పిల్లలు నల్లగా పుట్టరు. జున్ను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఎక్కువగా కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అందువల్ల ఎక్కువ తింటే అజీర్ణం చేయవచ్చు . అందుకే మిరియాలను కలుపుకొని తినాలి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.